కా‘లేజీ సార్లు’

Faculty Absence In Nizamabad Medical College - Sakshi

ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సహా అందరూ అంతే

ఎంసీఐ బృందం వచ్చినా ఖాతరు చేయని వైనం

హైదరాబాద్, వరంగల్‌ నుంచి రాకపోకలు

సాక్షి, నిజామాబాద్‌: భావి వైద్యులను తీర్చిదిద్దే వారే బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. నెలనెలా రూ.లక్షల్లో వేతనం తీసుకుంటూ విధులకు డుమ్మా కొడుతున్నారు. నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సిబ్బంది ఇష్టారాజ్యం నడుస్తోంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు నెలల తరబడి గైర్హాజరవుతున్నారు. వారి దారిలోనే మిగతా వారు కూడా కాలేజీకి ముఖం చాటేస్తున్నారు. వైద్యవిద్య బోధనతో పాటు వైద్య సేవలు అందించడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గొప్పలు చెప్పుకునే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, కళాశాల యంత్రాంగం పట్టించుకోక పోవడంతో వారి ఆటలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. రెండ్రోజుల క్రితం మెడికల్‌ కళాశాలలో పీజీ సీట్ల అనుమతి కోసం ఎంసీఐ బృందం ఆకస్మిక తనిఖీకి రావడంతో డుమ్మా మాస్టార్ల బాగోతం మరోసారి రట్టయింది. వారి గైర్హాజరు వల్ల అనుమతి లభించడంపై సందేహాలు నెలకొన్నాయి! 

తీరు మారేదెన్నడు?
పై నుంచి కింది స్థాయి దాకా ఉద్యోగులు, సిబ్బంది డుమ్మాలు కొట్టడంలో ముందున్నారు. మెడికల్‌ కళాశాలలో 12 మంది ప్రొఫెసర్లు, 94 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 32 మంది అసోసియేట్‌ ఫ్రొఫెసర్లు, 150 మంది వరకు సీనియర్, జూనియర్‌ రెసిడెన్షియల్‌ డాక్టర్లు కొనసాగుతున్నారు. అయితే, వీరిలో రోజు వారీగా వైద్యసేవలు అందించడంలో కొందరు తరచూ గైర్హాజరవుతున్నారు. 12 మంది ప్రొఫెసర్లలో 8 మంది హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో సగం మంది వరకు నెలలో సగం రోజులు డుమ్మా కొడుతున్నారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు 94 మంది ఉండగా వీరిలో చాలా వరంగల్, హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. 25 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తరచూ గైర్హాజరయ్యే జాబితాలో ఉన్నారు. 32 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లలో 8 మంది రెగ్యులర్‌గా డుమ్మా కొడుతున్నారు. ఇక సీనియర్, జూనియర్‌ రెసిడెన్షియల్‌ వైద్యుల్లో 30, 40 మంది తరచూ విధులు ఎగ్గొడుతున్నారు.

భయం లేని బయోమెట్రిక్‌!
ఆస్పత్రిలో బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలులో ఉన్నా ప్రయోజనం శూన్యం. 10–15 రోజులకు ఒకసారి ఆస్పత్రికి వచ్చి సెలవులను అధికారికంగా చూపించడం, అనంతరం రోజువారీగా అటెండెన్స్‌ పడేలా ‘ఒప్పందం’ చేసుకున్నట్లు సమాచారం. ఒక ప్రొఫెసర్‌ ఏడాది నుంచి అటు కాలేజీకి, ఇటు ఆస్పత్రికి రాకపోయినా పట్టించుకునే వారే లేరు. మెడిసిన్‌ విభాగంలో మరో వైద్యుడు మూడు నెలలుగా ముఖం చూపించడం లేదు. ఫోరెన్సిక్, పాథలాజికల్‌ విభాగంలో ఐదుగురు రోజుల తరబడి గైర్హాజరవుతున్నారు. కొన్ని నెలలుగా ఈ తతంగం కొనసాగుతోంది. సీనియర్, జూనియర్‌ రెసిడెన్షియల్‌ వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా ఖలీల్‌వాడిలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో హాజరు వేసుకుని, ఆ తర్వాత ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లి పోతున్నారు. నైట్‌ డ్యూటీలు అసలే చేయడం లేదు. ఇక, శని, ఆదివారాలు వస్తే చాలు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు.

పట్టింపు లేదా..?
ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ఇతరులు తరచూ గైర్హాజరవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. రెగ్యులర్‌గా డుమ్మా కొడుతున్న వైద్యుల వివరాలను కళాశాల అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరోవైపు ప్రజాప్రతినిధులు కూడా కళాశాల, ఆస్పత్రి వైపు కన్నెత్తి చూడడం లేదు. ఫలితంగా వారి ఇష్టారాజ్యం నడుస్తోంది. గతంలో 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎంసీఐ రెండుసార్లు అనుమతి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ తర్వాత మళ్లీ వదిలేశారు.

చర్యలు తప్పవు..
ఆస్పత్రిలో విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ఏ వైద్యుడు అయినా అనుమతి లేనిదే సెలవులో వెళ్లకూడదు. బయోమెట్రిక్‌ హాజరు కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వైద్యులపై చర్యలు తప్పవు. వైద్యులు ఇకనైనా సక్రమంగా వైద్యసేవలు అందించాలి. 
– డాక్టర్‌ దిన్‌దయాల్‌బంగ్, ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top