చదువు ‘కొనా’ల్సిందే

Fee Structure In Private Schools  - Sakshi
    ఏడాదికి రూ.కోట్లలో విద్యావ్యాపారం

 విద్య వ్యాపారంగా మారడంతో ప్రైవేటు స్కూళ్లల్లో చదివించాలంటేనే బెంబేలెత్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం పిల్లలకు పుస్తకాల భారంతో తల్లిదండ్రులకు ఫీజుల బరువును తీసుకువచ్చింది. ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని ‘క్యాష్‌’ చేసుకోనేందుకు ప్రైవేట్‌ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. టెక్నో, డిజి, ప్రైమ్, స్పేస్, ఐఐటీ, ఒలింపియాడ్, ఈ–టెక్నో, ఆక్స్‌ఫర్డ్‌... తదితర పేర్లతో ఆకర్షిస్తున్నాయి. తమ పిల్లలకు ఉత్తమ భవిష్యత్తునివ్వాలన్న ఏకైక ఆశతో ఉన్న తల్లిదండ్రుల బలహీనతే ప్రైవేట్‌ విద్యాసంస్థలకు వరంగా మారుతోంది. దీన్ని ఆసరా చేసుకుని వారి నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి.

సాక్షి, నిర్మల్‌: శ్రీనివాస్‌.. ఓ మధ్యతరగతి తండ్రి. తనకున్న చిన్నపాటి వ్యాపారంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన రెండేళ్ల పాపను మంచి స్కూళ్లో చదివించాలని ముందుగా ఓ పేరున్న స్కూల్లో ఫీజులు, పుస్తకాలు, వాతావరణం, విద్య.. ఎలా ఉందో తెలుసుకునేందుకు వెళ్లాడు. అక్కడ వాతావరణం చూస్తే బాగానే ఉంది. కానీ ఫీజుల విషయానికి వచ్చేసరికి శ్రీనివాస్‌కు దిమ్మతిరిగినంత పనైంది. తన ముందున్న మేడమ్‌ ఫీజుల వివరాలు, పుస్తకాలు, యూనిఫాం ధరలు చెబుతుంటే నోరెళ్లబెట్టాడు. ‘మేడమ్‌ నాపాప రెండో తరగతి..’ అని చెబుతున్నంతలోనే ఆమె ‘ఎస్‌ సర్‌.. నేను చెప్పేది రెండో తరగతికే.. అంతా కలిపి రూ.35వేలు అవుతాయి..’ అని కరాఖండిగా చెప్పేసింది. శ్రీనివాస్‌ నోట మరో మాట రాలేదు. లేచి అలాగే.. బయటకు వచ్చేశాడు. ఓవైపు తన బిడ్డ భవిష్యత్తు.. అలాగని అంతంత ఫీజులు కట్టలేని పరిస్థితి. చివరకు చేసేది లేక.. తమ వద్ద ఉన్న రూ.20వేలకు మరో రూ.15వేలు అప్పు తీసుకుని బిడ్డను చదివించేందుకు సిద్ధమయ్యాడు.ఇలా ఈ ఒక్క శ్రీనివాస్‌కే కాదు. ఇవ్వాళ్ల చాలామంది పేద,మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉంది.

పుట్టుకొస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లు...
ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత కలిపి గత ఏడాది వరకు మొత్తం 196 ప్రైవేట్‌ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 50వేలకుపైగానే విద్యార్థులు చదువుతున్నారు. పలు మండలాలు, గ్రామాల్లో గుర్తింపు లేని పాఠశాలల సంఖ్య ఎక్కువే ఉంటుంది. ప్రభుత్వం పేర్కొంటున్న కనీస నిబంధనలనూ పాటించని స్కూళ్లే అధికం. మైదానం లేని పాఠశాలలు సంఖ్య 100కుపైనే ఉంటుంది. ఇక ఈఏడాది మరిన్ని ప్రైవేటు స్కూళ్లు ఏర్పడ్డాయి. గల్లీకో స్కూల్‌ చొప్పున కొత్తగా ప్రైవేటు బడులు వెలుస్తూనే ఉన్నాయి.

భారీగా ఫీజులు...
ఓ వైపు కోర్టులు ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ చేపట్టాలంటూ సూచనలు చేసినా సర్కారు పట్టించుకోవడం లేదు. ఇదే ప్రైవేటు విద్యాసంస్థలకు అవకాశంగా మారుతోంది. నర్సరీ చదువులకే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలోని పలు పాఠశాలల్లో నర్సరీ నుంచి 5వ తరగతి వరకు ఏడాదికి రూ.30వేల నుంచి సుమారు రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. అదే 6వ గరతి నుంచి 10వ తరగతి వరకు రూ.40వేల నుంచి రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నారు. పరీక్ష ఫీజు, స్పెషల్‌ ఫీజు, బస్‌ ఫీజు వీటికి అదనం. అంతేకాకుండా  యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, టై, బెల్టు, బ్యాడ్జీ తదితర వస్తువులన్నీ సంబంధిత పాఠశాలనే విక్రయిస్తోంది. లేదంటే తమకు చెందిన దుకాణాల్లో కొనుగోలు చేయాలని హుకూం జారీ చేస్తున్నారు. బయట మార్కెట్లో ఉన్న ధరలకంటే పాఠశాలల్లో వీటి ధర అధికంగా ఉంటోంది. అయినా అడిగేవారు లేకపోవడంతో దందా యథేచ్ఛగా సాగుతోంది. ఈ లెక్కన ఏడాదికి జిల్లాలోని ప్రైవేట్‌ స్కూళ్లలో విద్యావ్యాపారం దాదాపు రూ.100కోట్ల వరకు సాగుతోందని అంచనా.

చెక్కులు వద్దంటున్నారు...
కేంద్ర ప్రభుత్వం బ్యాంక్‌ లావాదేవీలను కఠినతరం చేయడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థలు కొత్త నిబంధనలను తెరపైకి తెచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించే సమయంలో చాలా స్కూళ్లల్లో నగదు మాత్రమే తీసుకురావాలని సూచిస్తున్నారు. చెక్కులు అయితే ప్రతీ లావాదేవీ అకౌంటబుల్‌ అవుతుంది. దీంతో ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. వీలున్నంతవరకు నగదు రూపంలో ఫీజులు చెల్లించాలని, లేని పక్షంలో ఏటీఎం కార్డుల ద్వారా కట్టాలని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే చెక్కులు తీసుకుంటున్నారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు లేకపోవడంతో తల్లిదండ్రులు చెక్కులు ఇవ్వడానికే ఆసక్తిచూపుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోంది.
 
ఉత్తర్వులు బేఖాతరు...
ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు, విద్యాహక్కు చట్టం నిబంధనలను ప్రైవేట్‌ స్కూళ్లు తుంగలో తొక్కుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పూర్తిగా బేఖాతరు చేస్తున్నాయి. విద్యాశాఖ అధికారులు సైతం నిబంధనల అమలును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.

పాటించని నిబంధనలు..
 జిల్లాలో ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయలేదు. 
♦  ప్రైవేట్‌ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీల ముచ్చటే లేదు. 
 ♦  పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ, యూ నిఫాం తదితరాలను విక్రయించొద్దని నిబం ధనలు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. 
 ♦ పాఠశాల ఫీజులతో పాటు పరీక్షల ఫీజులను నోటీసు బోర్డులపై పెట్టడం లేదు. 
♦   పాఠశాలల పేర్ల వెనుక డీజీ, టెక్నో, టాలెంట్, ప్రైమ్, స్పేస్‌ తదితర తోక పేర్లు రాయకూడదు. వీటిని పెద్దగా పట్టించుకోడం లేదు. 
 ♦  విద్యాహక్కు చట్టం నిబంధనలతో పాటు ప్రభుత్వ ఆదేశాలను ప్రైవేట్‌ పాఠశాలలు పాటించడం లేదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top