రాళ్ల గుట్టల్ని కూడా వదలరా?

High Court Comments on Govt - Sakshi

 ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్య  

సాక్షి, హైదరాబాద్‌: ‘చిమ్మ చీకట్లో తడుముకోవద్దు. కానీ మనం చీకట్లో తడుముకుంటున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. హైదరాబాద్‌ మహానగర స్వరూపాన్ని 1956 నుంచి అంచనా వేసిన నిపుణులు ఉన్నారు. అలాంటి వాళ్ల సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోండి. ప్రకృతిపరంగా ఏర్పడిన శిలాసంపదను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి’అని రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని బాబా ఫకృద్దీన్‌ ఔలియా దర్గా (ఫకృద్దీన్‌ గుట్ట)లో ప్రకృతిసిద్ధమైన శిలా సంపద, ఏక శిలా రూపాలను ధ్వంసం చేస్తున్నారనే ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఫకృద్దీన్‌ గుట్టను పేల్చి రాళ్లు కొడుతున్నారని, ఆ గుట్టను వారసత్వ సంపదగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ ‘సొసైటీ టు సేవ్‌ రాక్‌’సంస్థ కార్యదర్శి ఫరూక్‌ ఖాదర్‌ దాఖలు చేసిన పిల్‌ను బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ‘ఇప్పటికే చెరువుల్ని మాయం చేశామని, ఇక రాళ్లను కూడా వదిలిపెట్టమా’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కొండల్ని పేల్చి ఇళ్ల నిర్మాణాలు చేసుకుంటూపోతే ప్రకృతి వికృతరూపం దాల్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఏకశిల, శిలా సంపదలను కాపాడేందుకు తీసుకునే చర్యల్ని వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫకృద్దీన్‌ గుట్టపై పేలుళ్లను ఆపేశామని, కౌంటర్‌ దాఖలుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం కోరడంతో విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top