‘ఫలరాజు’పాట్లు

Mango Production Decreased In Khammam - Sakshi

తీవ్రంగా పడిపోయిన మామిడి దిగుబడి

ఎకరానికి టన్ను నుంచి మూడు టన్నులే కాపు

రూ.70వేల నుంచి రూ.30వేలకు పడిపోయిన ధర

అశ్వారావుపేట : భద్రాద్రి జిల్లాలో మామిడి రైతుకూ కన్నీరే మిగిలింది. పొగమంచు, అకాల వర్షాలతో కాపు, ధర తగ్గిపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. కౌలు రైతులు ఒప్పందాలను, తోటలను వదులుకుని వెళ్లిపోయారు. ఆరంభంలో రూ.70 వేలు పలికిన టన్ను ధర ప్రస్తుతం రూ.30 వేలకు పడిపోయింది. దీంతో పెట్టుబడి, కోత కూళ్లు పూడని పరిస్థితి నెలకొంది.  జిల్లాలో 6,397 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. ఎకరానికి అత్యధికంగా 8 టన్నుల చొప్పున జిల్లా వ్యాప్తంగా  51,176 టన్నుల దిగుబడి రావాలి. జిల్లాలోని తోటల్లో ఏటా ఎకరానికి సరాసరిగా 5.5 టన్నులు వస్తుంది. ఈ చొప్పున సుమారు 35,183 టన్నుల దిగుబడి వచ్చేది. కానీ ఈ సంవత్సరం ఎకరానికి అత్యధికంగా మూడు టన్నులే దిగుబడి వచ్చిందని, కొన్నిచోట్ల ఒక టన్నే వచ్చిందని హార్టికల్చర్‌ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 6,397 ఎకరాల్లో 19,191 టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది.  

పొగమంచు, అకాల వర్షంతో..  
తొలుత పూత సమయంలో పొగమంచు పూతను మాడ్చేసింది. రెండోసారి పూత కాస్త నిలబడటం తో రైతుల్లో ఆశలు చిగురించాయి. వరుస గాలిదుమారాలు, వాతావరణంలో అసమతుల్యత కారణంగా కాపు తగ్గిపోయింది. దిగుబడి తక్కువగా ఉండటంతో ఆరంభంలో హైదరాబాద్‌ గడ్డి అన్నారం మార్కెట్‌లో టన్ను బంగినపల్లి మామిడి కాయలు గరిష్టంగా రూ.70వేల వరకు ధర పలికాయి. దిగుబడి తగ్గినా ధర ఉందని ఆనందపడ్డ రైతులకు నిరాశే మిగిలింది. టన్ను ధర అమాంతం రూ.30వేలకు పడిపోయింది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి దిగుమతులు పెరగడంతో ధర తగ్గిందని నిపుణులు చెబుతున్నారు. రేటు పడిపోవడంతో కౌలు రైతులు కౌలు ఒప్పందాన్ని వదిలేసి వెళ్లిపోతున్నారు.

దీంతో రైతులే కాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో గడిచిన పది రోజుల్లో కురిసిన అకాల వర్షాలకు మామిడి కాయల్లో పురుగులు పడటం మొదలైంది. ముదురు తోటలకు అంతగా ఇబ్బంది కాకపోయినా.. లేత తోటలు, ఆలస్యంగా పూత వచ్చిన తోటలకు పురుగు బెడద తప్పలేదు. వర్షపు జల్లులు, వడగళ్ల వానలు, చలిగాలులకు కాయల ఎదుగుదల క్షీణించిందని రైతులు వాపోతున్నారు. ముఖ్యంగా బంగినపల్లి పండ్ల నాణ్యత తగ్గిపోతుందని అంటున్నారు. ఏటా మే 10 నుంచి చెట్టు మీదే కాయలు పండి రాలడం ప్రారంభం అవుతాయి. కానీ ఈ ఏడాది కురిసిన అకాల వర్షాల కారణంగా పచ్చడికాయలు కూడా ఆలస్యంగా వచ్చాయి.  కాయల పరిమాణం కూడా పెరగకపోవడంతో మే నెలాఖరుకు కూడా కొన్ని తోటలు కోతకు రాలేదు.  

బ్రోకర్ల దోపిడీకి హద్దే లేదు 
కాయల్లో పురుగులు పడ్డా.. పడకున్నా బ్రోకర్లు మాత్రం చినుకులు పడితే చాలు ధర అమాంతం తగ్గించేస్తారని వాపోతున్నారు. ముందుగా కోసి పండేసిన కాయలకూ రక్షణ ఉండదని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాయలు గోళీ సైజులో ఉన్నప్పుడు కాయతొలిచే పురుగులు కాయలపై గుడ్లు పెడతాయి. వాతావరణం చల్లబడితే..  గుడ్లు పగిలి పురుగులు బయటకు వచ్చి కాయకు రంధ్రం చేసుకుని టెంక వరకు వెళ్లిపోయి పురుగు కాయను తింటూ పెరుగుతుంది. దీనికితోడు కూలీల ధర కూడా ఎక్కువగానే ఉంది. కాపు తక్కువగా ఉండడంతో కాయలను వెతికి వెతికి కోయాలి. దీంతో కోత కూలీకి రోజుకు రూ.200 నుంచి రూ.250 వరకు చెల్లించాలి. కాపు తక్కువగా ఉన్న చెట్లను వదిలేసి ఓమోస్తరు కాయలున్న చెట్లనే ఎంచుకుంటే.. కోత కూలి, రవాణా ఖర్చులు కూడా రావట్లేదని వాపోతున్నారు. కమిషన్‌ కొట్లో కాటా పెట్టిన తర్వాత 10 శాతం ‘చూటు’ పేరుతో తగ్గిస్తారు.

ఈ దోపిడీ చాలదన్నట్లు నూటికి  12 శాతం బ్రోకర్‌కు కమిషన్‌ చెల్లించాల్సివస్తోంది. కమీషన్‌ కొట్లో కాయల దిగుమతికి కూలీ రైతులే భరించాలి. అన్నీ వెరసి 30 శాతం డబ్బులు కమీషన్‌ కొట్టు సాక్షిగా రైతు దోపిడీకి గురవుతున్నాడు. హైదరాబాద్‌ గడ్డిఅన్నారం ఫ్రూట్‌మార్కెట్‌కు రైతులు నేరుగా తరలిస్తే అక్కడ పట్టించుకునే నాథుడే ఉండడని.. బ్రోకర్ల ద్వారా వెళ్లిన లారీలకు రెడ్‌కార్పెట్‌ వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కమీషన్‌లు ఇవ్వరాదనే బోర్డులు దర్శనమిస్తున్నా.. కమిషన్‌ చెల్లించనిదే చిల్లగవ్వ కూడా రైతు చేతిలో పడదంటున్నారు.  ప్రభుత్వం మామిడి రైతులు నష్టపోకుండా దళారీ వ్యవస్థను నిర్మూలించడంతోపాటు ధరను ప్రైవేటు దళారుల చేతినుంచి అధికారుల పర్యవేక్షణలో ఉంచితే రైతుకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

ఆశలు ఆవిరయ్యాయి 
కాపు తక్కువగా ఉంది. దీనికి తోడు ఆలస్యంగా కాయలు పడ్డాయి. ప్రారంభంలో ధర బాగానే ఉండటంతో మా కాయలు కోతకొచ్చేసరికి మంచి ధర ఉంటుందనుకున్నాను.  కోతకు రాకముందే రూ.70వేలున్న టన్ను ధర 18వేలకు పడిపోయింది. వర్షం కారణంగా కాయల్లో నీరొచ్చి నాణ్యత దెబ్బతిన్నది. పురుగులు వస్తాయేమోనని భయంగా ఉంది. మార్కెట్‌కు తీసుకుపోతే బ్రోకర్లు ఏం మాయమాటలు చెప్పి ధరను తగ్గిస్తారో అర్థం కావడం లేదు.       – రామినేని సత్యనారాయణ, మామిడి రైతు, మామిళ్లవారిగూడెం 
 
రైతు చేతికి పైసా రాదు 
లక్ష రూపాయల మామిడి కాయలు కమీషన్‌ కొట్లో వేస్తే చేతికి వచ్చేది కేవలం రూ.70వేలే. కమీషన్, చూటు, దిగుమతి  పేరుతో దోచుకుంటున్నారు. గాలివానలు, వర్షాలు, వడగళ్ల వానలకు మామిడి తోటలను కాపాడుకుంటూ పురుగు మందులు, ఎరువులు వేసి సంరక్షిస్తే చివరకు అప్పులే మిగులుతున్నాయి.   –మల్లంపల్లి సత్యనారాయణ, మామిడి రైతు, కొత్తూరు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top