అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతోపాటు కిరోసిన్ పోసి తగులబెట్టిన కేసులో అసిఫ్ ఖాన్‌కు నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
సాక్షి, హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతోపాటు కిరోసిన్ పోసి తగులబెట్టిన కేసులో అసిఫ్ ఖాన్‌కు నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.1500 జరిమానా చెల్లించాలని ఐదవ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (మహిళాకోర్టు) జి.వెంకట క్రిష్ణంరాజు బుధవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీ టి.పద్మలతారెడ్డి వాదనలు వినిపించారు. గోల్కొండ ప్రాంతంలో నివసించే ఎలక్ట్రిషియన్ అసిఫ్ ఖాన్‌కు అదే ప్రాంతానికి చెందిన రూహిబేగంతో 2005లో వివాహం జరిగింది.
వివాహం జరిగినప్పటి నుంచి అసిఫ్‌ఖాన్ అదనపు కట్నం కోసం రూహిబేగంను వేధించేవాడు. ఈక్రమంలో 2009 జనవరి 19న భార్యతో ఘర్షణపడిన అసిఫ్...కిరోసిన్‌పోసి తగులబెట్టాడు. తీవ్రంగా గాయపడిన రూహి చికిత్స పొందుతున్న సమయంలో భర్త ఆకృత్యాలని వివరించింది. అనంతరం చికిత్స పొందుతూ మృతిచెందింది. రూహి మరణవాంగ్మూలంతోపాటు ఇతర ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి...అసిఫ్కు జీవితఖైదు విధించారు.