స్వరాష్ట్ర కాంక్ష.. అభివృద్ధే ఆకాంక్ష

History Of Telangana Rashtra Samithi Party - Sakshi

పోరుబాట నుంచి రెండు సార్లు అధికారం వరకు గులాబీ ప్రస్థానం  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసేందుకు పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వసంతంలోకి అడుగు పెడుతోంది. నిధులు, నీళ్లు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఉద్యమ పార్టీ తన 14వ ఏట లక్ష్యాన్ని సాధించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉద్యమ పార్టీకే ప్రజలు అధికారం అప్పగించడంతో టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అభివృద్ధి మంత్రంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్ర సాధన అనంతరం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులతోపాటు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచే స్థాయికి చేరుకున్నాయి. అటు ఉద్యమ సంస్థగా, ఇటు అధికార పార్టీగా రెండు దశాబ్దాలుగా టీఆర్‌ఎస్‌ సాగిస్తున్న ప్రస్థానంపై ‘సాక్షి’కథనం.

జలదృశ్యంలో పురుడు పోసుకున్న టీఆర్‌ఎస్‌ 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నాటి సిద్దిపేట ఎమ్మెల్యే కేసీఆర్‌ 2001 ఏప్రిల్‌ 27న టీడీపీతోపాటు తన పదవులకు రాజీనామా చేస్తూ టీఆర్‌ఎస్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అదే ఏడాది జూలైలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి సానుకూల ఫలితాలు సాధించిన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ సెప్టెంబర్‌ 2001లో జరిగిన సిద్దిపేట ఉప ఎన్నికలో భారీ విజయం సాధించడం తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చింది.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు 
ఏపీ అసెంబ్లీకి 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న టీఆర్‌ఎస్‌ 26 అసెంబ్లీ, ఐదు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయగా, పార్టీ అధినేత కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్రంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినా, ప్రణబ్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తేల్చక పోవడంతో రాష్ట్రంలో ఆరుగురు టీఆర్‌ఎస్‌ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలిగారు. వరంగల్, పోలవరంలో భారీ బహిరంగ సభలు నిర్వహించి శరద్‌పవార్, శిబు సోరెన్‌ వంటి నేతలను ఆహ్వానించి జాతీయ స్థాయిలో తెలంగాణను చర్చనీయాంశంగా మార్చారు.

కరీంనగర్‌ ఎంపీగా కేసీఆర్‌ రాజీనామా 
తెలంగాణ ఏర్పాటు అంశంలో కేంద్రం నాన్చివేత ధోరణికి నిరసనగా కేసీఆర్‌ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2006 డిసెంబర్‌ లో జరిగిన కరీంనగర్‌ లోక్‌సభ ఉపఎన్నికల్లో 2.01లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా ఉండేలా వ్యూహాన్ని అనుసరించారు.

2009 అసెంబ్లీ ఎన్నికల్లో నిరాశే 
2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమితో టీఆర్‌ఎస్‌ పొత్తుకుదుర్చుకుని నిరాశజనకమైన ఫలితాలను సాధించింది. కేవలం పది మంది ఎమ్మెల్యేలతో పాటు మహబూబ్‌నగర్‌ నుంచి కేసీఆర్, మెదక్‌ నుంచి విజయశాంతి టీఆర్‌ఎస్‌ పక్షాన ఎంపీలుగా ఎన్నికయ్యారు. 2009లో దివంగత సీఎం వైఎస్‌ మరణం తర్వాత రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభాన్ని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఉద్యమ ఎత్తుగడగా మలిచారు. 2009 అక్టోబర్‌ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన ద్వారా తిరిగి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లడంలో టీఆర్‌ఎస్‌ కీలకంగా పనిచేసింది.


నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తున్న జయశంకర్, విద్యాసాగర్‌ తదితరులు

తెలంగాణ బిల్లుకు ఆమోదం 
ఉద్యమ ఫలితంగా 2013 అక్టోబర్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపగా, 2014 డిసెంబర్‌ 18న లోక్‌సభ, 20న రాజ్యసభ ఆమోదించింది. మరోవైపు 2014 ఏప్రిల్‌లో సాధారణ ఎన్నికలు జరగ్గా, 2014 మే 16న ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 63, 11 లోక్‌సభ స్థానాలను గెలుపొందింది. దీంతో తెలంగాణలో జూన్‌ 2 రాష్ట్ర ఆవిర్భావంతో పాటుగా, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. టీఆర్‌ఎస్‌ ఇకపై ఫక్తు రాజకీయ పార్టీగా పనిచేస్తుందని కేసీఆర్‌ ప్రకటించారు. 2018 డిసెంబర్‌ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 88 స్థానాల్లో గెలుపొంది రెండోసారి అధికారంలోకి రాగా సీఎంగా కేసీఆర్‌ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. 

కాంగ్రెస్‌ శాసనసభా పక్షం విలీనం 
ఉద్యమ కాలంలో 2010 తర్వాత ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికలను ప్రోత్సహిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌ 2014లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన వలసలకు పెద్దపీట వేసింది. 2014లో టీడీపీ తరపున గెలిచిన 15 మంది శాసనసభ్యుల్లో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరడంతో శాసనసభా పక్షం విలీనమైంది. దీంతో టీడీపీ తెలంగాణలో తన ఉనికిని కోల్పోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా టీఆర్‌ఎస్‌     ఇదే వ్యూహాన్ని అనుసరించడంతో కాంగ్రెస్‌కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు.


2001 ఏప్రిల్‌ 27న టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌ (ఫైల్‌)

ఆమరణ దీక్షతో కొత్త మలుపు 
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ టీఆర్‌ఎస్‌ అధినేత ఆమరణ దీక్షకు దిగడం ఉద్యమాన్ని కొత్త మలుపు తిప్పింది. 2009 నవంబర్‌ 29న సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేసేందుకు కరీంనగర్‌ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ను పోలీసులు మార్గమద్యంలో అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో కేంద్రం తెలంగాణ ఏర్పాటు దిశగా ప్రకటన చేసినా, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో కోదండరాం చైర్మన్‌గా జేఏసీని ఏర్పాటు చేయడంలో టీఆర్‌ఎస్‌ పెద్దన్న పాత్ర పోషించింది. 2010 డిసెంబర్‌ 16న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నిర్వ హించిన మహా గర్జనకు 20 లక్షల మంది హాజరు కావడం మైలురాయిగా నిలిచిపోయింది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత 2011 జనవరి నుంచి టీఆర్‌ఎస్‌ గల్లీ నుంచి ఢిల్లీ దాకా టీఆర్‌ఎస్‌ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top