త్రిముఖ పోరు

Haevy  Triangular Election Competition In Kamareddy  - Sakshi

 ‘కామారెడ్డి’లో పోరు రసవత్తరం 

 జోరందుకున్న ప్రచారం 

 ఇంటింటా ప్రచారాల్లో అభ్యర్థులు 

ప్రచార పర్వంలో తలమునకలైన పార్టీలు

 సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్‌): జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. దాదాపుగా అన్ని పార్టీల అభ్యర్థులు ఖరారు కావడమే ఇందుకు కారణం. ఎలాగైనా విజయం సొంతం చేసుకోవాలనే సంకల్పంతో ప్రధాన పార్టీలు వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇంటింటికి ప్రచారాలు నిర్వహిస్తూ ఇప్పటికే ప్రచార హోరులో తలమునకలయ్యాయి. బరిలో ఉన్న అభ్యర్థులు తమ అనుచరణగంతో గ్రామాలను చుట్టేస్తున్నారు. మీ అమూల్యమైన ఓటును మా పార్టీకి వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీంతో ఇతర చోట్ల కన్నా కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎన్నికల సందడి మరింతగా కనిపిస్తోంది. ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ముందుకు సాగుతున్నారు. 
అభ్యర్థుల్లో స్పష్టత
జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌ నియోజవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు కాలేదు. కానీ కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌ బీజేపీ నుంచి మాజీ జెడ్పీ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి పేర్లను ఆయా పార్టీల అధిష్టానాలు ఇది వరకే ఖరారు చేశాయి. కాంగ్రెస్‌ నుంచి శాసన మండలి ప్రతిపక్షనేత షబ్బీర్‌అలీయే పోటీ చేస్తారనేది తెలిసిన విషయమే. జాబితా విడుదల కాకపోయినా టికెట్‌ మాత్రం షబ్బీర్‌అలీదే. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉంది. దీంతో ఆయా పార్టీలు ఎన్నికల బరిలో గెలుపు కోసం వ్యూహాలు ప్రారంభించాయి. 2004 తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి షబ్బీర్‌అలీకి విజయం అందని ద్రాక్షలా మారింది. కాంగ్రెస్‌ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన నేపథ్యంలో 2014లో గెలుపుపై ధీమాగా ఉన్న షబ్బీర్‌అలీకి నిరాశే ఎదురైంది.

ఆ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు తెలంగాణ సెంటిమెంట్‌కే ఓటు వేశారు. ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఆయన ముందుకు వెళ్తున్నారు. తాను చేసిన అభివృద్ధి, టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే కామారెడ్డి ఎమ్మెల్యేగా నాలుగుసార్లు విజయం సాధించి మంచి ఊపు మీద ఉన్న మాజీ ప్రభుత్వవిప్‌ గంపగోవర్ధన్‌ మరోసారి గెలిచి సత్తా చూపించాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మరోసారి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు. ఇది వరకు ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన బీజేపీ అభ్యర్థులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి సైతం నియోజకవర్గంలోని గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో ఈ ముగ్గురు అభ్యర్థులు దోమకొండ, బీబీపేట, కామారెడ్డి, రాజంపేట, భిక్కనూరు, మాచారెడ్డి మండలాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలిశారు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి డాక్టర్‌ పుట్టమల్లికార్జున్‌ సైతం ఓటర్ల వద్దకు వెళ్తూ ప్రచార కార్యక్రమాలను జోరుగా సాగిస్తున్నారు. 
చేరికల పర్వం 
నియోజకవర్గంలో చేరికల పర్వం జోరుగా సాగుతోంది. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి చేరుతున్న వారిపై ఆయా పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వేల సంఖ్యలో టీఆర్‌ఎస్‌లోకి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. మరోవైపు షబ్బీర్‌అలీ సమక్షంలో ఎంతో మంది కార్యకర్తలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారు. ఇంకోవైపు బీజేపీలోకి సైతం చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది నిత్యం ఆయా పార్టీల్లో చేరికల పర్వం ఊపందుకుంటోంది. కామారెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల సందడి ఇప్పటికే ఓ స్థాయికి చేరింది. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు పథకాలు రచిస్తున్నారు. ఈనేపథ్యంలో జరుగనున్న ఎన్నికల రణరంగంలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top