ఫలితాలే ప్రామాణికం

KCR Meeting On Lok Sabha Election 2019 - Sakshi

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ నిర్ణయం

ఫలితాల ఆధారంగానే పదవుల పంపకాలు

ఎల్బీస్టేడియం సభ నిర్వహణపై తీవ్ర అసంతృప్తి

పునరావృతం కావొద్దని మంత్రులకు సూచన

ప్రచారం ఊపు పెంచాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకునే పదవులపరంగా అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపులో ఎవరెవరు ఎలా పనిచేశారనే అంశాలను పరిశీలించే భవిష్యత్తులో పదవుల భర్తీ చేయాలని భావిస్తోంది. మంత్రి పదవులతోపాటు ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవుల భర్తీలో పార్టీ కోసం పని చేసిన వారికి అవకాశం వచ్చేలా చర్యలు తీసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు నేతల  వ్యవహారశైలితో కొన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓడిపోయారు. అప్పటి వరకు రాష్ట్ర స్థాయిలో కీలక పదవులలో ఉన్న కొందరు ముఖ్యనేతల వైఖరితోనే దాదాపు 10 స్థానాల్లో పార్టీ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషిచేసేవారికి, పార్టీ విధేయులకే పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారు.  
 
అమాత్య పదవుల్లోనూ..
ఎన్నికల తర్వాత జరగనున్న మంత్రివర్గ విస్తరణలోనూ.. పార్టీ గెలుపును ప్రామాణికంగా తీసుకుని భర్తీ చేయాలని భావిస్తున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో మరో ఆరుగురిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంది. సామాజికవర్గాలు, జిల్లా కోటా వంటి వాటి కంటే పార్టీ కోసం పని చేసే వారికి, విధేయులకు ఈసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయానికి కేసీఆర్‌ వచ్చారు. అలాగే శాసనసభలో చీఫ్‌ విప్, విప్, శాసనమండలిలో చీఫ్‌ వంటి పదవుల భర్తీలోనూ ఇదే తరహాలో వ్యవహరించనున్నారు. అలాగే త్వరలోనే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. వీటికితోడు పలు రాష్ట్ర స్థాయి కీలక కార్పొరేషన్ల చైర్మన్లు ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. దీంతో వీటిని కూడా భర్తీ చేయాల్సి ఉంది. అలాగే టీఆర్‌ఎస్‌ గత ప్రభుత్వంలో కార్పొరేషన్‌ చైర్మన్లుగా నియమితులైన వారి పదవీకాలం ముగింపు దశకు చేరింది. జూన్‌ నుంచి దశల వారీగా పలు చైర్మన్‌ పోస్టులు ఖాళీ కానున్నాయి. ఇలా రాష్ట్ర స్థాయి పదవులతోపాటు మార్కెట్‌ కమిటీలు, ఆలయ కమిటీ వంటి పదవులు ఖాళీ అవుతున్నాయి. మార్కెట్‌ కమిటీలకు కొత్త రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి.  
 
‘స్థానిక’ంలోనూ ఇదే ముద్ర
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మే నెలలోనే జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్‌ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఎన్నికల్లోనూ పార్టీ విధేయత, ఎన్నికల్లో కీలకంగా పని చేసిన వారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం నిర్ణయించింది. ఎన్నికల ఫలితాల ప్రకారం మండలాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాల వారీగా సమగ్ర సమాచారం సేకరించి అవకాశాలిచ్చే విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.
 
ప్రచారం జోరు పెంచాలి
లోక్‌సభ ఎన్నికల ప్రచార వ్యూహంపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రచారం ఊపు పెంచాలని మంత్రులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ప్రచార నిర్వహణపై పలువురు మంత్రులతో సీఎం కేసీఆర్‌ శనివారం ఫోన్‌లో మాట్లాడారు. లోక్‌సభ సెగ్మెంట్లు, ఆ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రచార తీరుపై వచ్చిన సమాచారాన్ని మంత్రులకు వివరించారు. ఏ సెగ్మెంట్‌లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలో వివరించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రచారసభలకు శనివారం విరామం ఉంది. ఆదివారం నుంచి ఏప్రిల్‌ 4 వరకు వరుసగా బహిరంగసభలున్నాయి.

ఈ బహిరంగసభలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సీఎం కేసీఆర్‌ మంత్రులను ఆదేశించారు. జనమీకరణలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభ ఏర్పాట్లపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని మంత్రులు–ఎమ్మెల్యేలకు.. ఎమ్మెల్యేలకు–కార్పొరేటర్లకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి సమాచారం అందింది. మరోసారి ఇలాంటి పరిస్థితి ఎక్కడా రావద్దని మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీఅయ్యాయి. జనసమీకరణతోపాటు, బహిరంగసభకు వచ్చే ప్రజలకు తాగునీరు సరఫరా కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top