36 గంటల నరకం.. 

Family Faced Problems Due To Corona Lockdown - Sakshi

హన్మకొండ అర్బన్‌ : బతుకుదెరువు కోసం పట్నం వెళ్లి సొంతూరుకు వచ్చిన ఓ కుటుంబానికి లాక్‌డౌన్‌ నరకయాతన చూపించింది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండ ప్రకాశ్‌రెడ్డిపేట ప్రాంతంలోని ఓ అద్దె ఇంట్లో బానోత్‌ రాజేందర్, సుమలత దంపతులు ఉంటున్నారు. వారికి రెండేళ్లపాప ఉంది. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆటో నడుపుకునే రాజేందర్‌ చేసేది లేక ఈనెల 10న వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని రాయపర్తి మండలం ఊకల్లు సమీపాన ఉన్న తన సొంతూరు బాలాజీతండాకు ఆటోలో బయల్దేరాడు. శుక్రవారం రాత్రి వారు ఇంటికి చేరుకున్నారు. శనివారం ఉదయం చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని ముగ్గురికి హోం క్వారంటైన్‌ ముద్రలు వేసి ఇంట్లోనే ఉండాలని ఆదేశించారు. అనంతరం రాయపర్తి పోలీసులు  ఇక్కడ ఉండొద్దని, ఆటోలో వెళ్లడానికి పాస్‌ ఇచ్చి మళ్లీ హన్మకొండకి పంపించారు.

అదే రాత్రి రాజేందర్‌ కుటుం బం హన్మకొండలోని ఇం టికి చేరుకున్నారు. అయితే చేతులకు హోం క్వారంటైన్‌ ముద్రలు వేసి ఉండటంతో ఇంటి యజమాని వారిని లోనికి రానివ్వలేదు. దీం తో రాజేందర్‌ కుంటుంబం అదేరోజు రాత్రి వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఉదయం చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం ఇవ్వగా అధికారులు వివరాలు తెలుసుకుని ‘మాకు సంబంధం లేదు.. ముందు ఇక్కడ నుంచి వెళ్లండి’.. అని ఆదేశించారు. రాజేందర్‌ అక్కడి నుంచి బయలుదేరి వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సంప్రదించగా సుబేదారి పోలీసులను కలవమనడంతో వెళ్లారు. అక్కడికి వచ్చిన ఏసీపీ జితేందర్‌రెడ్డికి పరిస్థితి వివరించడంతో వర్ధన్నపేట సీఐతో ఫోన్‌లో మాట్లాడారు.

హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి వాహనం పాస్‌ ఇచ్చి ఏలా పంపుతారని ప్రశ్నించారు. ఆ దంపతులను వారి ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వారికి ఆహారం ప్యాకెట్లు అందించి ఆటోలో బాలాజీ తండాకు వెళ్లమని చెప్పి.. ఏమైనా అవసరమైతే తమ సహాయం కోరమన్నారు. ఎట్టకేలకు రాయపర్తి స్టేషన్‌కు చేరుకోగా.. ‘ఇక్కడే ఉండండి ఆర్డీఓతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాము’అని ఎస్సై చెప్పారని బాధితులు తెలిపారు. మొత్తంగా 36 గంటల పాటు ఆ కుటుంబం నరకయాతన అనుభవించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top