కలగన్న తెలంగాణ కన్పిస్తోంది | Sakshi
Sakshi News home page

కలగన్న తెలంగాణ కన్పిస్తోంది

Published Tue, Dec 31 2019 3:30 AM

CM KCR Says Kaleshwaram Water Is A Dream Come True - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ‘తెలంగాణ రాష్ట్రం సాకారమైతే గోదావరి డెల్టా కన్నా అద్భుతంగా ఉంటుందని 2001 ఏప్రిల్‌లో కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో తొలి సింహగర్జన సభలో నేను చెప్పిన. కచ్చితంగా నిజాయితీ ఉన్న పోరాటం విజయం సాధిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. ఈరోజు ఆ కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. మిడ్‌మానేరు ప్రాజెక్టు మీద నిల్చొని పూజ చేస్తున్నప్పుడు చాలా ఆనందం కలిగింది. జీవితంలో గొప్ప సఫలత్వం సాధించినట్లు అనుభూతి కలిగింది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం మిడ్‌మానేరును సందర్శించిన అనంతరం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ కలగన్న తెలంగాణ ఇప్పుడు కనిపిస్తోందని భావోద్వేగంతో చెప్పారు. సమావేశంలో కేసీఆర్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

ఎంత ఆపినా ఆగలేదు..
‘కాళేశ్వరం ప్రాజెక్టు ఆపేందుకు వందల కేసులు వేసిన్రు. మిడ్‌మానేరుపైనా వేస్తున్నరు. చిల్లర రాజకీయ ఆటంకాలు ఉన్నా మా ప్రయత్నాలు ఆగలేదు. ఎవరూ ఏ ఆటంకం తలపెట్టినా మేం పురోగమిస్తూనే ఉంటం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రెండు పంటలు కలిపి 75 నుంచి 80 లక్షల ఎకరాల పంట పండుతుంది. కాళేశ్వరం పరిధిలో ఇప్పుడు కళకళలాడుతున్న రాజరాజేశ్వర స్వామి జలాశయం, లోయర్‌ మానేరు జలాశయం ఎప్పుడూ నిండుకుండలా ఉంటయి. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మల్లన్న సాగర్‌ నీటి ఖజానాలుగా ఉంటయి. ఎక్కడ నీరు తగ్గినా మిడ్‌మానేరు ఆదుకుంటది. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకే గాక, హైదరాబాద్‌కు, ఎన్‌టీపీసీ, ఎఫ్‌సీఐ, మిషన్‌ భగీరథకు నీరు వెళ్తుంది. కరువు కాటకాలకు మారుపేరుగా ఉన్న కరీంనగర్‌ జిల్లా కాకతీయ కాల్వ, వరద కాల్వ, మానేరు, కాళేశ్వరం డ్యాంల నీటితో పాలుగారే జిల్లాగా జూన్‌ తర్వాత మనం చూడబోతున్నాం. రాష్ట్రంలో అధికారికంగా 24 లక్షల పంపుసెట్లు రాష్ట్రంలో ఉన్నాయి. అనధికారికంగా మరో మూడు లక్షల పంపు సెట్లు ఉంటాయి. భూగర్భ జలాలు పెరగడంతో బోర్లకు ఉపయోగకరంగా ఉంటుంది’.

కమిట్‌మెంట్‌ మాకే ఉంది..
రాష్ట్రం మీద కమిట్‌మెంట్‌ మాకే ఉంది. ఉద్యమకారులం, రాష్ట్రాన్ని సాధించినం. రాష్ట్రాన్ని ఎక్స్‌రే కళ్లతో చూసినం. రాష్ట్రం మీద టీఆర్‌ఎస్‌కు ఉన్న బాధ్యత ఇతర ఏ పార్టీలకు ఉండదు. రాష్ట్రవ్యాప్తంగా 1,230 చెక్‌డ్యాంలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో సింహభాగం కరీంనగర్‌ జిల్లాలోనే ఉన్నాయి. రూ.1,232 కోట్లతో కరీంనగర్‌ జిల్లాలో చెక్‌డ్యాంలు రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించాం. మానేరు నది మీద 29 చెక్‌డ్యాంలు, మూలవాగుపై 10 చెక్‌డ్యాంలు నిర్మించేందుకు టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీ చేశాం.

సోమవారం కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.చిత్రంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్‌

మొగులుకు మొఖం చూడొద్దు
తెలంగాణ రాకముందు గోదావరి ఒరుసుకుని పారిన వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్‌ జిల్లాలు సంపూర్ణమైన వివక్షకు గురయ్యాయి. ఈ జిల్లాల్లో కరువు ఉండకూడదు. కానీ తీవ్ర వివక్ష కారణంగా ఈ జిల్లాలు కరువుతో తల్లడిల్లాయి. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అప్‌టూ మిడ్‌మానేరు లింక్‌ విజయవంతంగా పూర్తయింది. సుమారు 50 నుంచి 60 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుతో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోసుకోవడం జరిగింది. దీంతో మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు డ్యాంలు నిండుగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల్లో 50 టీఎంసీలు, బ్యారేజీల్లో 60 టీఎంసీల వరకు మొత్తం 110 టీఎంసీల నిల్వ ఉంది. 20 టీఎంసీలు పోయినా నికరంగా 90 టీఎం సీలు ఉంటుంది. రైతులు మొగులుకు మొఖం చూడకుండా నిశ్చింతగా రెండు పంటలు పండించుకునే అవకాశం లభించింది. కరీంనగర్‌ నుంచి సూర్యాపేట జిల్లాకు నీళ్లు పోతున్నాయి. మహబూబాబాద్, డోర్నకల్, తుంగతుర్తి, సూర్యాపేట టేలెండ్‌ ప్రాంతాలకు నీళ్లు పోతున్నాయి.

చావులు వద్దని రాసెటోళ్లు..
కరీంనగర్‌ జిల్లాలో 46 వాగులు ఉన్నాయి. ఇన్ని వాగులు ఉండి కూడా ఈ జిల్లా కరువు పాలైంది. ఇదే జిల్లా నుంచి దుబాయ్, గల్ఫ్, బొంబాయిలకు జనం వలసలు పోయిన్రు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలు పూర్తిగా కరువు బారినపడ్డాయి. 700 నుంచి 900 ఫీట్ల వరకు బోర్లు వేసినా నీళ్లు పడలే. కరెంటు బాధలు తాళలేక జమ్మికుంటలో భిక్షపతి అనే యువకుడు చచ్చిపోయిండు . సిరిసిల్లలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా రు. ‘చావులు పరి ష్కారం కాదు.. చావకండి’అని అప్పటి కలెక్టర్‌ గోడల మీద నినాదాలు రాయించిండు. 60 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత ఈ నినాదాలా మనం చూసేదని కళ్లకు నీళ్లు వచ్చినై.

కరీంనగర్‌కు జీవధార..
ఇప్పుడు కరీంనగర్‌ జిల్లాలో లక్ష్మి, సరస్వతి, పార్వతీ బ్యారేజీలు కలిపి 145 కిలోమీటర్ల మేర గోదావరి 365 రోజులు సజీవంగా ఉంటుంది. ఇది కరీంనగర్‌ జిల్లాకు జీవధార. బోర్లు రీచార్జి అయినయి. అద్భుతంగా బోర్లు నిండాయని సిరిసిల్ల దగ్గర జిల్లెల్ల, నేరేళ్ల రైతులు చెప్పారు. మిడ్‌ మానేరు పుణ్యమా అని భూగర్భ జలాలు పైకి ఎగసిపడుతున్నాయి. కాకతీయ కాల్వ పాత కరీంనగర్‌ జిల్లాలో 200 కిలోమీటర్లు పారుతుంది. మెట్‌పల్లి దమ్మన్నపేట నుంచి హసన్‌పర్తి దాక 200 కి.మీ కాకతీయ కాల్వ రెండు పంటలకు నీళ్లిస్తుంది. ఎస్సారెస్పీ వరద కాల్వ కూడా 160 కిలోమీటర్లు జిల్లాలో ఉంది. ఈ కాల్వ మొత్తం 365 రోజులు నిండే ఉంటుంది. జిల్లాలో అన్నింటికన్న పొడవైన నది మానేరు. అప్పర్, మిడ్, లోయర్‌ మానేరు కలిపి 181 కిలోమీటర్ల మానేరు నది సజీవంగా ఉంటుంది.

కరీంనగర్‌లో రూ. 530 కోట్లతో చెక్‌డ్యాంలు
‘రూ.490 కోట్లతో మానేరు మీద 210 చెక్‌ డ్యాంలు, రూ.40 కోట్లతో మూలవాగు మీద 10 చెక్‌డ్యాంలు కట్టుకోవాలి. జూన్‌లోగా ఇవి పూర్తి చేసి నీటితో నింపుకునేలా సిద్ధంగా ఉండాలి. లండన్‌ థేమ్స్‌ నది సజీవంగా ఉన్నట్లు మానేరు నది కూడా ఉంటుందని నేనంటే కొందరు సన్నాసులు వక్రీకరించిన్రు. కొన్ని వెకిలి పార్టీలు హేళన చేíసినయి. జూన్‌ తర్వాత అలా మాట్లాడిన సన్నాసులకు కూడా మనం చేసిన పని కనబడుతది. కరీంనగర్‌ మానేరు, మిడ్‌మానేరు, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాలను టూరిజంగా అభివృద్ధి చేస్తాం. పాపికొండల నడుమ గోదావరి కనిపించినట్లే వేములవాడ పుణ్యక్షేత్రం, మిడ్‌మానేరు కలిపి సిరిసిల్లలో కనబడుతుంది. ఏ తెలంగాణ కలగన్ననో ఆ తెలంగాణ కనబడుతంది. 46 నదులు కరీంనగర్‌ జిల్లాలో ఉన్నాయి. పిచ్చికూతలు కూసేవాళ్లకు ఇన్ని వాగులు ఉన్నట్లు కూడా తెల్వదు. ఈడ ప్రాజెక్టులు కట్టాలని మాకు ఎవ్వరూ దరఖాస్తులు ఇవ్వలేదు. ఎవరూ పైరవీలు చేయలేదు. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి చేసినం. రాజకీయ వివక్ష లేకుండా మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పూర్తి చేసినం. ఈ చెక్‌డ్యాంలను కూడా అలాగే నిర్మిస్తం’అని సీఎం కేసీఆర్‌ వివరించారు.

 
Advertisement
 
Advertisement