రుణ ప్రణాళిక ఎప్పుడో?

Farmers Waiting For Loans Mahabubnagar - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ఖరీఫ్‌ సాగుకు రైతాంగం సిద్ధమైంది. ఇటీవల కొన్ని వర్షాలు పడడంతో కొందరు రైతులు విత్తనాలను విత్తుకోగా.. కొంతమంది భూములను చదును చేస్తూ విత్తనాలను వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు పొలాల బాట పట్టారు. అయితే ఖరీఫ్‌ రుణ ప్రణాళిక మాత్రం జిల్లాలో ఇప్పటి వరకు ఖరారు కాకపోవడం రైతులకు శాపంగా మారింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పంటల పెట్టుబడులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఖరీఫ్‌ రుణ ప్రణాళిక ఆలస్యం చేయడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ప్రతి ఏటా బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. గతేడాది కూడా రుణ లక్ష్యంలో 67 శాతం మాత్రమే పూర్తి చేశారు. రుణాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఖరీఫ్, రబీకి బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

2.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్‌ సాగు.. 
జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్‌ లక్ష్యం 2,35,213 హెక్టార్లు కాగా వీటిలో వరి, మొక్కజొన్న, జొన్న, కందులు, ఇతర అన్ని కలిపి 1,04,248 హెక్టార్లు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. 1,30,965 హెక్టార్లలో పత్తి పంట సాగుకానుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తనాలు వేశారు. వర్షాలు కురిస్తే మరింత జోరందుకోనుంది. ప్రస్తుత ఖరీఫ్‌ పంటలకు, దాని అనుబంధ రంగాలకు రుణాలు అందించేందుకు గతనెల 30వ తేదీన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్‌ఎల్‌బీసీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి అన్ని జిల్లాల వార్షిక ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల రుణాలను కలిపి రూ.1.46లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు సైతం గతేడాది లక్ష్యం కంటే 6 నుంచి 10 శాతం పెంచి ఆ నిధులను కేటాయించే అవకాశం ఉంది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, బ్యాంకుల వారీగా కేటాయించాల్సి ఉంటుంది. ఆ పనిలోనే అధికారులు నిమగ్నం అయినట్లు తెలుస్తుంది. ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతేడాది రూ.1874.13కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా వాటిలో రూ.1,255.66కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అంటే 67శాతం మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాదైనా లక్ష్యం పూర్తవుతుందా వేచి చూడాలి.

రుణం కోసం ఎదురుచూపులు  
ఖరీఫ్‌ సాగు జిల్లాలో ఇప్పుడిప్పుడే జోరందుకుంది. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా రూ.5 వేలు ఇవ్వడం పెట్టుబడికి రైతులకు కొంత ఉపశమనం ఉన్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ఈ ఏడాది రైతుబంధు డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. దానికి తోడు పత్తి, మొక్కజొన్న, తదితర విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందు, కూలీల ధరలు విపరీతంగా పెరగడం వల్ల రైతులకు సాగు మరింత భారంగా మారింది. బ్యాంక్‌ అధికారులు స్పందించి వెంటనే రుణ ప్రణాళికను ఖరారు చేయాలని కోరుతున్నారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా జిల్లాలో పత్తిసాగు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. వర్షాలు కరిస్తే మరింత సాగు పెరిగే అవకాశం ఉంది.

పంట రుణాలకు రాయితీలు  
రైతన్నలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి ఎకరాకు రూ.5వేల చెప్పున రైతుబంధు చెక్కుల పంపిణీని ప్రారంభించారు. అదే విధంగా రుణాల విషయంలోనూ రైతాంగానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అందించే పంట రుణాలకు వడ్డీ రాయితీలను వర్తింపజేస్తున్నాయి. స్వల్పకాలిక రుణాలు తీసుకొని, సకాలంలో తిరిగి చెల్లించే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు పంట రుణాలకు 9శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇందులో రెండు శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకర్లకు చెప్పింది.

అందుకు అన్ని బ్యాంకుల యాజమాన్యాలు సమ్మతించాయి. దీంతో 7 శాతానికికే రుణాలు అందిస్తున్నారు. రూ.1లక్ష లోపు రుణం తీసుకొని ఏడాది లోపు పూర్తి బకాయి చెల్లిస్తే వడ్డీ ఉండదు. 7 శాతం వడ్డీలో కేంద్రం 3శాతం భరిస్తుండగా, మిగిలిన 4 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. అదే విధంగా రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణం తీసుకొని దానిని సకాలంలో చెల్లిస్తే వడ్డీలో 4 శాతం రాయితీ రైతులకు అందుతుంది. అందులో 3శాతం కేంద్రం, ఒక్కశాతం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లిస్తుంది. చాలా మంది రైతులకు రుణ వడ్డీ రాయితీపై అవగాహన లేని పరిస్థితి ఉంది. ఈ ఏడాదైనా వ్యవసాయ అధికారులు గానీ బ్యాంకు అధికారులు గానీ రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top