కరోనా జీవన చిత్రం.. పొదుపు మంత్రం..

Lockdown Effect On Middle Class Families - Sakshi

ఖర్చులు తగ్గించి పొదుపు బాటలో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు

శరత్, సంతోషి భార్యాభర్తలు. సికింద్రాబాద్‌లోని ఓ పేరున్న హోటల్‌లో ఒకరు మేనేజర్, మరొకరు రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. హోటల్‌ మూతబడటంతో వీరికి ఏప్రిల్‌ నెల వేతనం అందలేదు. మరోవైపు లాక్‌డౌన్‌ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఫలితంగా ఇప్పటికిప్పుడు మరో ఉద్యోగం వెతుక్కోవడం కష్టమే. దీంతో అందుబాటులో ఉన్న నగదు నిల్వలను, పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే వచ్చిన మొత్తాన్ని జాగ్రత్త చేసుకున్నారు. మరో నాలుగు నెలల వరకు ఈ నగదుతో జీవనం సాగించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూనే ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. 

రాజేశ్‌ దిల్‌సుఖ్‌నగర్‌ సమీపంలోని ఓ మల్టీప్లెక్స్‌లో సూపర్‌వైజర్‌. వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలు, భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్‌ కాంప్లెక్స్‌ మూతపడింది. ఉద్యోగానికి లాక్‌పడి సరిగ్గా రెండు నెలలైంది. అప్పట్నుంచి వేతనం లేదు. దీంతో ఇద్దరు పిల్లల్ని పోషించడం ఎలా అనే ప్రశ్నతో ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేసి సొంతూరు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి వెళ్లిపోయాడు. పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని, చేతిలో ఉన్న సొమ్మును జాగ్రత్త చేసుకుని కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ లక్షలాది కుటుంబాల జీవన చిత్రాన్ని మార్చేసింది. ఇప్పటికిప్పుడు పరిస్థితులు చక్కబడేటట్లు లేకపోవడంతో పలు రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యామ్నాయ బాట చూపిస్తూనే పొదుపు మంత్రానికి అలవాటు చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా సంస్థలు మూతపడ్డాయి. హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్‌ హాళ్లు తదితర సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అలాగే విద్యా సంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లు సైతం మూత పడ్డాయి. లాక్‌డౌన్‌ సడలింపులు ఇచ్చినప్పటికీ ఇలాంటి సంస్థలు తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వీటిల్లో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు సొంతూళ్ల బాట పట్టారు. ఇక్కడే స్థిరపడ్డ వారు మాత్రం రోజు వారీ ఖర్చులు భారీగా తగ్గించుకుంటూ పొదుపు జీవితానికి అలవాటు పడుతున్నారు.

దాచిన సొమ్ముతో ధైర్యంగా.. 
లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది ఉద్యోగాలకు దూరమయ్యారు. సడలింపులతో కొందరు తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. మరోవైపు ఆర్థిక సర్దుబాటులో భాగంగా కొన్ని కంపెనీలు ఉద్యోగాల తొలగింపు చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కారణాలతో ఉద్యోగాలు పోతాయనే భయం వారిలో సరికొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోతే ఎలా? అనే కోణంలో దాదాపు ప్రతి ప్రైవేటు ఉద్యోగి ఆలోచిస్తూ భవిష్యత్‌ కార్యాచరణ తయారు చేసుకుంటున్నాడు. చేతిలో ఉన్న నగదు, దాచిన సొమ్మును జాగ్రత్తగా ఖర్చు చేసేలా ప్రణాళిక తయారు చేసుకుంటూనే, కొత్తగా అప్పులు చేయకుండా గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈక్రమంలో దుబారా ఖర్చులకు మంగళం పాడుతూ పొదుపు బాటన పరుగులు పెడుతున్నాడు. ఇక ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోయినా, కొత్త ఉద్యోగం వెతికిపట్టుకుని అందులో ఇమిడే వరకు పట్టే ఆర్నెల్ల కాలం తన కుటుంబంతో తాపీగా బతికేలా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు.

ఎందుకీ వృథా ఖర్చు 
మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలవుతోంది. అయితే హోటళ్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మాత్రం మార్చి 16 నుంచే మూతబడ్డాయి. సరిగ్గా 2 నెలలు పూర్తి కాగా, ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు అప్పట్నుంచి జీతభత్యాలు లేవు. ఫలితంగా కుటుంబ పోషణ గందరగోళంగా మారింది. ఈ క్రమంలో ఆయా కుటుంబాలు పొదుపుబాట పట్టాయి. అందుబాటులో ఉన్న నగదును పక్కా ప్రణాళికతో ఖర్చు పెడుతున్నాయి. కొందరికి అధికంగా టీ తాగడం అలవాటు. కానీ ప్రస్తుతం చాలా ఇళ్లలో టీ, టిఫిన్లను భారీగా తగ్గిస్తున్నారు.

వీటికి బదులుగా చిరుధాన్యాలైన పెసర్లు, శనగలు, బొబ్బర్లను ఉడికించి తినడం అలవాటు చేసుకుంటున్నారు. టిఫిన్లతో పోలిస్తే వీటి ఖర్చు తక్కువే. అదేవిధంగా నూనె వేపుళ్లు, ఇతర చిరుతిళ్లకు పూర్తిగా చెక్‌పెడుతూ.. అన్నం, కూరగాయలతో కానిచ్చేస్తున్నారు. తీసుకునే ఆహారం ఒక క్రమపద్ధ తిలో భుజిస్తే ఎన్నోరకాలుగా కలిసొస్తుందనే పాఠాన్ని వంటబట్టించుకుంటున్నారు. కుటుంబ పోషణలో కీలకమైన కిరాణా సరుకులను కూడా పద్ధతిగా కొనుగోలు చేస్తూ అనవసరమైన వాటికి దాదాపు దూరమవుతున్నారు. ఇలా కొత్త తరహా జీవనానికి అలవాటు పడుతూ పొదుపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top