ఇంటి పద్దు.. అతిగా వద్దు

Middle Class Family Trying To Reduce Expenses Due To Lockdown - Sakshi

అనవసర కొనుగోళ్లతో నష్టం

లాక్‌డౌన్‌ కాలపరిమితి పెరగడంతో మారుతున్న ఫ్యామిలీ బడ్జెట్‌

సాధారణ ఖర్చులు, కొనుగోళ్లు తగ్గించుకునేలా మిడిల్‌క్లాస్‌ కార్యాచరణ

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడుతోంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక విధానంలో భారీ కష్టాలు మొదలవుతున్నాయి. సగటు వేతన జీవికి ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 14 వరకు తొలివిడత లాక్‌డౌన్‌ పూర్తయింది. అనంతరం రెండో విడత లాక్‌డౌన్‌ ఈ నెల 14 నుంచి మే 7 వరకు పెరిగింది. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టేంత వరకు లాక్‌డౌన్‌ ఒక్కటే సరైన మార్గమని ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రత తగ్గకుంటే లాక్‌డౌన్‌ మరింత పెరిగే అవకాశం లేకపోలేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. లాక్‌డౌన్‌ పొడిగిస్తే తలెత్తే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వేతన జీవి కుటుంబం సన్నద్ధమవుతోంది.

మరింత పక్కాగా ఖర్చులు..
పేద, మధ్యతరగతి వర్గాల్లో భవిష్యత్‌ అవసరాల కోసం చేసే పొదుపు అంతా నెలవారీ ఖర్చులపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వేతన జీవికి నెలకొచ్చే జీతంపై సందిగ్ధం నెలకొంది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా రంగాలు మూతబడ్డాయి. రోజువారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారిపై కూడా లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. ఈ క్రమంలో ఖర్చులు భారీగా తగ్గించుకుంటే మేలని భావిస్తున్నారు. ముఖ్యంగా అదనపు ఖర్చులను పూర్తిగా రద్దు చేయడంతో పాటు ఆహార పద్ధతుల్లో కూడా అనవసర ఖర్చును తగ్గించుకుంటున్నారు.

చిరుతిళ్లకు చెక్‌ పెట్టి సాదాసీదా తిండికి అలవాటు పడుతున్నారు. కొందరిలో లాక్‌డౌన్‌ కారణంగా కిరాణా సరుకులు సైతం దొరకవనే భావన కనిపిస్తోంది. దీంతో అవసరానికి మించి ఎక్కువ కొనుగోళ్లు చేస్తున్నారు. తొలిదశ లాక్‌డౌన్‌లో ఎక్కువ శాతం కుటుంబాలు ఇలాగే కొనుగోళ్లు చేయడంతో చాలా దుకాణాలు సరుకులు లేక వెలవెలబోగా... ధరలు సైతం అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిరాణా సరుకులకు కొరత లేదు. దీంతో అవనసర ఖర్చును పూర్తిగా తగ్గించి పరిమితంగా కొనుగోళ్లు చేస్తే మంచిదని భావిస్తున్నారు.

చెల్లింపుల భారం ఎలా..
లాక్‌డౌన్‌ కారణంగా బ్యాంకుల వద్ద తీసుకున్న రుణ చెల్లింపులపై ప్రభుత్వం మారటోరియం విధించింది. దీంతో మూడు మాసాల వరకు రుణ వాయిదాల చెల్లింపులు చేయాల్సిన పనిలేదు. అయితే ఈ మొత్తాన్ని లాక్‌డౌన్‌ తర్వాత చెల్లించాల్సిందే. అయితే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంతకు ముందున్న పరిస్థితే ఉంటుందా? అనే సందిగ్ధం సర్వత్రా నెలకొంది. దీంతో వాయిదాల చెల్లింపులను కట్టేద్దామనే ఆలోచనలో పడ్డారు. బ్యాంకింగ్‌ రంగంలో రుణాల మారటోరియం ఉండగా.. ప్రైవేటు అప్పులు, నెలవారీ చీటీలు, ఇతర సేవింగ్స్‌ పథకాలు, రుణ వాయిదాలపై ఎలాంటి మారటోరియం లేదు.

దీంతో ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకుని ఆ మొత్తాన్ని అప్పులు చెల్లిస్తే ఇబ్బంది ఉండదనే అభిప్రాయం మధ్యతరగతి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రెండు నెలల వరకు పాఠశాలలు తెరిచే అవకాశం లేకపోవడంతో స్కూల్‌ ఫీజులకు వెచ్చించే మొత్తాన్ని ఇతర రుణ చెల్లింపులపై ఖర్చు చేస్తున్నారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్లు మొదలు.. రుణ వాయిదాల చెల్లింపులు.. నిర్వహణ ఖర్చుల్లో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో కుటుంబ ఆర్థిక వ్యవస్థ కొత్త బాట పడుతోంది. లాక్‌డౌన్‌ కాలంతో పాటు అనంతర పరిస్థితుల ఆధారంగా బతుకు బండి ప్రయాణం సాగుతుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top