40 రోజులు.. రూ.8.76 కోట్లు | Money Caught In Telangana Election Time In Hyderabad | Sakshi
Sakshi News home page

40 రోజులు.. రూ.8.76 కోట్లు

Nov 6 2018 10:10 AM | Updated on Nov 10 2018 1:16 PM

Money Caught In Telangana Election Time In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నేప«థ్యంలో నగర పోలీసులు తీసుకుంటున్న చర్యలను సోమవారం బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో మీడియాకు వివరించారు. ఎన్నికల కమిషన్‌ నియమ నిబంధనల మేరకు గత 40 రోజులుగా నగరంలో విస్తృత తనిఖీలు నిర్వహించి రూ.9.12 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటిలో అక్రమ రవాణా చేస్తున్న రూ.8.76 కోట్ల నగదు, 3 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, వెండి, ఇతర వస్తువులు ఉన్నట్లు వివరించారు. 2014 ఎన్నికల్లో కేవలం రూ.12 లక్షలు మాత్రమే పట్టుబడ్డాయని, ఈ ఎన్నికల్లో నిఘాను పటిష్టంగా కొనసాగిస్తున్నామన్నారు. ఎన్‌బీడబ్ల్యూ జారీ అయిన 1,793 రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లతో పాటు నేరాలు చేసిన వారిపై 769 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. పోలీసు నిఘాలో ఉన్న 2095 మందిని బైండోవర్‌ చేశామన్నారు.

4,049 లైసెన్స్‌ పొందిన ఆయుధాలు డిపాజిట్‌ చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఆర్మీ, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వారికి ఆయుధాల డిపాజిట్‌లో కొన్ని మినహాయింపులు ఇచ్చామన్నారు. పోలీసుల తనిఖీల్లో నగదుతో పాటు అక్రమంగా తరలిస్తున్న రూ.2.5 లక్షల విలువచేసే 1,616 లీటర్లు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి సూచనలు పాటిస్తూ, ఆయా విభాగాల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నన్నట్టు చెప్పారు. నగరంలో 15 డీఆర్‌సీ (డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్‌) సెంటర్ల వద్ద మూడంచెల భద్రతను అమలు చేస్తున్నామన్నారు. ఇందులో మొదటి దశలో కేంద్ర బలగాలు, రెండో దశలో సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వుఫోర్స్, మూడో దశలో సివిల్‌ పోలీసులు బందోబస్తులో ఉంటారన్నారు. 13 ప్రాంతాల్లో 15 కౌంటింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నగరంలో సమస్యాత్మక ప్రాంతాలు, ఎంత బందోబస్తు ఏర్పాటు చేయాలి, అందులో కేంద్ర బలగాలు ఎంత వరకు ఉపయోగించాలనే అంశాలపై త్వరలో స్పష్టత ఇస్తామని సీపీ తెలిపారు. 

మేడ్చల్‌ జిల్లాలో రూ.1.27 కోట్లు స్వాధీనం
కీసరటౌన్‌: ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు  మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో రూ.1,27,66,000 స్వాధీనం చేసుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎంవీ.రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్‌లైయింగ్‌ స్క్వాడ్‌ రూ.47,16,000 స్వాధీనం చేసుకోగా, పోలీసులు రూ.16,67,000, చెక్‌పోస్టుల తనిఖీల్లో రూ.63,83,000 సీజ్‌ చేసినట్లు ఆయన వివరించారు. జిల్లా వ్యాప్తంగా 9,322.96 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని 18 బెల్ట్‌ షాప్‌లను మూసివేసినట్టు చెప్పారు. 1,224 ఆయుధాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, 1,323 మందిని బైండోవర్‌ చేశామన్నారు. మరో 961 మందికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసినట్లు తెలిపారు. వాహనాల దుర్వినియోగం, అనుమతులు లేకుండా లౌడ్‌ స్కీకర్ల వాడకం, బహిరంగ సభల నిర్వహణ తదితర సంఘటనలకు సంబంధించి ఇప్పటి దాకా నలుగురిని గుర్తించినట్లు ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement