శివారుల వరకు కీలక రైళ్లు 

Key trains to the suburbs - Sakshi

     సికింద్రాబాద్‌పై భారం తగ్గించడానికే

     పలు రైళ్ల వేగం పెంచిన ద.మ.రైల్వే  

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే తగు ప్రణాళికలను రూపొందిస్తోంది. దీనిలో భాగంగా దూరప్రాంతాలకు నడిచే పలు రైళ్ల సేవలను శివారుల నుంచి నడపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నగరంలో అధిక సంఖ్యలో నివసించే వివిధ ప్రాంతాల ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా పలు రైళ్లను లింగంపల్లి వరకు పొడిగించింది. దీంతోపాటు ఉత్తరాదికి వెళ్లే కొన్ని రైళ్లనూ హిస్సార్, శ్రీగంగానగర్‌ వరకు విస్తరించింది. త్వరలోనే మరిన్ని రైళ్లను శివారు ప్రాంతాల నుంచి నడిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

ఎందుకు పొడిగించారు? 
నిత్యం సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 75 ఎంఎంటీఎస్, 90 సబర్బన్, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాటితో కలిపి మొత్తం 215 రైళ్లు ప్రయాణం సాగిస్తాయి. దాదాపు 1,80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. హైదరాబాద్‌ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగరంలో వలసలు పెరుగుతున్న దరిమిలా.. ట్రాఫిక్‌ సమస్యలూ రెట్టింపవుతున్నాయి. ఈ భారం రైల్వేపైనా పడుతోంది. ముఖ్యంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో కొంతకాలంగా ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపోవడంతో ఉన్న 10ప్లాట్‌ఫారాలు ఇరుగ్గా మారాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌పై భారం తగ్గించేందుకు శివారు ప్రాంతాల్లో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై దక్షిణ మధ్య రైల్వే దృష్టి సారించింది. దీనిలో భాగంగా లింగంపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. ఇక్కడ నుంచే రైళ్లను నడపడం ద్వారా ప్రజలకు సికింద్రాబాద్‌ దాకా రావాల్సిన ఇబ్బంది తప్పుతుంది.  

పలు రైళ్ల వేగం పెంపు.. 
పట్టాల సామర్థ్యం పెంచడం, నిర్వహణ పనులు ఆధునీకరించడంతో పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేగం పెరిగింది. ఫలితంగా ప్రయాణికులు గమ్యస్థానాలకు ముందుగానే చేరుకునే వీలుచిక్కింది. ఏటా వివిధ మార్గాల్లో జరిగే అభివృద్ధి పనులు, ట్రాక్‌ నాణ్యతా మెరుగు ఆధారంగా ద.మ.రైల్వే తన టైంటేబుల్‌ను మారుస్తుంటుంది. ఈసారి మారిన టైంటేబుల్‌ వల్ల వేలాది ప్రయాణికులకు సమయం కలిసి రావడం గమనార్హం. 
వివిధ రైళ్లు ముందస్తుగా చేరుకునే సమయం ఇదే.. 
1.    ఎన్‌సీజే ముంబై ఎక్స్‌ప్రెస్‌– నాగర్‌ కోయిల్‌ – ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ (75 నిమిషాలు)  
2.    చెన్నై సెంట్రల్‌ – అహ్మదాబాద్‌ (25 ని.మి)  
3.    చెన్నై సెంట్రల్‌ – అహ్మదాబాద్‌ హమ్‌సఫర్‌ (25 ని.మి)  
4.    కాచిగూడ – నాగర్‌కోయిల్‌ జంక్షన్‌ (18 ని.మి) 
5.    ఛత్రపతి శివాజీ టెర్మినల్‌– నాగర్‌ కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (15 ని.మి)   
6.    మద్రాస్‌ – ఛత్రపతి శివాజీ టెర్మినల్‌ (10 ని.మి)   
7    తిరుపతి – జమ్మూతావి (10 ని.మి)   
8.    ఆదిలాబాద్‌ – తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (10 ని.మి)  
9.    చెంగల్‌పట్టు– కాకినాడ పోర్ట్‌ (8 ని.మి)   
10. హైదరాబాద్‌ – జైపూర్‌ (5 ని.మి)   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top