అన్‌లాక్‌లో అజాగ్రత్త.. కరోనాతో చెలగాటమే!

Careful Unlock, Fast Vaccine Drive Can Prevent Third Wave - Sakshi

ఉధృతి తగ్గిందే కానీ ప్రమాదం పొంచే ఉంది 

థర్డ్‌ వేవ్‌ రాకపోక పూర్తిగా మన చేతుల్లోనే  

వీలైనంత త్వరగా టీకా వేయించుకోవాలి 

సీజనల్‌ వ్యాధులు, కరోనాతో నిత్య పోరాటమే 

ఆరు నెలలపాటు జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్య నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఎత్తేశారు... కరోనాతో ఎలాంటి ప్రమాదం లేదని అనుకోవడం ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు. అన్‌లాక్‌లో అజాగ్రత్త వహిస్తే కరోనాతో చెలగాటం ఆడినట్లేనని హెచ్చరిస్తున్నారు. అనేకమందిలో ఇక సాధారణంగా బయట స్వేచ్ఛగా తిరగవచ్చన్న దురభిప్రాయం ఉంది. అప్పుడే జనం పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. బంధువులు, ఇతరుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కొద్దిమందితో జరుపుకున్న శుభకార్యాలను, ఎక్కువ మందితో చేసుకునేందుకు సై అంటున్నారు. అవసరమున్నా లేకున్నా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. మధ్య, దిగువ ఆదాయ ప్రజలు ఎక్కువగా నివసించే దేశం మనది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం బతుకుదెరువు, ఆర్థిక అంశాలను ఆధారం చేసుకొని లాక్‌డౌన్‌ ఎత్తివేసిందనేది అందరికీ తెలిసిందే. అంతేతప్ప కరోనా ప్రమాదం పోయిందన్న భ్రమలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా థర్డ్‌వేవ్‌కు స్వాగతం పలికినట్లేనని గట్టి హెచ్చరికలు ఇప్పటికే వచ్చాయి. 

ప్రమాదం పొంచే ఉంది... 
రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిందేకానీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలూ సంభవిస్తున్నాయి. మే 1న 7,430 కేసులు నమోదు కాగా, 53 మంది చనిపోయారు. హోం ఐసోలేషన్‌లో, ఆసుపత్రుల్లో 80,695 మంది ఉన్నారు. నెలన్నర తర్వాత అంటే జూన్‌ 20న 1,006 కేసులు నమోదు కాగా, 11 మంది చనిపోయారు. 17,765 మంది హోం ఐసోలేషన్‌లో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆనాటి ఉధృతి ఇప్పుడు లేదన్నది వాస్తవమే. లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తి తగ్గింది. అంతేగానీ కరోనా ప్రమాదం తొలగిపోలేదని ఈ లెక్కలే చెబుతున్నాయి.  

మన చేతుల్లోనే థర్డ్‌వేవ్‌... 
అందరికీ వ్యాక్సిన్‌ వేసేంతవరకు కరోనా ప్రమాదం ముప్పు పొంచే ఉంటుంది. అయితే మనం ఎంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న దానిపైనే దాని తీవ్రత ఆధారపడి ఉంటుందనేది ఇప్పటివరకు కరోనా చరిత్ర చెబుతున్న పాఠం. మొదటి వేవ్‌ కంటే సెకండ్‌ వేవ్‌లో కరోనా తీవ్రత, వ్యాప్తి పెరిగింది. అనేక మ్యుటేషన్లు వచ్చాయి. ఏది ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించలేని పరిస్థితి. థర్డ్‌వేవ్‌ అంటూ దానికో సీజన్‌ అంటూ ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా, జనం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే థర్డ్‌ వేవే కాదు, ఫోర్త్, ఫిప్త్‌... వేవ్‌లు వస్తూనే ఉంటాయని అంటు న్నారు. అదీగాక ఇప్పుడు వానాకాలంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు పొంచి ఉంటాయి. దానికితోడు కరోనా జతకలిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అంటున్నారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటివి కూడా జ్వరంతోనే వస్తాయి. కరోనా లక్షణాల్లోనూ జ్వరం ఉంటుంది. కాబట్టి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్‌ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. మందులు వాడాలి.  

పది రెట్లు జాగ్రత్తగా ఉండాలి
లాక్‌డౌన్‌లో అందరం ఇళ్లకు పరిమితమయ్యాం. కాబట్టి బయటకు వెళ్లకుండా వైరస్‌ బారినపడకుండా చూసుకోగలిగాం. కానీ ఇప్పుడు అన్‌లాక్‌తో మళ్లీ సాధారణ జనజీవనం ఉంటుంది. కాబట్టి లాక్‌డౌన్‌లో కంటే ఇప్పుడే పది రెట్లు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. మనం బయటకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరినీ అనుమానించాల్సి ఉంటుంది. ఎవరికి వైరస్‌ ఉందో ఎవరికి లేదో మనం గుర్తించలేం. అలాగే టీకా వేయించుకున్నా కూడా నిర్లక్ష్యంగా లేకుండా కరోనా ప్రొటోకాల్స్‌ పాటించాలి. లేకుంటే థర్డ్‌ వేవ్‌ ముప్పు తప్పదు. ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే.      – డాక్టర్‌ ఎ.ఎం.భరత్‌రెడ్డి (సినీ నటుడు), కార్డియాలజిస్ట్, అపోలోఆసుపత్రి 

కరోనా నుంచి ఇంకా బయటపడలేదు
కోవిడ్‌ సమస్య నుంచి మనం పూర్తిగా బయట పడలేదు. అహ్మదాబాద్‌ సీరో సర్వే ప్రకారం 70 శాతం మందికి యాంటీబాడీస్‌ ఉన్నప్పటికీ వీరంతా ఏకకాలంలో ప్రభావితమైనవారు కాదు. ఫిబ్రవరి నాటికి 28 శాతం ఉంటే, రెండో దశలో 42 శాతం మంది ప్రభావితమయ్యారు. వ్యాక్సినేషన్‌తోనే ఏకకాలంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యం. కానీ మన దేశం వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయిలో వేయాలంటే ఆరు నెలలు పడుతుంది. కాబట్టి అప్పటివరకు జాగ్రత్తలు తీసుకోవాలి.  


– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ మెడికల్‌ కాలేజీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top