
సాక్షి, హైదరాబాద్: దేవుడి భూముల్ని లీజుకు ఎలా ఇస్తారని తెలంగాణ సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జి.శ్యాంప్రసాద్ లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. విక్టోరియా హోంకు చెందిన భూమి దేవాదాయ శాఖ పేరిట రిజిస్టర్ అయిందని, అందులో పది ఎకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు ఎలా లీజుకిస్తారని నిలదీసింది. ప్రభుత్వ భూమి మాదిరిగానే దేవుడి భూమిని కూడా తాము లీజుకు ఇవ్వొచ్చని ప్రభుత్వం చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.
రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని నిజాం కాలం నాటి విక్టోరియా హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు పది ఎకరాలు లీజుకు ఇవ్వడాన్ని అదే హోంకు చెందిన పూర్వపు విద్యార్థి ఎల్.బుచ్చిరెడ్డి సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ కేసు మంగళవారం మరోసారి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తదుపరి విచారణను 28కి వాయిదా వేసింది.