తెలంగాణలో మే 29 వరకు లాక్‌డౌన్‌ : సీఎం కేసీఆర్‌

KCR Latest Updates On Coronavirus In Telangana - Sakshi

లాక్‌డౌన్‌ మరింత కఠినంగా అమలుచేస్తాం

రాష్ట్ర వ్యాప్తంగా రా.7 నుంచి ఉ.6 వరకు కర్ప్యూ

కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు యధాతథంగా అమలుచేస్తాం

అన్ని జోన్లలో మద్యం షాపులు తెరుస్తాం.

రైతు బంధు వందశాతం అందరికీ ఇస్తాం

మే 15 వరకు ఆర్టీసీ బంద్‌ : సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగించినట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. గ్రీన్ లేదు.. రెడ్ లేదు.. అన్ని జిల్లాల్లో మే 29 వరకూ రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొద్దిరోజులు ఓపికపడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. తెలంగాణలో టెస్టింగ్‌ కిట్ల కొరత లేదని చెప్పారు. అయితే.. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌లో కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రం, రూరల్‌ ప్రాంతాల్లో అన్ని షాపులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.  లాక్‌డౌన్‌, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం మీడియా సమావేశంలో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. రాష్ట్రంలో మద్యం షాపులు బుధవారం నుంచి తెరచుకుంటాయని చెప్పారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ వెల్లడించిన మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..

కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు
తెలంగాణలో కొత్తగా మరో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.  దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1096 చేరింది. కరోనా నుంచి కోలుకొని  628 మంది డిశ్చార్జ్‌ అయ్యారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 439 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక డెత్‌రేట్‌ విషయం మన రాష్ట్రం మెరుగ్గా ఉందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశంలో డెత్‌రేట్‌ 3.37 ఉంటే..మన రాష్ట్రంలో 2.64 ఉందని పేర్కొన్నారు.

కోటి మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తాం
‘మొత్తం మానవ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న కరోనా మనల్ని కూడా పట్టిపీడిస్తోంది. కరోనాను నమ్మడానికి వీల్లేదు. ఇది కనిపించని శత్రువు. తమకు తామే స్వీయనియంత్రణ పాటించాలి. ఎవరో బలవంత పెడితే పాటించాలనుకోవద్దు. తమని తామే రక్షించుకోవాలి. అమెరికాలో భారీగా మరణాలు సంభవించాయి. మనదేశంలోనూ కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. భౌతిక దూరం పాటించి కొంత విజయం సాధించాం. కరోనా నియంత్రణకు ఏకైక ఆయుదం లాక్‌డౌన్‌. కొంచెం జాగ్రత్తగా ముందుకెళితే రాష్ట్రం, సమాజం బాగుపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మే 29వరకు పొడగిస్తున్నాం. ఇప్పటివరకు సహకరించిన ప్రజలందరూ మరికొంత కాలం సహనంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బయటకు రావొద్దు. వీరికి కావాల్సిన మందులు 3 నెలలకు సరిపడా ఒకేసారి ఇస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులున్న వారికోసం కోటి మాస్కులు ఉచితంగా పంపిణీ చేస్తాం. తెలంగాణలో 6 జిల్లాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. 9 జిల్లాలు గ్రీన్‌జోన్లలో ఉన్నాయి.18 జిల్లాలు ఆరెంజ్‌ జోన్లలో ఉన్నాయి. కనుక కరోనా మహమ్మారిపై పోరులో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు  పాటిస్తూ ముందుకెళ్లాల్సిందేనని' సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. చదవండి: ‘వారిని ఎందుకు ఆదుకోవడం లేదు’

రెడ్‌జోన్లలో ఒక్కషాపు కూడా ఓపెన్ చేయం
తెలంగాణలో 35 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. ఇందులో 19 హైదరాబాద్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 66 శాతం కేసులు ఉన్నాయి. 80 శాతంపైగా మరణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరిగాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే కమ్యూనిటీ స్ప్రెడ్‌ అయ్యే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌లో మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ప్రపంచ వ్యాప్తంగా చెబుతున్నదాన్ని  ప్రకారం 70 రోజులపాటు నిర్బంధం ఉంటేనే కరోనాను కట్టడి చేయగలం.నేను చెప్పే విషయాలు కొందరికి నచ్చకపోవచ్చు. కానీ పాటించక తప్పదు. తెలంగాణ ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడంలో అన్నిరకాలుగా సన్నద్ధంగా ఉంది. రెడ్‌జోన్లలో ఒక్కషాపు కూడా ఓపెన్ చేయం. మిగిలిన జోన్లలో నిత్యావసర వస్తువుల షాపులతో పాటు గృహ నిర్మాణానికి సంబంధించిన దుకాణాలు మాత్రమే తెరుస్తాం.

వ్యవసాయానికి సంబంధించిన షాపులు తెరుచుకుంటాయి. 65ఏళ్ల పైబడినవారు బయటకు రాకుండా చూడాలి. వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని షాపులు తెరిచేఉంటాయి. రవాణా రంగానికి సంబంధించిన ఆఫీస్‌లు అన్ని చోట్ల పనిచేసుకోవచ్చు. స్టాంపులు రిజిస్ట్రేషన్‌ల శాఖ వందశాతం స్టాఫ్‌తో పనిచేస్తుంది. వాహనాల రిజిస్ట్రేషన్‌లు చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో సడలింపులు ఇవ్వొద్దని అధికారులు, వైద్యులు సూచించారు.గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో మండల స్థాయిలో అన్నిషాపులు తెరుచుకుంటాయి. మున్సిపాలిటీల్లో 50 శాతం షాపులకు మాత్రమే అనుమతి. లాటరీ ప్రకారం ఒకరోజు 50 శాతం.. మరో రోజు 50 శాతం షాపులకు అనుమతి ఇస్తాం. గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో ఉ.10 నుంచి సా.6 వరకు మాత్రమే షాపులు తెరిచేఉంటాయి.

పది పరీక్షలు నిర్వహిస్తాం
మధ్యలో ఆగిపోయిన పదో తరగతి పరీక్షలు  నిర్వహిస్తాం. హైకోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తాం. భౌతిక దూరం పాటిస్తూ... పరీక్షలు నిర్వహిస్తాం. మే నెలలోనే పరీక్షలు పూర్తి చేస్తాం. రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు వాల్యువేషన్‌ జరుగుతుంది. చదవండి: కరోనా ఎఫెక్ట్‌ : టీఎస్‌ హైకోర్టు కీలక ప్రకటన

న్యాయవాదుల కోసం రూ.25 కోట్లతో నిధి
కరోనాతో మనం కలిసి బతకాల్సిందే. కరోనా రేపో.. ఎల్లుండో సమసిపోయే సమస్యకాదు. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే. పేద అడ్వకేట్‌లను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయవాదుల కోసం 25కోట్లతో నిధిని ఏర్పాటు చేశాం. ట్రస్ట్ ద్వారా ఈ డబ్బులు పేద న్యాయవాదుల సహాయానికి ఉపయోగిస్తాం.

మద్యం షాపులు తెరుస్తాం
రాష్ట్రంలో రేపటి నుంచి మద్యం షాపులు తెరచుకోవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 దాకా మద్యం షాపులు తెరచి ఉంటాయి. చీప్‌ లిక్కర్‌పై 11 శాతం, మిగిలిన వాటిపై 16 శాతం ధరలు పెంచుతున్నాం. భౌతిక దూరం పాటించకపోతే ఏ క్షణంలో నైనా షాపులు మూసివేయవచ్చు. కంటెన్మెంట్ జోన్స్‌లోని 15 మద్యం షాపులు మూసి ఉంటాయి. రెడ్‌ జోన్లలో కూడా మద్యం షాపులు ఓపెన్‌ చేస్తారు. బార్లు, పబ్‌లు, క్లబ్బులకు అనుమతి లేదు. 

వలస కూలీలను ఆదుకుంటాం
వలస కూలీలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పని ప్రారంభం అవుతుంది కాబట్టి...వలస కూలీలు ఇక్కడే ఉండాలని కోరుతున్నాం.మీ పనులు మీరు చేసుకోడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం.తమ గ్రామాలకు వెళ్లాలని అనుకున్న వారికోసం ఏర్పాట్లు చేస్తాం. అయితే అందరు వలసకూలీలను ఒకేసారి పంపడం కష్టతరం. ఇప్పటికే బీహార్, యూపీ, ఎంపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాం. ఒకేసారి లక్షలమంది వస్తే తీసుకోడానికి ఆయా రాష్ట్రాలు సిద్ధంగా లేవు.వలస కూలీలు ఎలాంటి ఆందోళనలు పెట్టుకోవద్దు. మీరు వెళ్లాలనుకుంటే మీకు ఏర్పాట్లు చేస్తాం. మీరు ఉండాలనుకుంటే... మీకు అన్ని రకాల వసతులు కల్పిస్తాం. కొన్ని ట్రైన్‌లు ఇప్పటికే తెలంగాణా నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పటికే తెలంగాణా నుంచి 13రైళ్లు బయల్దేరాయి. రైస్‌మిల్లులో పనిచేసే కూలీలు బీహార్‌ నుంచి రావాలనుకుంటున్నారు.ఇక్కడి నుంచి వలస కూలీలను తీసుకెళ్లే రైళ్లలో...బీహార్ నుంచి కూలీలు వస్తున్నారు.

రైతు బంధు వందశాతం అందరికీ ఇస్తాం
కేసీఆర్ బతికి ఉన్నంతవరకు రైతుబంధు పథకం యధావిధిగా కొనసాగుతుంది. వర్షకాలం పంటకు కూడా 7వేల కోట్లు బాజాప్తా ఇస్తాం.బడ్జెట్‌లో చెప్పిన విధంగా 25వేల రుణం ఉన్నవారికి ఒకే దఫా రుణమాఫి
దీనికోసం 1200 కోట్లు రేపే విడుదల చేస్తున్నాం. దాదాపు 5లక్షలమందికి పైగా రైతులకు లబ్ది చేకూరుతుంది.రైతులు, పేదల సంక్షేమంలో రాజీపడే పరిస్థితి లేదు.

మే 15 వరకు ఆర్టీసీ బంద్‌
ప్రస్తుతం ఆర్టీసీ సేవలను ప్రారంభించం. మే 15 తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఆటోలకు, క్యాబ్‌లకు గ్రీన్‌జోన్‌లో అవకాశం ఉంది. మతపరమైన సామూహిత కార్యక్రమాలకు అనుమతిలేదు. ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతి లేదు.  అత్యవసరం ఉంటే 100 డయల్‌ చేయండి పాసులు ఇస్తాం. 

కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదు
తెలంగాణ రాష్ట్రానికి నెలకు రూ.15 వేల కోట్ల ఆదాయం రావాలి. కేంద్రం వాటా పోను నెలకు రూ.11 వేల కోట్లు రావాలి. కేవలం 16 వందల కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ప్రపంచవ్యాప్తంగా అవలంభిస్తున్న విధానాలను చూసి అనుసరించాలి. వలస కూలీలకు రైల్వే చార్జీలు ఇచ్చే డబ్బు కేంద్రం వద్ద లేదా? డబ్బులు వసూలు చేసేందుకు ఇదే సమయమా? కూలీలను తరలించే రైళ్లకు సూపర్ ఫాస్ట్ చార్జీలు, రిజర్వేషన్ చార్జీలు వేస్తారా? ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని పెంచాలని ప్రధానిని కోరుతున్నా’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top