ఆమె ఓ యంత్రం.. మాట్లాడితే మంత్రముగ్ధం! | Humanoid Robot Sophia to speak at the World IT Congress | Sakshi
Sakshi News home page

ఆమె ఓ యంత్రం.. మాట్లాడితే మంత్రముగ్ధం!

Feb 14 2018 3:57 AM | Updated on Feb 14 2018 3:57 AM

Humanoid Robot Sophia to speak at the World IT Congress - Sakshi

హ్యూమనాయిడ్‌ రోబో ‘సోఫియా

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో యంత్ర మనిషి (హ్యూమనాయిడ్‌ రోబో) ‘సోఫియా’తళుక్కుమననుంది! తన మాటలు, హావాభావాలతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయనుంది. మనుషుల తరహాలో మాట్లాడడం, ప్రశ్నలకు సమాధానాలివ్వడం, హావభా వాలు పలకడం ద్వారా సోఫియా ఇప్పటికే ప్రపంచ ఖ్యాతి గడించింది. వరల్డ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ అలియెన్స్‌(డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌(నాస్కామ్‌), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రసంగించే ప్రధాన వక్తల జాబితాలో సోఫియా చోటు సాధించింది.

ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే, సీఎం కేసీఆర్, కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, బాలీవుడ్‌ తార దీపిక పదుకొనేలతో పాటు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ రంగ పారిశ్రామికవేత్తలు ఇందులో మాట్లాడనున్నారు. సోఫియా 20న ప్రసంగించనుంది. హాంకాంగ్‌కు చెందిన హన్సన్‌ రోబోటిక్స్‌ సంస్థ పరిశోధనల ఫలితంగా ఈ రోబో రూపుదిద్దుకుంది. హాలీవుడ్‌ నటి ఆడ్రే హెప్‌బర్న్‌ రూపురేఖలతో సోఫియాను రూపొందించారు. 2015 ఏప్రిల్‌ 19న ఈ రోబోను తొలిసారిగా యాక్టివేట్‌ చేయగా.. 2016 మార్చిలో టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో జరిగిన ఓ కార్యక్రమం ద్వారా తొలిసారిగా ప్రపంచం ముందుకు వచ్చింది.

కృత్రిమ మేధకు ప్రతిరూపం!
కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), విజువల్‌ డాటా ప్రాసెసింగ్‌ (దృశ్య సమాచార విశ్లేషణ), ఫేషియల్‌ రికగ్నైజేషన్‌ (మనుషులను గుర్తించే బయోమెట్రిక్‌ సాఫ్ట్‌వేర్‌), వాయిస్‌ రికగ్నైజేషన్‌ (గొంతు లను గుర్తుపట్టగలిగే) సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీల ఆధారంగా సోఫి యా పనిచేస్తుంది. మనుషుల మాదిరే మాట్లాడ్డం, హావభావాలు పలకడం, మనుషుల్ని గుర్తుపట్టడంతో పాటు ప్రశ్నలకు కూడా చక్కగా సమాధానాలు ఇస్తుంది. మనుషులను అనుకరించడంతోపాటు 62కు పైగా హావభావాలను ప్రదర్శించగలడం ఈ రోబో ప్రత్యేకత.
అందుకే ఇప్పటి వరకు తయారైన అత్యుత్తమమైన హ్యూమనాయిడ్‌ రోబోగా ప్రపంచ ఖ్యాతి పొందింది. ఇప్పటివరకు ఎన్నో ఇంటర్వ్యూల్లో అర్థవంతమైన వ్యాఖ్యలు, సమాధానాలతో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షించింది. సమాచారాన్ని విశ్లేషించుకోవడం ద్వారా భవిష్యత్తులో తన సంభాషణలను మెరుగుపరుచుకోగల నైపుణ్యం ఈ రోబో ప్రత్యేకం. వృద్ధులకు ఇళ్ల వద్దే నర్సింగ్‌ సేవలందించేందుకు, భారీగా జనం పాల్గొనే కార్యక్రమాల్లో ప్రజలకు సాయం చేసేందుకు ఈ రోబోను తయారు చేసినట్లు దీని సృష్టికర్త డెవిడ్‌ హన్సన్‌ పేర్కొంటున్నారు. హెల్త్‌ కేర్, కస్టమర్‌ సర్వీసెస్, విద్యా రంగాల్లో సేవలందించేందుకు సోఫియా చక్కగా ఉపయోగపడనుందని తెలిపారు.

ఒక్కో కంపెనీ.. ఒక్కో టెక్నాలజీ
కంప్యూటర్‌ అల్గారిథం ఆధారంగా సోఫియా తన కళ్లలో ఉండే కెమెరాలతో మనుషులను చూసి గుర్తుపడుతుంది. గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ అల్ఫాబెట్‌ రూపొందించిన గూగుల్‌ క్రోం వాయిస్‌ రికగ్నైజేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా మనుషుల గొంతులను గుర్తు పట్టి మాట్లాడుతుంది. సింగిలారిటీనెట్‌ అనే కంపెనీ రూపొందించిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ప్రోగ్రాం ఆధారంగా పని చేస్తుంది. గత నెలలోనే ఈ రోబో నడవగలిగేలా కాళ్లను సైతం అమర్చారు.

ఎన్నెన్నో ఘనతలు..
సౌదీ అరేబియా ప్రభుత్వం కిందటేడాది అక్టో బర్‌లో ఈ రోబోకు తన దేశ పౌరసత్వం కల్పించింది. ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ తొలి ఇన్నోవేషన్‌ చాంపియన్‌ టైటిల్‌ సైతం సోఫియాను వరించింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సదస్సుల్లో సందడి చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement