‘రంజాన్‌ స్పెషల్‌ హలీం’ కథ ఇదీ..

Hyderabad Haleem History In Telugu - Sakshi

1956లో ప్రారంభమైన హలీం ప్రస్థానం  

పోస్టు కార్డులతో ప్రచారం  

తర్వాత జోరందుకున్న విక్రయాలు  

ప్రస్తుతం విదేశాలకు సైతం ఎగుమతి  

రంజాన్‌ అంటే హలీం... హలీం అంటే రంజాన్‌ అనే స్థాయిలో ప్రాచుర్యం పొందిందీ వంటకం. ఇంతకీ వంటకం ఎక్కడిది? ఎవరు పరిచయం చేశారు? నగరానికి ఎలా వచ్చింది? దీని ప్రస్థానం ఎలా మొదలైంది? ఇంతటి ప్రాచుర్యం ఎలా పొందింది? తదితర అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేకం.

సాక్షి, సిటీబ్యూరో : హలీం వంటకం పురుడు పోసుకుంది హైదరాబాద్‌లోనే. ఈ రుచికరమైన వంటకాన్ని మనమే ప్రపంచానికి పరిచయం చేశాం. ఇరాన్‌కు చెందిన హుస్సేన్‌ జాబిత్‌ 1947లో మదీనా సర్కిల్‌లో ఓ హోటల్‌ నెలకొల్పాడు. విభిన్న రకాల ఇరాన్‌ వంటకాలను నగరవాసులకు రుచి చూపించాడు. అయితే 1956లో రంజాన్‌ మాసం ప్రారంభమైన తొలిరోజు ‘హలీం’ పేరుతో ఓ కొత్త వంటకాన్ని తయారు చేసి, 25పైసలకు కఠోరా (పాత్ర)లో ఇవ్వడం ప్రారంభించాడు. అలా హలీం ప్రస్థానం ప్రారంభమైంది.  
  
తొలుత లభించని ఆదరణ...  
తొలుత హలీంకు పెద్దగా ఆదరణ లభించలేదు. తొలి ఏడాది ఎక్కువగా విక్రయమవ్వలేదు. దీంతో బిర్యానీ తింటే హలీం ఫ్రీ అని ప్రకటించారు. ఇక రెండో ఏడాది వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హలీం విశిష్టతను తెలియజేస్తూ పోస్టు కార్డులతో ప్రచారం నిర్వహించారు. టెలిఫోన్‌ డైరెక్టరీలోని అడ్రస్‌లకు పోస్టు కార్డులు రాశారు. దీంతో కొంతమేర విక్రయాలు పెరిగాయి. 1956–1960 వరకు పోస్టు కార్డులు, పత్రిక ప్రకటనలు, పోస్టర్లు తదితర మార్గాల్లో హుస్సేన్‌ ప్రచారం నిర్వహించారు.

మొత్తానికి ఆయన ప్రయత్నం ఫలించింది. 1961 నుంచి హలీంకు డిమాండ్‌ పెరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున మదీనాకు రావడం మొదలైంది. ఎక్కువ జనం రావడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేవారు. ఇలా 1998 వరకు మదీనా హోటల్‌లో హలీం విక్రయాలు జరిగాయి. అదే ఏడాది హోటల్‌ నిర్వాహకుడు హుస్సేన్‌ మరణించారు.  
 
విశ్వవ్యాప్తం...  
తర్వాతి కాలంలో హలీం మరింత ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా 2005 నుంచి నగరంలో విక్రయాలు బాగా పెరిగాయి. మదీనా హోటల్‌ మూతపడిన తర్వాత పిస్తాహౌస్, షాగౌస్, సర్వీ, షాదాబ్‌ తదితర ఈ రంగంలోకి వచ్చాయి. పిస్తాహౌస్‌ హలీంకు డిమాండ్‌ విపరీతమైంది. ప్రస్తుతం వీరు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు.  

అదే ప్రత్యేకత..   
ఇరానీ పద్ధతిలోనే మా హోటల్‌లో హలీం తయారు చేస్తాం. ఇరానీ హలీం ప్రత్యేకత ఏమిటంటే ఘాటుగా ఉండదు. ఇందుకు గోధుమలు, మాంసం, నెయ్యి సమానంగా తీసుకోవాలి. ఈ మూడు హలీం తయారీకి కీలకం. మసాల దిను సులు వంటకానికి అనుగుణంగా వాడుకోవాలి.  
– మీర్జా అలీ, సర్వీ హోటల్‌ నిర్వాహకుడు

ఇరానీ పద్ధతిలో..  
ఇరానీ సంప్రదాయాలు మనతో మమేకమయ్యాయి. ఇరానీ రుచులు తొలి నుంచి నగరానికి పరిచయమే. ప్రస్తుతం నగరంలోని ఎన్నో హోటళ్లలో హలీం తయారు చేస్తున్నారు. అయితే ఇరానీ హోటళ్లలో మాత్రమే ఇరానీ పద్ధతిలో హలీం తయారు చేస్తున్నారు. మేము నేటికీ ఇరానీ పద్ధతిలోనే హలీం తయారు చేస్తున్నాం.      
– మహ్మద్‌ సల్మాన్‌ మన్‌సూరీ, బావర్చి హోటల్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌

40 ఏళ్లుగా...  
మా నాన్న మదీనా సర్కిల్‌లో 40 ఏళ్లుగా హలీం విక్రయిస్తున్నారు. నగర ప్రజలకు ఆహార అలవాట్లకు అనుగుణంగా తయారు చేయడం మా ప్రత్యేకత. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. స్వచ్ఛమైన మసాలా దినుసులు వినియోగిస్తున్నాం. 
– ఉమర్‌ అదిల్, షాబాద్‌ హోటల్‌ నిర్వాహకుడు     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top