నకిలీ మద్యం ముఠా గుట్టురట్టు

Fake Liquor Making Gang Arrested In Vikarabad District - Sakshi

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి అరెస్టు సామగ్రి స్వాధీనం

సాక్షి, పరిగి/తాండూరు: నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టు రట్టయింది. యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో తీగలాగితే వికారాబాద్‌ జిల్లాలో డొంక కదిలింది. యాదాద్రి, వికారాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరిని అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నట్లు సమాచారం. నకిలీ మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలైన స్పిరిట్, లేబుల్స్, మూతలు తదితర సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నాలుగు రోజుల క్రితం యాదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ఎక్సైజ్‌ పోలీసులు తనిఖీలు చేసి నకిలీ మద్యంతో పాటు మద్యం తయారీకి వినియోగించే సామగ్రిని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు.

అక్కడ అనుమానితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. కర్ణాటక, తాండూరు ప్రాంతం నుంచి ముడి పదార్థాలు సరఫరా అవుతున్నట్లు బయటపడింది. దీంతో యాదాద్రి, వికారాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం జిల్లాలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా పెద్దేముల్‌ మండలం నాగులపల్లిలో బెల్టు షాపు నిర్వహిస్తున్న బిచ్చయ్య, మరో వ్యక్తి మొగులయ్య నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. మొగులయ్యను అదుపులోకి తీసుకోగా బిచ్చయ్య పరారయ్యాడు. నాగులపల్లిలో తమ ఇళ్లలో తనిఖీలు చేసి లేబుళ్లు, స్పిరిట్‌ తదతితర మద్యం తయారీకి వినియోగించే ముడి పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

దోమలోనూ తనిఖీలు 
మొగులయ్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో దోమ మండల కేంద్రానికి చెందిన బెస్ల లక్ష్మణ్‌కు ఈ  వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో దోమలో సైతం దాడులు నిర్వహించి లక్ష్మణ్‌ ఇంట్లో మద్యం తయారికీ వినియోగించే  ముడి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, నకిలీ మద్యం తయారీ ప్రస్తుతం కాస్త మందగించినా గత ఎన్నికల సమయంలో పెద్దమొత్తంలో తయారు చేసి విక్రయించినట్లు ఎక్సైజ్‌ పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సందర్భంగా దోమ మండల కేంద్రంలో 150 నకిలీ లేబుల్స్, నాలుగు లీటర్ల స్పిరిట్, మద్యం బాటిళ్లను అధికారులు  స్వాదీనం చేసుకున్నారు.

మద్యం షాపుల్లో సోదాలు 
సోమవారం మొత్తం అధికారులు మద్యం షాపుల్లో ముమ్మరంగా సోదాలు నిర్వహిం చారు. దోమ, పెద్దేముల్,  తాండూరులో తనిఖీలు చేశారు. నకిలీ మద్యం వైన్‌ షాపులకు ఏమైనా సరఫరా అవుతుందా.. అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ భరత్‌భూషన్, పరిగి సీఐ చంద్రశేఖర్‌ ఇతర సిబ్బంది తనిఖీల్లో ఉన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top