ప్రధాని స్థాయికి తగ్గి మాట్లాడారు

MP Kavitha Said PM Wrong Speech In Nizamabad - Sakshi

ఆయనకు మాట్లాడే సారాంశం తప్పుగా రాసిచ్చారు 

పసుపు బోర్డు ఎందుకు ప్రకటించలేదు 

నగరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు కేటాయించింది

 మోదీ ప్రసంగపై ఎంపీ కవిత విమర్శ 

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో తనస్థాయికి తగ్గి మాట్లాడారని ఎంపీ కవిత విమర్శించారు. తన కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిజామాబాద్‌ అభివృద్ధి జరుగలేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక బీజేపీ నేతలు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మాట్లాడే సారాంశం తప్పుగా రాసి ఇచ్చారని ఎద్దేవా చేశారు. నిజామాబాద్‌ నగరంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, గత నాలుగు సంవత్సరాల్లో 28 వేల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇది సంక్షేమ రాష్ట్రమన్నారు. మూడు సంవత్సరాలుగా రూ. 300 కోట్లు ఇచ్చారని, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేకంగా మరో రూ. 100 కోట్లు కేటాయించారని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన కొనసాగుతుందన్నారు. ఎక్కడ లేని విధంగా యూజీడీ  పనులు కొనసాగుతున్నాయని తద్వారా రోడ్లు ధ్వంసం అయ్యాయని అనంతరం రూ.

150 కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపడుతున్నామన్నారు. నగర ప్రజలు ఎంతో సహకరిస్తున్నారన్నారు. ఇంతటి అభివృద్ధి జరుగగా అభివృద్ధి జరుగలేదని చెప్పడం బాగులేదన్నారు. మోదీకి ఆర్మూర్‌ ప్రాంత రైతుల కష్టాలు కనిపించలేదా, పసుపుబోర్డు ఏర్పాటు ప్రకటిస్తే ఎంతో బాగుండేదని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. మెడికల్‌ కళాశాల అధ్వాన్నంగా ఉందని పేర్కొ¯నడం సబబుకాదన్నారు. ఆధ్వానంగా ఉంటే కళాశాలకు మూడేళ్లుగా అనుమతి ఏలా ఇచ్చారని అన్నారు. కేంద్రమే కళాశాలకు అనుమతి ఇవ్వాలని గుర్తు చేశారు. అన్ని గుడిలు, చర్చిలు , మసీదులకు అభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయించినట్లు పేర్కొన్నారు. వారణాసిలో మున్సిపాలిటీకి మీరు నిధులు కేటాయించారో లేదో కాని మేము మాత్రం ప్రతి ఏటా నిధులు ఇస్తున్నామన్నారు. రూ. 145 కోట్లతో మిషన్‌ భగీరథ నీటిని నిజామాబాద్‌ పట్టణంలో అందిస్తున్నామన్నారు.  

ఇంత వరకు ఎక్కడ కూడా నీరు లేని పరిస్థితి రాలేదన్నారు. కొత్త కలెక్టరేట్, ఐటీ హబ్, డబుల్‌బెడ్‌రూమ్‌ల నిర్మాణాలు కొనసాగించుకుంటున్నామన్నారు. రైల్వేబ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుందన్నారు. ఇంత అభివృద్ధి జరిగితే సభలో నరేంద్రమోదీ విమర్శలు చేయడం తన స్థాయికి తగ్గి మాట్లాడడమే అన్నారు. యెండల లక్ష్మీనారాయణ అభివృద్ధి కోసం పాటుపడినట్లు ఒక ఆధారమైన ఉందా అని ప్రశ్నించారు. మేము ఏ పార్టీకి మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేసుకోలేదని ప్రజలతోనే మాకు మ్యాచ్‌ఫిక్సింగ్‌ ఉందని అన్నారు. సమావేశంలో తాజా మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, నగర మేయర్‌ ఆకుల సుజాత, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top