3 రోజులు వడగాడ్పులు 

Next Three Days High temperature in Telangana - Sakshi

ఆదిలాబాద్, నిజామాబాద్‌ జిల్లాల్లో తీవ్రం.. 

ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం 

వాతావరణ కేంద్రం హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ తీవ్రమైన ఎండలుంటాయని పేర్కొన్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో రెండు మూడు రోజులుగా వాతావరణం చల్లబడింది. అయితే మళ్లీ ఎండలు పుంజుకున్నాయి. ఆదివారం భానుడు విజృంభించాడు. ఆదిలాబాద్‌లో ఏకంగా 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

నిజామాబాద్‌లో 44.5 డిగ్రీలు, మెదక్‌లో 44 డిగ్రీలు, రామగుండంలో 43 డిగ్రీలు రికార్డయ్యాయి. ఖమ్మం, నల్లగొండలలో 42 డిగ్రీల చొప్పున, హైదరాబాద్‌లో 41 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం తగ్గడం, ఉపరితల ద్రోణుల ప్రభావం లేకపోవడంతో ఒక్కసారిగా ఎండలు పెరిగాయని రాజారావు వెల్లడించారు. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని వెల్లడించారు. 

ప్రజలు విలవిల.. 
ఎండలు మండుతుండటంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, చర్మం పొడిబారడం, మత్తు నిద్ర, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి కలిగి ఉండటం వంటివి వడదెబ్బ లక్షణాలుగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. వడగాడ్పులు, తీవ్రమైన ఎండలు ఉన్నప్పుడు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు. పెద్దలు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మరోవైపు ఎండల తీవ్రత, వడగాడ్పుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పినా, జిల్లాల్లో యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top