మిడ్‌మానేరు ఎగువన 3.. దిగువన 2 టీఎంసీలు!

KCR mandate for a comprehensive plan of water evacuation - Sakshi

ఎల్లంపల్లి నుంచి మల్లన్నసాగర్‌ వరకు నీటి తరలింపు సమగ్ర ప్రణాళికకు సీఎం ఆదేశం 

మిడ్‌మానేరు వరకు ఇప్పటికే 3 టీఎంసీలకు ప్రాథమిక నివేదిక 

పత్తిపాక రిజర్వాయర్‌పై మాత్రం రాని స్పష్టత 

మిడ్‌మానేరు దిగువన పైప్‌లైన్, టన్నెల్‌ వ్యవస్థల ఏర్పాటుపై అధ్యయనం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి నుంచి మూడో టీఎంసీ నీటిని తీసుకునేలా ఇప్పటికే బృహత్‌ కార్యాచరణకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, నీటిని తరలించే వ్యవస్థలకు సమగ్ర ప్రణాళికల తయారీలో పడింది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తరలించేలా సివిల్‌ పనులు జరుగుతుండగా, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు మీదుగా దిగువ మల్లన్నసాగర్‌ వరకు నీటిని తరలించే ప్రణాళికలకు పదును పెడతోంది. ప్రాజెక్టు ద్వారా గరిష్ట నీటి వినియోగం, వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చేలా అధ్యయనం చేసి పనులకు శ్రీకారం చుట్టాలని శనివారం నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా ఎలాంటి నిర్మాణాలు అవసరమవుతాయా? ఎక్కడెక్కడ లిఫ్టులు, టన్నెళ్లు, పైప్‌లైన్‌ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, వ్యయ అంచనాలపై అధ్యయనం ఆరంభించింది.  

పత్తిపాక ఉంచాలా?.. వద్దా?.. 
కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు 3 టీఎంసీల నీటిని తరలించేలా ఇప్పటికే పనుల కొనసాగుతున్నాయి. అం దుకు తగ్గట్లే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం.. ఎల్లంపల్లి దిగువన మిడ్‌మానేరు వరకు 2 టీఎంసీలు, మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్‌ వరకు ఒక టీఎంసీ నీటిని తరలించేలా పనులు జరుగుతున్నాయి. మిడ్‌ మానేరుకు వచ్చే రెండు టీఎంసీల్లో ఒక టీఎంసీ నీటిని శ్రీరాంసాగర్‌ ఆయకట్టు స్థిరీకరణకు తరలించేలా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టడంతో, మిడ్‌మానేరు దిగువన మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ మొదలుకుని గంధమల, బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వరకు ఒక టీఎంసీ నీరు మాత్ర మే లభ్యతగా ఉంటుంది. ఈ నీటితో ఆయకట్టు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టం. దీన్ని దృ ష్టిలో పెట్టుకొని మిడ్‌మానేరు వరకు 3 టీఎంసీలు, ఆ దిగువన 2 టీఎంసీల నీటిని తరలించాలన్నది సీఎం యోచన.

ఈ నేపథ్యంలో ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు ప్రత్యేక పైప్‌లైన్‌ వ్యవస్థను నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనలో సుమారు 10 టీఎంసీలతో పత్తిపాక రిజర్వా యర్‌ను సైతం ప్రతిపాదించారు. దీని నిర్మాణంపై భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఉంచా లా? వద్దా? అన్న దానిపై అధ్యయనం చేయా లని ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. దీన్ని కొనసాగించితే ప్రాజెక్టుకు రూ.13 వేల నుంచి రూ.14 వేల కోట్ల వ్యయం కానుంది. పత్తిపాక లేని పక్షంలో రూ.11 వేల కోట్లు కానుంది. ఇక మిడ్‌మానేరు దిగువన ప్రస్తుతం 12 వేల క్యూసెక్కులు (ఒక టీఎంసీ) మేర నీటిని తరలించేలా కాల్వలు, టన్నెళ్ల నిర్మాణాలు జరుగు తున్నాయి.

ప్రస్తుతం 24వేల క్యూసెక్కుల (2 టీఎంసీ) నీటిని తరలించాలంటే మళ్లీ కొత్తగా లిఫ్టులు, పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కాల్వలు, టన్నెళ్ల నిర్మాణం చేయాల్సి ఉంది. టన్నెళ్ల నిర్మాణం చేస్తే సమయం ఎక్కువగా పట్టే నేపథ్యంలో పైప్‌లైన్‌ వ్యవస్థ వైపు సీఎం మొగ్గు చూపుతున్నారు. పైప్‌లైన్‌ వ్యవస్థ అయితే రూ.11 వేల కోట్లు, టన్నెల్‌ అయితే రూ.8 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అయితే ఏ వ్యవస్థ సరైనదో నిర్ణయించి వారంలో నివేదించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ వ్యవస్థలకు అవసరమయ్యే సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తూనే, ప్రస్తుతం జరుగుతున్న పనుల ద్వారా కనిష్టంగా 3 వేల చెరువులను నింపాలని కేసీఆర్‌ అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట్ల తూముల నిర్మాణం వేగిరం చేయాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top