సుందిళ్ల టు రాజేశ్వర్‌రావుపేట

KCR Talk On Kaleshwaram Project Karimnagar - Sakshi

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టు బాట విజయవంతంగా ముగిసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం పూర్వ జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీ నుంచి మొదలైన పర్యటన ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో ముగిసింది. ఉద్యమాల ఖిల్లా... సెంటిమెంట్‌ జిల్లా కరీంనగర్‌ నుంచే తొలి అధికారిక పర్యటనకు శ్రీకారం చుట్టిన సీఎం... రెండు రోజుల ప్రాజెక్టుబాట విజయవంతంగా ముగించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ఆయన... మంగళ, బుధవారాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్సీ పునరుజ్జీవం (రివర్స్‌ పంపింగ్‌) పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: హైదరాబాద్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మేడిగడ్డ బ్యారేజీ చేరుకున్న సీఎం కేసీఆర్‌ మధ్యాహ్నం 2 గంటలకు కన్నేపల్లి పంపుహౌస్‌కు చేరుకుని పనుల పురోగతిని సమీ క్షించారు. అనంతరం సుందిళ్ల, గోలివాడ పంపుహౌస్‌లకు వెళ్లకుండానే సాయంత్రం 6 గంటలకు తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌కి చేరుకుని రాత్రి బస చేశారు. బుధవారం ఉదయమే ప్రాజెక్టుల పరిశీలన పర్యటనను మొదలు పెట్టారు.

పెద్దపల్లి జిల్లా సుందిళ్ల బ్యారేజీ నుంచి జగిత్యాల జిల్లా రాజేశ్వర్‌రావుపేట రివర్స్‌ పంపింగ్‌ వరకు షెడ్యూల్‌ ప్రకారం పర్యటించిన సీఎం ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులను వివరణ అడుగుతూ.. సూచనలు చేస్తూ ముందుకు సాగారు. మేడిపల్లి బ్యారేజీ, రాజేశ్వర్‌రావుపేట వద్ద ఎస్సారెస్పీ పునరుజ్జీవం పనుల్లో జాప్యంపై ఆయన అధికారులు, కాంట్రాక్టర్లపై అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. రాజేశ్వర్‌రావుపేట నుంచి హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. దీంతో సమయాభావం వల్ల సీఎం మల్యాల మండలం రాంపూర్‌ పర్యటన రద్దు కాగా, సీఎం రాకకోసం ఎదురుచూసిన ప్రజాప్రతినిధులు, అధికారులు తిరుగుపయనమయ్యారు.

బ్యారేజీ, పంపుహౌస్‌ పనుల పరిశీలన.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్నెపల్లికి చేరుకున్న ఆయన.. 13.2 కిలోమీటర్ల మేర అక్కడ జరుగుతున్న గ్రావిటీ కాలువ పనులను రోడ్డు మార్గంలో పరిశీలించారు. మార్గమధ్యంలో నాలుగు చోట్ల ఆగి గ్రావిటీ కాలువ పనులను చూశారు. పనులు నెమ్మదించడాన్ని గమనించిన ఆయన త్వరగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. లైనింగ్‌ పనులు మరింత త్వరగా పూర్తి చేయాలని సూచించారు.

అక్కడినుంచి అన్నారం బ్యారేజీ వద్దకు వెళ్లారు. 66 గేట్ల బిగింపు, 90 శాతం పనులు అక్కడ పూర్తవ్వడంతో అధికారులను అభినందించారు. మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సుందిళ్ల బ్యారేజీ వ్యూ పాయింట్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం  పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు 2టీఎంసీల నీటిని ఎత్తిపోసే దిశగా పనులు జరగాలని, తర్వాత పంపుల ట్రయిల్‌ రన్‌ నిర్వహించాలని, ఈ ఖరీఫ్‌లో రైతులకు ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి సాగునీరందాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం పనుల్లో వేగం మరింత పెంచాలని ఆయన సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా రోజుకు మూడు షిప్టల్లో పనులు జరగాలన్నారు. అనంతరం అంతర్గాం మండలంలో నిర్మిస్తున్న గోలివాడ పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు.

ఎస్సారెస్పీ పునరుజ్జీవంపై అసంతృప్తి...
ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో కొనసాగుతున్న రివర్స్‌ పంపింగ్‌ పనుల తీరుపై సీఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద కాలువ వద్ద నిర్మిస్తున్న పంపింగ్‌ నిర్మాణ పనుల పరిశీలన తర్వాత ఆయన 20 నిమిషాల పాటు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. పనులు 40శాతం కూడా జరగకపోవడంతో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నత్తనడకన పనులు జరుగుతుంటే నిర్ణీత గడువులోగా పనులు ఎలా పూర్తవుతాయని.. ఇలా అయితే అనుకున్న సమయానికి నీళ్లు అందించలేమన్నారు.

రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌తో పాటు మల్యాల మండలం రాంపూర్‌లో నిర్మిస్లున్న పంప్‌హౌస్‌ను మార్చి 31 వరకు పనులు పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ఈ రెండు పంప్‌హౌస్‌లకు కావాల్సిన సిబ్బందిని సమకూర్చుకుని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కావాల్సిన మిషన్‌లకు మెటీరియల్‌ చైనా నుంచి వచ్చిందని, మీకు కావాల్సిన భూమితో పాటు వసతులను కూడా జిల్లా యంత్రాంగం సమకూర్చిన తర్వాత పనుల్లో జాప్యమెందుకు జరుగుతోందని మండిపడ్డారు. మూడు నెలల్లో కార్మికులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని పనులను పూర్తి చేయాలని నవయుగ సంస్థను ఆదేశించారు.

కేసీఆర్‌ వెంట ప్రభుత్వ ప్రధాన కర్యాదర్శి ఎస్‌కే.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్య మంత్రి ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజేశంగౌడ్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ తుల ఉమ, ఈఎన్‌సీ మురళీధర్, అనిల్‌కుమార్, ఈఎస్‌ఈ శ్రీకాంత్, తెలంగాణ నీటిపారుదల సలహాదారు పెంటారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సీఈ ఎన్‌.వెంకటేశ్వర్లు, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సంపత్‌రావు, నవయుగ ఇంజనీర్‌ కంపెనీ చైర్మన్‌ చంద వెంకటేశ్వర్‌రావు, వెంకటరమణారావు తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top