
ఒక్క కోతి.. పలు రైళ్లను ఆపేసింది!!
ఓ కోతి చేసిన అల్లరి కారణంగా విజయవాడ- వరంగల్ మార్గంలో పలు రైళ్లు ఆగిపోయాయి.
ఓ కోతి చేసిన అల్లరి కారణంగా విజయవాడ- వరంగల్ మార్గంలో పలు రైళ్లు ఆగిపోయాయి. వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు స్టేషన్లో ఓ గూడ్స్ రైలును క్రాసింగ్ కోసం ఆపారు. తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కిన కోతి అక్కడి నుంచి ఎగురుతూ విద్యుత్ కాంటాక్ట్ వైరును పట్టుకుంది. దాంతో హైటెన్షన్ విద్యుత్ ప్రసారం జరిగి మంటలు చెలరేగాయి. విద్యుత్ తీగ కూడా తెగిపోయింది. దాంతో రైళ్లన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.
ఏం జరిగిందో తెలియక ప్రయాణికులంతా అల్లాడిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రైళ్లనీ ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. అయితే.. ఇంత అల్లరి చేసి, విద్యుత్ తీగను తెంపేసినా కోతికి మాత్రం ఏమీ కాలేదు. తీగ తెగగానే దాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయింది.