ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో హోంశాఖ దిగొచ్చింది.
అధికారులపై కేసు నమోదు చేస్తామని హైకోర్టుకు నివేదన
సాక్షి, హైదరాబాద్: ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు సంబంధించిన కేసులో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో హోంశాఖ దిగొచ్చింది. తన ఆత్మహత్యకు పలువురు అధికారులే కారణమంటూ ఎస్‌ఐ సూసైడ్ నోట్ లో ప్రస్తావించిన వారిపై కేసు నమోదు చేస్తామని హోం శాఖ గురువారం హైకోర్టుకు నివేదించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఆ అధికారుల పేర్లనూ చేరుస్తామని పేర్కొంది. ఆత్మహత్యకు ప్రేరేపించడం (ఐపీసీ సెక్షన్ 306) కింద కేసులు పెడతామని చెప్పింది. ఈ విషయంలో సంబంధిత కోర్టును ఆశ్రయించి అనుమతులు పొందుతామని వివరించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది.
ఆ రోజున ఈ కేసులో సాగిన దర్యాప్తునకు సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఉత్తర్వులు జారీ చేశారు. తన భర్త ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ రామకృష్ణారెడ్డి భార్య ధనలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం జస్టిస్ రామచంద్రరావు విచారణ జరిపారు. సూసైడ్‌నోట్‌లో రామకృష్ణారెడ్డి పేర్కొన్న అధికారులపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని హోం శాఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పిటిషన్ గురువారం విచారణకు రాగా హోంశాఖ తరపు న్యాయవాది వేణుగోపాల్ ఓ మెమోను న్యాయమూర్తి ముందుంచారు.