ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్న తెలంగాణ సర్కారు.. రాజధానికి చేరువలో ఉన్న మన జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్న తెలంగాణ సర్కారు.. రాజధానికి చేరువలో ఉన్న మన జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్‌రింగ్ రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉండడం జిల్లాకు ప్లస్‌పాయింట్‌గా మారింది. ఇదే అభిప్రాయాన్ని పారిశ్రామికవర్గాలు కూడా ప్రభుత్వం దృష్టికి తేవడంతో జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన భూములను గుర్తించడంలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. ప్రతిష్టాత్మక ఐటీఐఆర్ ప్రాజెక్టు కూడా జిల్లాలోనే కొలువుదీరుతుండడంతో వీటన్నింటికి సరిపడా ల్యాండ్‌బ్యాంక్‌ను సమకూర్చుకునే బాధ్యత అధికార యంత్రాంగంపై పడింది.
ఈ నేపథ్యంలోనే నెలరోజులుగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన రెవెన్యూ అధికారులు.. వివిధ సంస్థలు అట్టిపెట్టుకున్న ప్రభుత్వ భూములు, ఇప్పటి కీ వినియోగించుకోని భూముల జాబితాను కొలిక్కి తెచ్చారు. జిల్లాలో వివిధ కంపెనీలు/శాఖలకు బదలాయించిన, కేటాయించిన 39వేల ఎకరాల్లో సుమారు 10,852 ఎకరాల మేర నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించారు. హెచ్‌ఎండీఏ, ఏపీఐఐసీ, దిల్ తదితర సంస్థల వద్ద వృధాగా ఉన్న ఈ భూమి పరిశ్రమల తక్షణ కేటాయింపులకు వీలుగా ఉందని తేల్చారు.
అదనంగా 6,706.34 ఎకరాలు
ఆయా సంస్థలు వద్ద భూములను గుర్తించిన యంత్రాంగం.. జిల్లాలో ఎవరికీ కేటాయించని ప్రభుత్వ భూములపై సర్వే నిర్వహించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 4,300 ఎకరాల మేర భూమి అందుబాటులో ఉన్నట్లు గుర్తించింది. అంతేగాకుండా మరో 7,986.36 ఎకరాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించగా.. ఈ రెండింటిలో 6,706.34 మేర ఎకరాలు పారిశ్రామిక అవసరాలకు అనువుగా ఉందని టీఐఐసీ (తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) లెక్కతేల్చింది. 50ఎకరాల పైబడిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ మేరకు జాబితా రూపొందించింది. చాలా మండలాల్లో 50 ఎకరాల లోపు భూములు ఉన్నా, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రజోపయోగాల కోసం నిర్ధేశించారు. జిల్లాలో మరో 20వేల ఎకరాలకుపైగా భూములు ఉండగా, దీంట్లో ఎక్కువశాతం కొండలు, గుట్టలతో ఉన్నట్లు పరిశీలనలో గుర్తించారు.