అరెస్ట్‌ చేస్తే చేసుకోండి.. రేవంత్‌ అసహనం! | IT And Enforcement Directorate Raids On Revanth Reddy Home | Sakshi
Sakshi News home page

విదేశీ ఖాతాల సంగతేంటి?

Published Sat, Sep 29 2018 1:39 AM | Last Updated on Sat, Sep 29 2018 10:33 AM

IT And Enforcement Directorate Raids On Revanth Reddy Home - Sakshi

శుక్రవారం కార్యకర్తలను కలిసేందుకు ఇంటి నుంచి బయటకు వస్తున్న రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ రేవంత్‌రెడ్డి నివాసంలో శుక్రవారం రెండో రోజు కూడా ఆదాయపు పన్నుశాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు కొనసాగించారు. గురువారం అర్ధరాత్రి 3 గంటల వరకు సోదాలు నిర్వహించిన బృందాలు.. శుక్రవారం ఉదయం 7 గంటలకే తిరిగి తనిఖీలు మొదలుపెట్టాయి. రేవంత్‌రెడ్డితోపాటు ఆయన భార్య గీత, సోదరుడు కొండల్‌రెడ్డి, అనుచరుడు ఉదయ్‌సింహను 11 మంది ఐటీ అధికారులు పలు దఫాలుగా విచారించి అనేక కీలకాంశాలపై ప్రశ్నలవర్షం కురిపించినట్లు తెలిసింది. 

ఆ ఖాతాలపై వివరణ ఇవ్వండి..
హాంకాంగ్‌ ద్వారా విదేశీ నిధులను పొందినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్‌ స్థాయి అధికారి రేవంత్‌ను ప్రశ్నించారు. హాంకాంగ్‌లోని మురళీ రాఘవన్‌ ద్వారా ఖాతాలు తెరిచినట్లు తమ వద్ద బలమైన ఆధారాలున్నాయని, ఆ డబ్బు ఎక్కడికి, ఎవరి కోసం, దేని కోసం తెప్పించారో వెల్లడించాలని అధికారుల బృందం పదేపదే ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విదేశీ నిధులతోపాటు హాంకాంగ్, కౌలాలంపూర్‌ తదితర బ్యాంక్‌ ఖాతాలతో తనకెలాంటి సంబంధం లేదని రేవంత్‌ బదులిచ్చినట్లు తెలియవచ్చింది. భారత్‌ పౌరసత్వం ఉండగా విదేశాల్లో ఖాతాలు తెరవడం ఎలా సాధ్యమని ఆయన ఐటీ అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. తాను ఇంతవరకు హాంకాంగ్‌ వెళ్లలేదని, అనుమానం ఉంటే ఇమిగ్రేషన్‌ నుంచి వివరాలు తెప్పించుకోవచ్చని కూడా రేవంత్‌ సమాధానమిచ్చినట్లు సమాచారం. తనకు నిజంగానే హాంకాంగ్, కౌలాలంపూర్‌లలో బ్యాంకు ఖాతాలున్నట్లు నిరూపిస్తే వెంటనే అరెస్ట్‌ చేసి తీసుకెళ్లవచ్చని రేవంత్‌ వారితో గట్టిగా మాట్లాడినట్లు తెలిసింది. బినామీల పేర్లపై ఖాతాలు ఉండి ఉండొచ్చు కదా అని అధికారులు ప్రశ్నించగా ఎవరో తెరిచిన అకౌంట్లను తనకు ముడిపెట్టడం భావ్యం కాదని రేవంత్‌ పేర్కొన్నట్లు సమాచారం. 

చేస్తే అరెస్ట్‌ చేయండి.. నేను ప్రచారానికి వెళ్లాలి 
ఐటీ అధికారులు ఒకవైపు ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే రేవంత మాత్రం పదేపదే తనను అరెస్ట్‌ చేస్తే చేసుకోవాలని, తనకు సంబంధం లేని, ఎవరో ఫిర్యాదుదారులు చేసిన ఆరోపణలపై పదేపదే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అసహనంవ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. ఎవరో ఫిర్యాదు చేసిన అంశాలతో తనకేం సంబంధం అంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పగా అలా అయితే అరెస్టు చేయాల్సి ఉంటుందని దర్యాప్తు అధికారులు ఘాటుగానే సమాధానమిచ్చారు. దీంతో తనను అరెస్ట్‌ చేయాలనుకుంటే చేయాలని, లేదనుకుంటే తాను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని రేవంత్‌ పేర్కొన్నారు. 

ఆదాయపు పన్ను చెల్లింపులో తేడాలేంటి? 
2007 నుంచి ఇప్పటివరకు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాల్లో అనేక వ్యత్యాసాలున్నాయిని, వాటిపై గతంలో ఇచ్చిన నోటీసులకు ఎందుకు స్పందించలేదో చెప్పాలని ఐటీ హైదరాబాద్‌ వింగ్‌కు చెందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. అయితే తనకు ఇప్పటివరకు ఐటీశాఖ నుంచి ఎలాంటి నోటీసు రాలేదని, ఏటా తమ చార్టెడ్‌ అకౌంటెంట్‌ ద్వారా ఐటీ రిటర్న్‌లను సకాలంలో దాఖలు చేస్తున్నానని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఐటీ అధికారులు అడిగిన ఏ ప్రశ్నకూ రేవంత్‌ సరైన రీతిలో స్పందించలేదని విచారణ బృందానికి నాయకత్వం వహిస్తున్న అధికారి వర్గాలు తెలిపాయి. తనకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీతోపాటు మరో కంపెనీలోనే డైరెక్టర్‌గా ఉన్నానని, వాటితోపాటు తన జీతభత్యాలు తదితరాలకు తగ్గట్లుగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేస్తున్నానని రేవంత్‌ వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

అయితే తమకు వచ్చిన ఐటీ రిటర్న్‌ల పత్రాలు సరైనవా కావా అని చెక్‌ చేసుకునేందుకు అధికారులు వాటిని ప్రధాన కార్యాలయానికి పంపించారు. శనివారం వాటిపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని తెలిసింది. అయితే తనకు సంబంధంలేని కంపెనీలను తనకు అంటగట్టడం వల్ల ఏం సాధిస్తారో చెప్పాలని, తాను టార్గెట్‌గా సాగుతున్న దాడులకు, ఆయా కంపెనీలకు ఎలాంటి సంబంధంలేదని రేవంత్‌రెడ్డి వివరించుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. తమకు వచ్చిన కంపెనీల వివరాల ప్రకారం బినామీ ఆస్తులుగా ఆధారాలున్నాయని, అందువల్లే డొల్ల కంపెనీల్లో సోదాలు చేస్తున్నట్లు ఐటీ అధికారులు సమాధానమిచ్చారని సమాచారం. అలాగే కొన్ని కంపెనీలు ఐటీ రిటర్న్‌లు దాఖలు చేయకపోవడం, అర్ధంతరంగా కంపెనీలను స్ట్రైక్‌ ఆఫ్‌ చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమిటో తెలుసుకోవడం కోసం తమకు సోదాలు నిర్వహించే అధికారం కూడా ఉందని అధికారులు చెప్పినట్లు తెలిసింది. 

అవి నా అభరణాలే: ఐటీ అధికారులతో గీత 
రేవంత్‌రెడ్డి భార్యకు సంబంధించి ఐసీఐసీఐ, ఆంధ్రా బ్యాంకులోని లాకర్లను ఐటీ అధికారులు తెరిచి డైమండ్‌ నెక్లెస్‌తోపాటు కొన్ని బంగారు అభరణాలున్నట్లు గుర్తించారు. వాటిని ఎప్పుడు లాకర్లలో పెట్టారు, ఎన్ని రోజుల నుంచి లాకర్లలో ఉన్నాయి అనే వివరాలతోపాటు అకౌంట్ల ద్వారా జరిగిన లావాదేవీలకు సంబంధించిన లిఖితపూర్వక వివరాలను బ్యాంకుల నుంచి సేకరించారు. అనంతరం నగలను రేవంత్‌రెడ్డి ఇంటికి తీసుకొచ్చి బంగారం బరువు, విలువ ఎంత ఉంటుందనే దానిపై అప్రైజర్‌ ద్వారా అంచనా వేశారు. అయితే తన బంగారానికి సంబంధించిన అన్ని బిల్లులు, కొనుగోలు వివరాలను రేవంత్‌ భార్య ఐటీ అధికారులకు చూపినట్లు తెలిసింది. కొండల్‌రెడ్డికి సంబంధించి మూడు బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు తెరిచి కొన్ని భూముల పత్రాలతోపాటు కుటుంబ సభ్యులకు చెందిన బంగారు అభరణాలను గుర్తించారు. ఒక్కో వ్యక్తి వద్ద నిబంధనల మేరకు ఉండాల్సిన దానికంటే ఆయన వద్ద 70 గ్రాముల బంగారం అధికంగా ఉన్నట్లు గుర్తించి దీనిపై వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశించారని సమాచారం. 

ఆ డేటాలో ఏముంది? 
రేవంత్‌రెడ్డి నివాసంలో సోదాల సందర్భంగా ఐటీ అధికారులు రెండు డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, ఒక ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్లు కొనుగోలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు డిలీట్‌ అయిన డేటాను సేకరించేందుకు ఫోరెన్సిక్‌ అధికారులను రంగంలోకి దించారు. అయితే రేవంత్‌ నివాసంలో నాలుగు గంటలకుపైగా ప్రయత్నించినా డేటాను గుర్తించకపోవడంతో హార్డ్‌డిస్కులను ఐటీ అధికారులు తమ కేంద్ర కార్యాలయంలోని ల్యాబ్‌కు తరలించారు. 

నేడూ సోదాలు: అధికార వర్గాలు 
రెండు రోజులుగా రేవంత్‌ ఇంట్లో సాగుతున్న ఐటీ సోదాల పరంపర శనివారం కూడా కొనసాగుతుందని ఆదాయపుపన్ను శాఖ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి. మూడు రోజులపాటు రేవంత్‌తోపాటు ఆరుగురి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసేందుకు సెర్చ్‌ వారెంట్‌ తీసుకున్నామని, తమకు మరింత స్పష్టత రావాల్సిన అంశాలపై వివిధ కోణాల్లో ప్రశ్నిస్తామని ఆ వర్గాలు తెలిపాయి. శనివారం అర్ధరాత్రి వరకు ఈ సోదాలకు అవకాశం ఉందని, ఆలోగా తమ ప్రశ్నలకు సరైన సమాధానాలు, సంతృప్తికరమైన వివరణ, ఆధారాలు ఇస్తే తాము వెళ్లిపోతామని పేర్కొన్నాయి. సెర్చ్‌ గడువు ముగిశాక విచారణ నిమిత్తం కార్యాలయానికి పిలిపించేందుకు నోటీసులిస్తామని చెప్పాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement