అప్పుల బాధతో మంగళవారం వేర్వేరుచోట్ల నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
సాక్షి, నెట్‌వర్‌క : అప్పుల బాధతో మంగళవారం వేర్వేరుచోట్ల నలుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామానికి చెందిన రైతు వెల్లాల పరశురాములు (38) ఎకరన్నర సొంత భూమి ఉండగా ఖరీఫ్‌లో పత్తి సాగు చేశాడు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట పూర్తిగా దెబ్బతింది. కుటుంబపోషణ, ఇతర అవసరాల నిమిత్తం సుమారు రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. వీటికి తోడు పత్తి పంట కూడా చేతికి అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గం లేక మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు.
జగదేవ్‌పూర్ మండలం నబీనగర్ గ్రామానికి చెందిన రైతు బీరోల్ల జహంగీర్ (35) తనకున్న రెండెకరాల్లో పత్తిని సాగు చేశాడు. వర్షభావ పరిస్థితుల వల్ల కారణంగా పంట అంతగా పండలేదు. ఈ పరిస్థితుల్లో పంట పెట్టుబడులు, కుటుంబ పోషణకు సుమారు రూ. 1.5 లక్షలకు పైగా అప్పు చేశాడు. అప్పులు తీర్చేందుకు జగదేవ్‌పూర్‌లో ఇటీవల పాలేరుగా చేరి పని చేస్తున్నాడు. అయితే మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన జహంగీర్.. యజమాని నరేందర్‌రెడ్డి ఇంటి వాకిట్లోకి వచ్చి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటికే నోట్లో నుంచి బురుగు వస్తుండడంతో పురుగు మందు తాగాడన్న అనుమానంతో నరేందర్‌రెడ్డి బాధితుడిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.
మహబూబ్‌నగర్ జిల్లాలో దంపతులు..
మహబూబ్‌నగర్ జిల్లా మాగనూర్ మండల కేంద్రానికి చెందిన రైతు కటిక చాంద్‌సాబ్(55) ఆయన భార్య రసూల్‌బీ(50) తమకున్న ఆరు ఎకరాల్లో ఖరీఫ్‌లో నాలుగు ఎకరాల్లో పత్తి సాగుచేశారు. పంట చేతికొస్తే ఉన్న రూ.లక్ష అప్పులు తీరుద్దామనుకున్నారు. తీరా దిగుబడి చేతికి రాకపోవడంతో మనోవేదనకు గురయ్యారు. అప్పుల విషయంపై మంగళవారం ఉదయం కుటుంబసభ్యుల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన భార్యాభర్తలు ఎప్పటిలాగే భోజనం చేసి పత్తి ఏరడానికి పొలానికి వెళ్లారు. మధ్యాహ్నం వేళ పంటకోసం తెచ్చిన మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.