కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు ఎంపీ కవిత తహతహలాడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
హన్మకొండ (వరంగల్): కేంద్ర మంత్రి వర్గంలో చేరేందుకు ఎంపీ కవిత తహతహలాడుతున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం హన్మకొండలోని నయూంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. రాష్ట్ర మంత్రి వర్గంలో మహిళలకు అవకాశం కల్పించకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయన్న ఎంపీ కవిత.. అవేంటోమహిళలకు వివరించాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయకుండా మహిళా వివక్షతను చాటుతున్న కేసీఆర్ తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామన్నారు.
దీనిపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, గవర్నర్‌ను కలిసి వివరిస్తామన్నారు. మహిళా వివక్షతపై జూలై ఒకటి నుంచి 19వ తేదీ వరకు యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో సెమినార్లు నిర్వహిస్తామని, మహిళలతో కలిసి ఉద్యమాలు చేస్తామన్నారు. జూలై 20వ తేదీ నుంచి రెండు రోజులు హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో దీక్షలు చేపడతామని చెప్పారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు, కేసీఆర్ మధ్య పెద్ద రాజకీయ యుద్ధమే జరిగిందని, డబ్బుల ప్రవాహంలో తన నిజాయితీని చాటుకున్న ఆంగ్లో ఇండియన్ స్టీఫెన్‌సన్‌కు రాష్ట్ర మంత్రి వర్గంలో చోటు కల్పించాలని కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. టీడీపీ తెలంగాణ ద్రోహుల పార్టీ అన్న కేసీఆర్, తన మంత్రి వర్గంలో ద్రోహులకే అవకాశం కల్పించారని విమర్శించారు.