రేపు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌ పరిధిలో కేసీఆర్‌ పర్యటన

KCR Visits Kaleshwaram In New Year - Sakshi

జనవరి 2న ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం పనుల పరిశీలన

జనవరి 3 లేదా 4న ప్రాజెక్టులపై పూర్తిస్థాయి సమీక్ష

మరోవైపు నేటి నుంచి ప్రాజెక్టుల పరిధిలో రిటైర్డ్‌ ఇంజనీర్ల పర్యటన

అనంతరం సీఎం కేసీఆర్‌కు నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజె క్టుల నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించేందుకు సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాజెక్టుల సందర్శన చేయ నున్నారు. జనవరి ఒకటిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో పర్యటించనున్నారు. రెండ్రోజుల పర్యట నలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంప్‌హౌస్‌తో పాటు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథక పనులను పరీశీలించనున్నారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించాలని ముఖ్యమంత్రి భావించినా, వాతావరణం అనుకూలించక పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం ఈ పర్యటన జరుగ నుంది.

జనవరి 1న హైదరాబాద్‌లో జరిగే హైకోర్టు చీఫ్‌ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల ప్రమాణ స్వీకా రంలో కేసీఆర్‌ పాల్గొంటారు. అనంతరం బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు పనుల సందర్శనకు బయలుదేరతారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, పంపుహౌస్‌ నిర్మాణాలను పరిశీలిస్తారు. అదేరోజు సాయంత్రం కరీంనగర్‌ చేరుకుని, అక్కడే బస చేస్తారు. జనవరి 2న ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్సారెస్పీకి నీరందించే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకం పనులు జరిగే ప్రాంతాలను సందర్శిస్తారు. రాజేశ్వరరావుపేట, రాంపూర్‌లో నిర్మాణంలో ఉన్న పంపుహౌస్‌ పనులను పరిశీలిస్తారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుంటారు. 

3 లేదా 4న సమగ్ర సమీక్ష...
సీఎం పర్యటనకు ముందే ఈ నెల 31న రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్యాంప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీ, పంపుహౌస్‌ నిర్మాణ పనులను పరిశీలిస్తుంది. అదే రోజు సాయంత్రం రిటైర్డ్‌ ఇంజనీర్లు ముఖ్యమంత్రికి ప్రాజెక్టు పనుల పురోగతిని వివరిస్తారు. జనవరి 1న రిటైర్డ్‌ ఇంజనీర్ల బృందం పాలమూరు–రంగారెడ్డి, డిండి ప్రాజెక్టు పనులు జరిగే ప్రాంతాలను సందర్శించి అక్కడ పనులను పర్యవేక్షిస్తుంది. జనవరి 2న సీతారామ ప్రాజెక్టు పనులను సందర్శించి హైదరాబాద్‌ చేరుకుంటారు. మూడు రోజుల పాటు కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, డిండి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే ఈ బృందం 2వ తేదీ సాయంత్రం హైదరాబాద్‌ చేరుకుని ముఖ్యమంత్రికి వివరాలు అందిస్తారు. 3 లేదా 4న కేసీఆర్‌ అన్ని ప్రాజెక్టులపై ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టుల పూర్తి, లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ, కొత్త పథకాలు వంటి అంశాలపై అధికారులకు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం రెండో దశ ప్రాజెక్టుల సందర్శనలో ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్‌ మానేరు నుంచి కొండ పోచమ్మ సాగర్‌ వరకు జరుగుతున్న వివిధ పనులను పరిశీలిస్తారు. పాలమూరు–డిండి, సీతారామ ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారు. ఈ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. 

మేడిగడ్డలో పెరిగిన వేగం.. 
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలి సమీక్ష సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ పనులను వేగవంతం చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో ఇంజనీర్లు ఇక్కడి కాంక్రీట్‌ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నెల 22 ఉదయం నుంచి 23 ఉదయం వరకు 24 గంటల్లో ఏకంగా 16,722 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులతో రికార్డు సృష్టించిన ఇంజనీర్లు ఈ వారం రోజుల వ్యవధిలో 55,844 క్యూబిక్‌ మీటర్ల మేర పనులు చేశారు. 29 శనివారం ఉదయం నుంచి 30వ తేదీ ఉదయం 8 గంటల వరకు సైతం 9,250 క్యూబిక్‌ మీటర్ల పనులు చేశారు. మొత్తంగా మేడిగడ్డ పరిధిలో 17,89,382 క్యూబిక్‌ మీటర్ల మేర కాంక్రీట్‌ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 13,13,876 క్యూబిక్‌ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పనులను మరింత వేగం పెంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ నల్లా వెంకటేశ్వర్లు నేతృత్వంలో సుమారు 400 మంది ఇంజనీర్లు నిత్యం పనుల పర్యవేక్షణలో మునిగి తేలారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top