ప్రాణం తీసిన అతివేగం | Highway accident | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అతివేగం

Jun 26 2016 3:37 AM | Updated on Aug 28 2018 4:00 PM

ప్రాణం తీసిన అతివేగం - Sakshi

ప్రాణం తీసిన అతివేగం

శుభాకార్యానికి వెళ్తున్నామన్న సంతోషం వారిలో ఎంతసేపు నిలవలేదు. బంధువులతో రెండు రోజులు గడిపొద్దామనుకున్న వారి సంబరం.....

నలుగురి దుర్మరణం
కల్వర్టును ఢీకొట్టిన కారు
కొమిరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై దుర్ఘటన
మృతుల్లో భార్యాభర్తలు, ఏడేళ్ల చిన్నారి, డ్రైవర్
మృతులు నెల్లూరు జిల్లావాసులుగా గుర్తింపు
స్వగ్రామంలో జరిగే శుభకార్యానికి వెళ్తుండగా ఘటన

 
శుభాకార్యానికి వెళ్తున్నామన్న సంతోషం వారిలో ఎంతసేపు నిలవలేదు. బంధువులతో రెండు రోజులు గడిపొద్దామనుకున్న వారి సంబరం తీరలేదు. త్వరగా వెళ్దామనుకున్న వారిని మృతువు కబళించేసింది. కారులో అతివేగంగా వెళ్తూ కల్వర్టును ఢీకొట్టడంతో వారంతా అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. తల్లిదండ్రులతోపాటు ఓ చిన్నారి, వారి సమీప బంధువు అయిన డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.
 
స్వగ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తున్న ఓ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. భార్యాభర్తలతో పాటు ఏడేళ్ల పాప, వారి సమీప బంధువైన డ్రైవర్‌ను అతివేగం మృత్యువడిలోకి చేర్చింది. తొందరగా గమ్యం చేరాలన్న తపన ఆ నలుగురిని కబళించింది. వారు ప్రయాణిస్తున్న ఇండికా కారు రోడ్డు కల్వర్టును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘోర దుర్ఘటన అడ్డాకుల మండలం కొమిరెడ్డిపల్లి సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.  - అడ్డాకుల
 
 
స్వగ్రామంలో శుభకార్యం ఉందని..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడుకి చెందిన కాంత చెన్నరాయుడు(35) కుటుంబంతో కలిసి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి యుసుఫ్‌గూడలోని ఎస్‌ఆర్ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ప్రైవేటు ఉద్యోగం చేసే చెన్నరాయుడు తన స్వగ్రామంలోని బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరుకావాలని భార్య భారతి(30), ఏడేళ్ల పాప యశస్వినితో కలిసి సమీప బంధువైన డ్రైవర్ బాలకుమార్(27) ఇండికా కారు (ఏపీ28టీవీ 2876)లో శనివారం బయల్దేరారు. అతివేగంగా వెళ్తున్న కారు మార్గమధ్యలో కొమిరెడ్డిపల్లి దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో హైవే పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జయి రోడ్డు కిందకు వెళ్లింది. సీటు బెల్టు పెట్టుకున్న డ్రైవర్ సీటులోనే ఇరుక్కుని ప్రాణాలు వదిలాడు. చెన్నరాయుడు, యశస్విని మృతదేహాలు కారులోంచి బయటపడ్డాయి.

భారతి కారులోనే ఇరుక్కుని దుర్మరణం పాలైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు టోల్‌ప్లాజాకు సమాచారం చేరవేయడంతో పోలీసులు, ఎల్‌అండ్‌టీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కారులో ఇరుక్కున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. నలుగురి మృతదేహాలను శిక్షణ ఎస్‌ఐ శివకుమార్ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ బి.కిషన్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 
 
 ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

 ఆ మార్గం గుండా వెళ్తున్న అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రమాద స్థలంలో ఆగి, అక్కడే ఉన్న మృతదేహాలను పరిశీలించి, మృతుల వివరాలను తెలుసుకున్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement