విద్యుత్ కార్మికులను ముంచిన సీఎం కేసీఆర్ | Jaggareddy takes on kcr | Sakshi
Sakshi News home page

విద్యుత్ కార్మికులను ముంచిన సీఎం కేసీఆర్

Oct 11 2014 12:27 AM | Updated on Sep 5 2018 1:52 PM

విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని నిండా ముంచారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు.

సాక్షి, సంగారెడ్డి: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు వారిని నిండా ముంచారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ శుక్రవారం ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ఎదుట సమ్మెకు దిగారు. సమ్మెకు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘీభావం ప్రకటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను అధికారంలోకి రాగానే పర్మినెంట్ చేస్తానని కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారన్నారు.

అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మాట తప్పి కాంట్రాక్టు కార్మికుల పొట్టకొడుతున్నారన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించకపోగా వారిని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చే ప్రయత్నం చేయటం దారుణమన్నారు.  జిల్లాలోని సుమారు రెండువేల మందికిపైగా విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు.

విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకవెళ్లే సత్తా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తానని హెచ్చరించారు.

సోమవారం చేపట్టనున్న నిరసన ర్యాలీ, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం ముట్టడిలో పాల్గొంటానన్నారు. సమ్మెలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల జేఏసీ నాయకులు సాయిలు, వేణుగోపాల్, శివశంకర్, రాజు, కిరణ్, బ్రహ్మం, నాగరాజు, శివకుమార్, సయ్యద్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement