ప్రజా రవాణా.. భద్రతకేదీ ఠికాణా

More than 4,000 buses are outdated - Sakshi

4 వేలకు పైగా  కాలం చెల్లిన బస్సులు 

4 లక్షల మందికి పైగా  వీటిలోనే ప్రయాణం 

నేటి నుంచి భద్రతా వారోత్సవాలు

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఆర్టీసీ 30వ భద్రతా వారోత్సవాలు ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కాలం చెల్లిన బస్సులను పక్కనబెట్టనంత వరకు ఈ ఉత్సవాల వల్ల ప్రయోజనం లేదని కార్మికులు, కార్మికసంఘాల నుంచి విమర్శలొస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో తక్షణం పక్కనబెట్టాల్సిన బస్సులు 4,549. అంటే ఇవి 12 లక్షల కిలోమీటర్లకుపైగా తిరిగాయి. ఇపుడు మన బస్సులు ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి ప్రమాదానికి గురవుతాయో చెప్పలేని దుస్థితిలో ఉన్నాయి. ముందుగా ఆర్టీసీని ప్రక్షాళన జరపకుండా ఇలాంటి భద్రతా వారోత్సవాలు ఎన్ని జరిపితే ఏం లాభమని కార్మిక యూనియన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతీరోజు 40 లక్షల మందికిపైగా ప్రజలు ప్రమాదకరంగా కాలంచెల్లిన బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా కొత్త బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంటారా? లేదా అన్నది చర్చానీయాంశంగా మారింది. 

తెల్ల ఏనుగులపైనే ఆసక్తి.. 
2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు తెలంగాణ ఆర్టీసీ కొనుగోలు చేసిన బస్సుల సంఖ్య 1,095గా ఉంది. తుక్కు దశకు చేరిన బస్సుల స్థానంలో ప్రధానంగా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు నడిచే బస్సులు కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఆర్టీసీలో అంతగా లేదు. కేవలం సంస్థకు భారంగా పరిణమించే తెల్ల ఏనుగుల్లాంటి ఏసీ బస్సులపైనే అమితాసక్తిని ప్రదర్శిస్తోంది.  
►ఇదే క్రమంలో 2017లో దాదాపుగా రూ.20 కోట్లు వెచ్చించి వజ్ర బస్సులు కొనుగోలు చేశారు. వీటి ఆక్యుపెన్సీ రేషియో కేవలం 58కి పరిమితమైంది. చాలారూట్లలో ఈ బస్సులు సగం కూడా నిండటం లేదు. 
►సెప్టెంబర్‌ 5వ తేదీన దాదాపుగా రూ.100 కోట్లు పెట్టి ఎలక్ట్రిక్‌ బస్సులను అద్దెకు తీసుకుంది. వీటిలో తొలివిడగా 40 ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నాయి. ఇవి త్వరలోనే రోడ్డుకెక్కనున్నాయి. ఇలాంటి చర్యలను ఆహ్వానించినా.. ఇవి అందరికీ అందుబాటులోకి ఉండవన్న విషయం మరవకూడదు. 

ఇతర సంస్థలంటేనే మమకారమా..? 
రాష్ట్రంలో అతిపెద్ద ప్రజారవాణ సంస్థగా ఉన్న ఆర్టీసీకి ఎలాంటి అదనపు కేటాయింపులు చేయడం లేదు. ఈ సంస్థకు చేయకపోగా.. పోలీసు శాఖకు దాదాపుగా రూ.800 కోట్లు ఇచ్చి దాదాపుగా 3000 వాహనాల కొనుగోలుకు సహకరించింది. హైద రాబాద్‌లో పరుగులు తీస్తున్న మెట్రోకు ఏకంగా రూ.14 వేల కోట్లు వరకు వెచ్చించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక.. 1,400 బస్సులు మినహాయించి కొత్తగా కొనుగోలు చేసింది ఏమీ లేదు. ఇందులో ఎక్స్‌ప్రెస్, సూపర్‌ డీలక్స్‌ తదితరాలు ఉన్నాయి. కనీసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను కూడా పూర్తిగా కేటాయించడం లేదు.

ఆర్టీఏ తనిఖీలు ఉండవా? 
ఆర్టీసీ బస్సుల తనిఖీ అంటేనే ఆర్టీఏ అధికారులు అస్సలు పట్టించుకోరు. పోనీ, పట్టించుకుని తనిఖీలు చేపడితే.. వెంటనే ఫోన్లు చేసి వారిని అక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు వస్తాయని ఆర్టీఏ ఉన్నతాధికారులు అంటున్నారు. అందుకే, నిబంధనలకు విరుద్ధంగా కాలంచెల్లిన బస్సులు పరిమితికి మించి రోడ్డుపై తిరుగుతున్నా కళ్లప్పగించి చూడటం మినహా వారేం చేయలేని దుస్థితి. సాంకేతికంగా ఈ బస్సులను నడిపించేందుకు ఏమాత్రం అర్హత లేదు. అయినా వీటిల్లో జనాలను కుక్కి ఆర్టీసీ పంపుతోంది.గతేడాది సెప్టెంబరు 11న 65 మంది అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న కొండగట్టు దుర్ఘటనే ఇందుకు చక్కని ఉదాహరణ.ఆక్యుపెన్సీ రేషియో పడిపోతే.. డ్రైవర్లు కండక్టర్లపై ఒత్తిడి తెచ్చి మరీ పెంచుకుంటోంది. అంతే తప్ప ప్రజల రక్షణ కోసం.. జిల్లాలు గ్రామీణ బస్సుల్లో కొత్త బస్సులు వేయాలన్న దిశగా చర్యలు లేక పోవడం విమర్శలకు ఆస్కారమిస్తోంది.

ఇదీ బస్సుల దుస్థితి.. 
ఆర్టీసీలో మొత్తం బస్సులు 10,500 కుపైగా  
రోజువారీ ప్రయాణికులు 97,00,000  
ఒకరోజు ఆదాయం దాదాపు రూ.12,00,00,000 (రూ.12కోట్లు) 
సంస్థలో కాలంచెల్లిన బస్సులు 4,549. 
ఈ బస్సుల్లో ఒకరోజు ప్రయాణం చేసేవారు 40,00,000కిపైగా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top