ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు!

Karimnagar Collector Sarfaraz Ahmed Elections Preparations - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడినా.. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధం అవుతోంది. ఓటర్ల నమోదు, పోలింగ్‌ కేంద్రాలు, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం), ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌తోపాటు అధికార యంత్రాంగం బిజీబిజీగా ఉంది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇదేపనిలో తలమునకలవుతున్నారు. ఒకపక్క ఓటరు నమోదు ప్రక్రియ, జాబితా ప్రకటన ప్రక్రియ వేగవంతంగా చేస్తూనే.. మిగతా పనులన్నీ చక్కబెడుతున్నారు. జిల్లాకు వచ్చిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల పరిశీలన, మాక్‌ పోలింగ్, రాజకీయ పార్టీలతో అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు.

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్, జేసీ జీవీ శ్యాంప్రసాద్‌ లాల్‌ సమక్షంలో బెంగళూర్‌ నుంచి వచ్చిన 20 మంది ఇంజినీర్లు వీటి పనితీరును వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇదివరకు ఉన్న 13,221 బ్యాలెట్‌ యూనిట్లు, 8,636 కంట్రోల్‌ యూనిట్లను అధికారులు తిరిగి పంపించారు. ప్రస్తుతం జిల్లాలో 1,142 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 1,830 బ్యాలెట్‌ యూనిట్లు, 1,430 కంట్రోల్‌ యూనిట్లు బెంగళూర్‌లోని బీఎల్‌ కంపెనీ నుంచి తెప్పించారు. కొత్తగా 1,540 వరకు వీవీ ప్యాట్స్‌ ప్రవేశపెట్టారు. జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌ నోడల్‌ అధికారిగా వ్యవహరిస్తూ అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల ప్రాథమిక పరిశీలన కార్యక్రమం వారంరోజులు సాగుతోంది. వివిధ రాజకీ య పార్టీల సమక్షంలో బీఎల్‌ కంపెనీకి చెందిన 20 మంది ఇంజినీర్లు ఏ విధంగా పనిచేస్తాయో ఆదివారం కూడా వివరించా రు. కీప్యాడ్‌లు, డిస్‌ప్లే బోర్డులు, లైటింగ్, సౌండ్‌ సిస్టం పనితీరును పరిశీలిస్తున్నారు.

ఈవీఎంను పరిశీలించిన కలెక్టర్‌...
ఎన్నికల సంఘం జిల్లాకు బెంగళూర్‌ నుంచి పంపించిన ఈవీఎంలను అన్ని రాజకీయ పార్టీల సమక్షంలో జిల్లా కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం పంపించిన అన్ని ఈవీ ఎంలను ముందుగా అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మొదటిస్థాయి తనిఖీని చేస్తున్నట్లు తెలిపారు. తర్వాత ఈవీఎంలు అన్నిసరిగా పని చేస్తున్నది లేనిది రాజకీయ నాయకుల సమక్షంలోనే ఇంజినీర్లు తనిఖీ చేస్తారన్నారు. అనంతరం కొత్తగా ఈవీఎంలకు వీవీ ప్యాట్స్‌ల పనితీరును కూడా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వివరిస్తామని తెలిపారు.

రాజకీయ పార్టీల నేతల సమక్షంలో మాక్‌పోలింగ్‌: సర్పరాజ్‌ అహ్మద్‌
అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సంఘం జిల్లాకు పంపిన ఈవీఎంలతో మాక్‌పోల్‌ నిర్వహించినట్లు జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్‌ వెనుక గల ఈవీఎంల గోదాములో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోవారు ఎంచుకున్న ఈవీఎంలతో ఓట్లు వేయించి మాక్‌పోల్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈవీఎంలతోపాటు ఈసారి కొత్తగా వీవీ ప్యాట్‌లను కూడా పంపించిందని తెలిపారు.

వేసిన ఓటును అదే అభ్యర్థికి పడింది.. లేనిది వి.వి ప్యాట్‌ స్కీన్‌పై చూడవచ్చునని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వివిధ ఈవీఎంలపై ఓట్లు వేసి ఓట్లు సరిగా పడుతున్నాయా..? లేదా..? అని రాజకీయ పార్టీల అభ్యర్థులకు చూపించారు. అదే విధంగా రాజకీయ పార్టీల అభ్యర్థులను కూడా మాక్‌పోల్‌లో పాల్గొని ఓట్లు వేసి ఈవీఎంల పనితీరును పరిశీలించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్, అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, మెప్మా పీడీ పవన్‌కుమార్, జిల్లా కోశాధికారి కార్యాలయం ఉప సంచాలకులు శ్రీనివాస్, కరీంనగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top