కూటమిని మట్టి కరిపించండి..ఎంపీ కల్వకుంట్ల కవిత

Kavitha Said To People Do Not Vote For Kutami In Nizamabad - Sakshi

ఆంధ్రా చంద్రబాబు మనకు అవసరమా?

ఎంపీ కల్వకుంట్ల కవిత

సాక్షి, నందిపేట్‌: మహాకూటమిని మట్టి కరిపించి తెలంగాణ ప్రజల దీవెనలతో టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. మండలంలో ఆంధ్రనగర్‌తో పాటు నందిపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డితో కలిసి బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రోడ్‌ షో నిర్వహించారు. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితే మరెన్నో పథకాలు అమలు చేస్తారన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడ్డ శక్తులన్నీ ఒకచోట చేరి కూటమిగా ఏర్పాడ్డాయని, వారిని ప్రజలు మట్టికరిపించాలని కోరారు. బీడీ కార్మికులందరికి పింఛన్లు వచ్చేలా చేస్తామన్నారు. పది మంది వచ్చి పది మాటలు చెప్తే ఆగం కావద్దని, మోసపోవద్దని ఎటు పక్క నిలబడాలో ఆలోచన చేయాలని సూచించారు. జీవన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. నక్కల భూమేష్, మీసాల సుదర్శన్, ఉల్లి శ్రీనివాస్‌గౌడ్, సిలిండర్‌ లింగం, శాకిర్‌హుస్సేన్, బాలగంగాధర్, హైమద్‌ ఖాన్, బొడ్డు రాజశేఖర్, రామకృష్ణ, నాయుడు రామారావు పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ

సాక్షి, మాక్లూర్‌: టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఎంపీ కవిత అన్నారు. మాక్లూర్‌ మండల కేంద్రంలో బుధవారం రాత్రి ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డితో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్‌ ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలన్నారు. ఎన్ని కూటమిలు వచ్చిన టీఆర్‌ఎస్‌ను ఓడించలేవన్నారు. జీవన్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్‌ను మరింత వేగంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామంలో ముందుగా వారికి బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రభాకర్, అశోక్‌రావు, రాజ్‌మల్లయ్య, దర్గల సాయిలు, నజీబ్, లక్ష్మీనారాయణ, ఆకుల రజనీష్, నర్సాగౌడ్, గుగ్గిలం రాజేశ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top