
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం విక్టోరియా మెమోరియల్ హోం రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన భూమిని లీజుకివ్వడానికి సంబంధించిన రికార్డులన్నింటినీ తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు మంగళవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిచ్చిన భూమి రూపు రేఖలను మార్చొద్దని, భూమిని చదును చేయడం గానీ, ఆ భూమిలో ఉన్న చెట్లను కొట్టేయడం గానీ చేయవద్దంటూ గతవారం ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విక్టోరియా మెమోరియల్‌కు చెందిన పదెకరాల భూమిని రాచకొండ పోలీస్ కమిషనరేట్ నిర్మాణం కోసం లీజుకిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ విక్టోరియా మెమోరియల్ హోం అనాథ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ఎల్.బుచ్చిరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే.