మనం అలా..గెలుస్తున్నం!

How We Win? - Sakshi

అభ్యర్థులు, అనుచరుల లెక్కలు

జిల్లాలో ఉత్కంఠగా సాగిన పోరు

అంతుపట్టని ఓటరు అంతరంగం

స్ట్రాంగ్‌రూంలో ఈవీఎంలు భద్రం  

సాక్షి, పెద్దపల్లి : ‘ఆ మండలంలో మనకు లీడ్‌ వస్తది...ఈ మండలంలో కొంత పోతది...ఫలానా డివిజన్‌ మనకే మొగ్గుంది...ఈ డివిజన్‌లో ప్రత్యర్థికే ఎక్కువ ఓట్లంటున్నరు...మొత్తానికి తక్కువోట్లతోనైనా మనమే బయటపడుతాం’ అంటూ అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను ఓట్ల లెక్కింపు కేంద్రమైన సెంటినరీకాలనీలోని జేఎన్‌టీయూకు తరలించారు.

ఎవరి లెక్కలు వారివే... 
పోలింగ్‌ ముగియడంతో అభ్యర్థులు, అనుచరులు గెలుపోటములపై లెక్కలేస్తున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ  
ఉత్కంఠగా ఉంది. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం మూడు నియోజకవర్గాల్లోనూ పోటాపోటీగా ఎన్నికలు సాగాయి. ఫలితాలపై ఊహించడం మినహా, గత ఎన్నికల తరహాలో అంచనాలు వేయడం సాధ్యపడడం లేదు. ఒక్క నియోజకవర్గంలోనే ఒక్కో పార్టీకి ఒక్కో ప్రాంతం అనుకూలంగా కనిపిస్తుండడంతో ఫలితం పక్కాగా చెప్పే పరిస్థితి కనిపించలేదు. పెద్దపల్లిలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులు దాసరి మనోహర్‌రెడ్డి, చింతకుంట విజయరమణారావుల నడుమ పోటీ హోరాహోరీగా సాగింది. నియోజకవర్గంలోనే అధిక ఓట్లున్న పెద్దపల్లి పట్టణం, మండలం అభ్యర్థి భవితవ్యాన్ని తేల్చనున్నాయి.

ఇక మంథనిలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పుట్ట మధులు నువ్వా నేనా అన్నట్లుగానే పోటీపడుతున్నారు. తూర్పు మండలాలు ఒక పార్టీకి అనుకూలంగా, ఇతర మండలాలు మరో పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఎవరైనా స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారని ఆయా పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. రామగుండంలో ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి కోరుకంటి చందర్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ల నడుమ పోరు ఉత్కంఠగా కొనసాగింది. ఇక్కడ యైటింక్‌లైయిన్‌కాలనీ ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
 
ఓటేసిన ప్రముఖులు 
పోలింగ్‌ సందర్భంగా అభ్యర్థులు, అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అల్లమరాజు శ్రీదేవసేన గోదావరిఖనిలో, జాయింట్‌ కలెక్టర్‌ వనజాదేవి పెద్దపల్లిలో ఓటు వేశారు. పెద్దపల్లి పట్టణంలోని మిషన్‌ హైస్కూల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎలిగేడు మండలం శివపల్లిలో కాంగ్రెస్‌ అభ్యర్థి చింతకుంట విజయరమణారావులు ఓటు వేశారు.  ధర్మపురి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ గోదావరిఖని, రామగుండం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ గౌతమినగర్, ఫార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌ తిలక్‌నగర్, కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్‌ రామగుండంలో, బీజేపీ అభ్యర్థి బల్మూరి వనీత గోదావరిఖనిలో ఓటువేశారు.

మంథనిలో కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాటారం మండలం ధన్వాడలో, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుట్ట మధు మంథనిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను రామగిరి మండలం సెంటినరీకాలనీలోని జేఎన్‌టీయూ భవనంలోకి తరలించి, భద్రపరిచారు. స్ట్రాంగ్‌రూం వద్ద గట్టిపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 11న జేఎన్‌టీయూ భవనంలోనే ఓట్ల లెక్కింపు జరగనుంది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top