దిగ్గజ నాయకుల పుట్టిల్లు 

Great Political Leaders In Medak - Sakshi

రాజకీయాల్లో ఉద్దండులను అందించిన గడ్డ

సీఎం కేసీఆర్‌ ఓనమాలు నేర్చింది దుబ్బాకలోనే..

తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యమాల ఖిల్లాగా.. త్యాగాలకు ప్రతీకగా పేరుగాంచిన దుబ్బాకలో మొదటి మున్సిపల్‌లో ఎన్నికలు జరుగుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకత సంతరించుకొంది. మొదటి నుంచి ఉద్యమాలకు అడ్డాగా పేరుగాంచింది.  దుబ్బాక నుంచి ఐరేని లింగయ్య డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. సీఎం కేసీఆర్‌ విద్యాబుద్ధులు నేర్చింది ఇక్కడే... ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి చదివింది దుబ్బాకలోనే కావడం విశేషం. 

ఉద్యమాల ఖిల్లాగా... 
దుబ్బాక అంటనే ఉద్యమాల ఖిల్లా.. విప్లవోద్యామాలకు...తెలంగాణ ఉద్యమంలో దుబ్బాక దిక్సూచిగా ఉంది. భౌగోళికంగా మొదటి నుంచి ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు సరిహద్దులో ఉండటంతో దుబ్బాకగడ్డపై విప్లవోద్యమ ప్రభావం బాగ పడింది.దుబ్బాక ప్రభుత్వ జూనియర్‌ కళశాలలో చదివిన వారు ఎందరో ఉద్యమబాటపట్టారు. వ్యవసాయం, చేనేత, బీడీ పరిశ్రమలపై ప్రజలు ఆధారపడి జీవించడం తప్పా ఎలాంటి పరిశ్రమలు, ప్రాజెక్టులు లేవు.

చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి గాంచిన దుబ్బాకలో నమ్ముకున్న కులవృత్తి కూడుపెట్టక గత ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో 200 మందికి పైగా నేతన్నలు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవడం,తినడానికి పట్టెడు మెతుకులు దొరకక ఆకలి చావులకు గురైన సంఘటనలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనీయమయ్యాయి.

సీఎంకు ప్రత్యేక అనుబంధం.. 
సీఎం కేసీఆర్‌ విద్యాబుద్ధులు నేర్చింది దుబ్బాకలోనే. దుబ్బాక రామసముద్రం కట్టపైనే కూర్చొని ఉత్పలమాల. చంపకమాల పద్యాలు నేర్చిన, తాను ఇంతటి స్థాయిలో ఉండడానికి దుబ్బాకగడ్డనే అంటూ సీఎం కేసీఆర్‌ బహిరంగ సమావేశాలు, ప్రధాన సమావేశాల్లో ప్రస్తావించడం అందరికి విదితమే. తనకు విద్యాబుద్ధులు నేర్పిన దుబ్బాక పట్టణంలోని పాఠశాలను రూ. 10 కోట్లతో దేశంలోనే అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ చదివిన బడి నిర్మాణం దాదాపుగా పూర్తి కావొచ్చింది. కొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దుబ్బాకలో ఆమన స్నేహితులతో పాటు గురువులు వందల మందిని ఇప్పటికి పేరుపేరున గుర్తుపడుతారంటే దుబ్బాకతో ఆయనకున్న అనుబంధం ఎంతుందో తెలిసిపోతుంది.

ప్రత్యేకత సంతరించుకున్న దుబ్బాక మున్సిపల్‌ ఎన్నికలు.. 
సీఎం కేసీఆర్‌తో పాటు ఎంతో మంది రాజకీయ ఉద్దండులు, మేధావులను అందించిన దుబ్బాక మున్సిపల్‌లో తొలి ఎన్నికలు జరుగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాల ప్రత్యేకత సంతరించుకుంది. 20 వార్డులు,19,951 ఓటర్లు కలిగి ఉన్న దుబ్బాక మున్సిపల్‌ చైర్మన్‌ పదవి జనరల్‌ మహిళకు ఖరారు కావడంతో ఎన్నికలు అత్యంత రసవత్తరంగా తయారయ్యాయి.

దుబ్బాక మున్సిపల్‌పై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి ఉండడంతో తొలి పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గెలుపు గుర్రాలను బరిలో దింపడంపై కసరత్తులు చేయడంలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. అదే తరహాలో బీజేపీ కూడా ఎలాగైనా మున్సిపల్‌లో పాగా వేయడంపై వ్యూహారచనలో ఉన్నట్లు కనబడుతుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top