ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స

Free Medical Treatment For COVID-19 in Private Hospitals - Sakshi

ప్రైవేటు మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆసుపత్రుల్లోనూ ఉచిత వైద్యం 

అంగీకరించిన యాజమాన్యాలు..

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ అనుమానిత లక్షణాలున్నవారు ఇక నుంచి గాంధీ, ఫీవర్, ఛాతీ వంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోకే రానక్కర్లేదు. ఇష్టమైన కార్పొరేట్‌ ఆసుపత్రులు, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని అనుబంధ ఆసుపత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవచ్చు. అయితే వారికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మాత్రం గాంధీ ఆసుపత్రిలోనే చేస్తారు. ఇక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చేరినవారు ప్రత్యేకంగా నిర్ధారణ పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి రావాల్సిన అవసరం లేదు. గాంధీ ఆసుపత్రి సిబ్బందే ఆయా ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లి శాంపిళ్లను సేకరించుకొని వస్తారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి తీసుకుంది. వెంటనే ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి ఈటల రాజేందర్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి చర్చలు జరిపారు.

2 కేసులతో పరిస్థితి సీరియస్‌.. 
రాష్ట్రంలో ఇప్పటికే కోవిడ్‌ కేసు నమోదు కావడం, మరో రెండు కేసుల శాంపిళ్లను పుణేకు పంపించడంతో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారి సీరియస్‌గా మారింది. పైగా ఆ రెండు కేసుల్లోనూ కోవిడ్‌ పాజిటివ్‌ అనుమానిత శాంపిల్స్‌లో వైరల్‌ లోడ్‌ తీవ్రంగా ఉందని కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశాలుండటంతో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలోని 22 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు.. తమ కాలేజీల్లోని అనుబంధ ఆసుపత్రుల్లో కోవిడ్‌ ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. అలా గే చికిత్స కూ డా ఉచితం గా అందిస్తామని వెల్లడించాయి. 22 కాలేజీల్లో మొత్తం 1,080 వరకు ఐసోలేషన్‌ పడకలు అందుబాటులోకి రానున్నాయి. వారి దగ్గర చేరే రోగుల శాంపిల్స్‌ను విధిగా గాంధీ ఆసుపత్రికి పంపాలి. 

ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.. 
కోవిడ్‌ వైరస్‌ విస్తరించకుండా, సమగ్రంగా పర్యవేక్షించడం కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌లో దీన్ని గురువారం నుంచి అందుబాటులోకి తెస్తారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంట ర్‌ పరిధిలో 6 కమిటీలు ఏర్పాటు చేశారు.  

నేడు కమిటీ పర్యవేక్షకుల పేర్లు ప్రకటన.. 
కోవిడ్‌ పర్యవేక్షణపై ఏర్పాటు చేసిన ఆరు కమిటీల్లో ఆసుపత్రి మేనేజ్‌మెంట్‌ కమిటీ మొదటిది. ఇది ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సకు అవసరమైన సదుపాయాలు, ఇతర అంశాలపై పర్యవేక్షిస్తుంది. రెండోది సర్వైలెన్స్‌ కమిటీ.. ఇది కోవిడ్‌ వైరస్‌ తీవ్రత, కేసుల ట్రాకింగ్‌ను పర్యవేక్షిస్తుంది. మూడోది ఐఈసీ (ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్‌) కమిటీ. ఇది తన పరిధిలో కోవిడ్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం, అవగాహన కల్పించడంపై పర్యవేక్షిస్తుంది. నాలుగోది ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ. ఇది కోవిడ్‌కు సంబంధించిన మందులు, ల్యాబ్‌ పరీక్షలకు అవసరమైన యంత్రాలు, మాస్కుల కొనుగోలు అంశాలను పర్యవేక్షిస్తుంది. ఐదో కమిటీ ట్రైనింగ్‌ అండ్‌ కెపాసిటీ బిల్డింగ్‌. కమిటీల సభ్యుల పేర్లను పేర్లను గురువారం వెల్లడించ నున్నారు. ఈ కమిటీలన్నింటినీ పర్యవేక్షించేందుకు మంత్రి ఈటల నేతృత్వంలోని స్టేట్‌ మానిటరింగ్‌ కమిటీ ఆరోది.

కోవిడ్‌ చికిత్స అందించే మెడికల్‌ కాలేజీలు, వాటిలోని పడకల వివరాలు.. 
జూబ్లీహిల్స్‌ అపోలో మెడికల్‌ కాలేజీ: 30, భాస్కర మెడికల్‌ కాలేజీ, మొయినాబాద్‌: 50, చల్మడ ఆనందరావు, కరీంనగర్‌: 50, వీఆర్కే, మొయినాబాద్‌: 50, నార్కెట్‌పల్లి కామినేని: 50, మల్లారెడ్డి మెడికల్‌ కాలేజీ, కుత్బుల్లాపూర్‌: 50, బాచుపల్లి మమత కాలేజీ: 50, మేడ్చల్‌ మెడిసిటి: 50, ఎంఎస్‌ఆర్‌ కాలేజీ, సంగారెడ్డి: 50, ప్రతిమ కాలేజీ, కరీంనగర్‌: 50, షాదన్‌ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌: 50, కామినేని, ఎల్బీనగర్‌: 50, అయాన్‌ మెడికల్‌ కాలేజీ, మొయినాబాద్‌: 50, ఈఎస్‌ఐసీ, సనత్‌నగర్‌: 50, దక్కన్‌ కాలేజ్‌ , హైదరాబాద్‌: 50, మహేశ్వర మెడికల్‌ కాలేజీ, మెదక్‌: 50, మల్లారెడ్డి ఉమెన్స్‌ మెడికల్‌ కాలేజ్‌: 50, ఎస్వీఎస్‌ మెడికల్‌ కాలేజీ, మహబూబ్‌నగర్‌: 50, సురభి మెడికల్‌ కాలేజీ, సిద్దిపేట: 50, మమత మెడికల్‌ కాలేజీ, ఖమ్మం: 50, పట్నం మహేందర్‌ రెడ్డి మెడికల్‌ కాలేజీ, చేవెళ్ల: 50, ఆర్వీఎమ్‌ మెడికల్‌ కాలేజీ, మెదక్‌: 50  మొత్తం పడకలు:1,080

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top