2 నెలల తరువాతే.. 'ఇంటర్‌ విద్య'!

Intermediate New Academic Year Will Begin Two Months Late In Telangana - Sakshi

టెన్త్‌ పరీక్షలు నిర్వహిస్తే రోడ్లపైకి వచ్చే విద్యార్థులు 5,65,000 మంది

టెన్త్‌ పరీక్షల నిర్వహణను బట్టి సాధ్యాసాధ్యాలు

కరోనా అదుపులోకొస్తే ఆగస్టులో ఇంటర్‌ ప్రవేశాలు

లేకుంటే విద్యా సంవత్సరం మరింత ఆలస్యం

భౌతిక దూరం, ఆన్‌లైన్‌ బోధనపై కమిటీ కసరత్తు

కార్యాచరణ సిద్ధం!.. నేడో రేపో బోర్డుకు నివేదిక

పాఠశాలలో భౌతిక దూరంపైనా విద్యాశాఖ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ కొత్త విద్యా సంవత్సరం ఈసారి కనీసం రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జూన్‌ రెండో వారంలోగా కరోనా అదుపులోకి వస్తేనే ఆగస్టు నుంచి ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభమయ్యే అవకాశముంది. లేదంటే ఇంకొంత ఆలస్యం తప్పేలా లేదు. ఈ నేపథ్యంలో టెన్త్‌ పరీక్షలు, మూల్యాంకనం, ఫలితాల వెల్లడి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలు, ఆ తరువాత చేపట్టాల్సిన కార్యాచరణపై బోర్డు నియమించిన అధికారుల కమిటీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. నేడో రేపో ఇది నివేదికను బోర్డుకు అందజేయనుంది.

పదో తరగతి పరీక్షలు ఎప్పుడు?
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలన్నీ పూర్తి కాలేదు. మార్చి 19న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో ప్రథమ భాష పేపరు–1, పేపరు–2, ద్వితీయ భాష మాత్రమే పూర్తయ్యాయి. మార్చి 23 నుంచి జరగాల్సిన ఇంగ్లిష్‌ పేపరు–1, 2, మ్యాథమెటిక్స్‌ పేపరు–1, 2, జనరల్‌ సైన్స్‌ పేపరు–1, 2, సోషల్‌స్టడీస్‌ పేపరు–1, 2 పరీక్షలు వాయిదాపడ్డాయి. వచ్చే నెల 15లోగా కరోనా అదుపులోకి వస్తే తప్ప ఆ నెలాఖరులోగా ఈ పరీక్షలను నిర్వహించే పరిస్థితి లేదు. పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడితే మొత్తంగా 5.65 లక్షల మంది విద్యార్థులు రోడ్డుపైకి రానున్నారు. చదవండి: జూలైలో ‘నీట్‌’?  

కరోనా అదుపులోకి రాకున్నా, పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేకున్నా పరీక్షల నిర్వహణ కుదరదు. లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేశాకే పరీక్షల నిర్వహణ సాధ్యం కానుంది. కరోనా జూన్‌ రెండో వారంలోగా అదుపులోకి వస్తే, అదే నెల చివరిలోగా ఈ 8 సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించడం సాధ్యమవుతుందని ఓ ఉన్నతాధికారి చెప్పారు. పరీక్షలు పూర్తయ్యాక జవాబు పత్రాల మూల్యాంకనానికి మరో నెల పట్టనుంది. ఈ లెక్కన వేగంగా చర్యలు చేపడితేనే జులై నెలాఖరులో ఫలితాలు వస్తాయి. కరోనా కనుక అదుపులోకి రాకపోతే ఇంకా ఆలస్యమై ఈసారి ఇంటర్మీడియట్‌ విద్యా సంవత్సరం సెప్టెంబరులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 

కార్యాచరణపై కమిటీ కసరత్తు
ప్రస్తుత పరిస్థితుల్లో విద్యా కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణ ఖరారుకు ఇటీవల ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రానున్న 2 – 3 నెలలతోపాటు ఆ తరువాత మరో 3 –4 నెలల్లో చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేస్తోంది. కరోనా అదుపులోకి వస్తే ఏయే చర్యలు చేపట్టాలి?, అదుపులోకి రాకపోతే ఏం చేయాలనే అంశాలతో నివేదికలు సిద్ధం చేస్తోంది. నేడో రేపో దానిని బోర్డుకు అందజేయనుంది. వచ్చే నెల 15లోగా కరోనా అదుపులోకి వచ్చినా ఆ తరువాత కనీసం ఆరు నెలలపాటు భౌతికదూరం పాటించాల్సి ఉంటుందని కమిటీ భావిస్తోంది. అందుకనుగుణంగానే రాష్ట్రంలోని జూనియర్‌ కాలేజీలు, వాటి అనుబంధ హాస్టళ్లలో అమలు చేయాల్సిన విధానాన్ని ఖరారు చేస్తోంది. మరోవైపు పాఠశాలల్లోనూ భౌతికదూరం పాటించేలా చేపట్టాల్సిన చర్యలపైనా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

భౌతికదూరం, ఆన్‌లైన్‌ బోధనపై దృష్టి
స్కూళ్లు, కాలేజీల్లో భౌతికదూరం నిబంధనను అమలు చేయడం, ఆన్‌లైన్‌ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలపై కమిటీ ప్రధానంగా దృష్టిపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో తరగతి గదుల్లో ఒక్కో సెక్షన్‌లో ఉండే 40 – 60 మంది విద్యార్థులను పక్కనప్కనే కూర్చోబెట్టి బోధించడం సమస్య కానుంది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో కొంత మెరుగ్గా ఉన్నా ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ సమస్య తీవ్రంగా ఉండనుంది. రాష్ట్రంలోని దాదాపు 27వేల ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్‌ కాలేజీల్లో 28 లక్షల మంది విద్యార్థులుంటే 11వేల వరకు ఉన్న ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో 31.32 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో షిఫ్ట్‌ల వారీగా విద్యాసంస్థల నిర్వహణ, ఆన్‌లైన్‌ విద్యా బోధన వంటి అంశాలపైనా కమిటీ కసరత్తు చేస్తోంది. అలాగే హాస్టళ్లలోనూ భౌతికదూరం పెంపునకు చర్యలు చేపడుతోంది. భవిష్యత్తులో 25 శాతం బోధన ఆన్‌లైన్, ఈ–లర్నింగ్‌ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఉండాలని ఇటీవల యూజీసీ నిఫుణుల కమిటీ చెప్పిన నేపథ్యంలో ఈ కమిటీ కూడా ఆన్‌లైన్‌ విద్యాబోధనపైనే కీలక సిఫార్సులు చేసే అవకాశం ఉంది. తద్వారా ఎక్కువ మంది పిల్లలు ఒకేచోట గుమికూడకుండా చూడొచ్చని భావిస్తోంది. భౌతికదూరం పాటించేందుకు ఏం చేయాలి?, విద్యా సంవత్సరంలో ఆలస్యమైన కాలాన్ని ఎలా సర్దుబాటు చేయాలనే అంశాలను అందులో పేర్కొననుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top