ఫిబ్రవరిలో ఎన్నికలెట్లా? | How Conduct Panchayat polls in Next Moth | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ఎన్నికలెట్లా?

Jan 18 2018 3:15 AM | Updated on Aug 15 2018 9:45 PM

How Conduct Panchayat polls in Next Moth - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే నెలలోనే గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నా.. అది సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ఖరారు నుంచి.. నోటి ఫికేషన్‌ గడువు దాకా అన్నీ కూడా ఇందుకు వీలు కల్పించవని స్పష్టం చేస్తున్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రకటించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల నిర్వహణ జరిగే అవకాశమే లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ నుంచి ప్రక్రియ ముగిసే వరకు తప్పనిసరిగా 45 రోజుల వ్యవధి ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేస్తే తప్ప ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం లేదు. 

ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ఖరారు ఏవీ?
నోటిఫికేషన్‌ జారీ చేయాలంటే ముందు ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉండాలి. ఇప్పటికీ ఓటర్ల జాబితాలు సిద్ధంగా లేవు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల సవరణ ప్రక్రియ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. తుది ఓటర్ల జాబితాలు ఎన్నికల సంఘానికి చేరితే తప్ప నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం లేదు. ఎన్నికలకు ముందు గ్రామాల్లో సర్పంచులు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత చట్టం ప్రకారం ఐదేళ్లకోసారి రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లను మార్చాలి.  

కొత్త పంచాయతీలతో..: కొత్తగా గ్రామ పంచాయతీల ఏర్పాటు, కొత్త పంచాయతీరాజ్‌ చట్టం చేసే సన్నాహాల్లో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి తొలివారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బిల్లు పెడతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అనుకున్నట్లుగానే కొత్త చట్టం అమల్లోకి వస్తే రాష్ట్రంలో కొత్తగా నాలు గు వేల గ్రామ పంచాయతీలు ఏర్పడతాయి. వాటికి నోటిఫికేషన్‌ జారీ చేసి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదంతా జరగాలంటే ఫిబ్రవరిలో సగం గడిచిపోతుంది. 

ఎన్నికల ఏర్పాట్లు కూడా కష్టమే 
దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు అంటే పెద్ద తతంగమే ఉంటుంది. సరిపడా బ్యాలెట్‌ బాక్సులు సైతం అందుబాటులో లేవని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.  అవసరమైన ఎన్నికల సన్నాహాలు పూర్తి కావాలంటే కనీసం రెండు నెలల సమయం పడుతుందని చెబుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement