మెగాస్టారైనా.. ఓసారి ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోవాల్సిందే!

Face Recognition System In Shamshabad Airport - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఫేస్‌ రికగ్నిషన్‌ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజియాత్రలో భాగంగా విమానాశ్రయంలో డొమెస్టిక్‌ ప్రయాణికుల కోసం ఫేస్‌ రికగ్నిషన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల ఒకటిన ప్రారంభమైన ట్రయల్స్‌ 31 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటి వరకు 1,300 మంది తమ వివరాలను నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే రాజకీయ నేతలు, సినీ నటులు, వివిధ రంగాల ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్‌లు ముఖ కవళికల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. సినీ నటులు అక్కినేని నాగార్జున, చిరంజీవి, రాంచరణ్, అఖిల్‌ తదితరులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అలాగే ఈ జాబితాలో పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.    

ఫేస్‌ రికగ్నిషన్‌ ఇలా..
ప్రయాణికులు ప్రభుత్వం ధ్రువీకరించిన డ్రైవింగ్‌ లైసెన్సు, ఆధార్‌ వంటి గుర్తింపు కార్డు, ఫోన్‌ నంబర్, ఈ–మెయిల్‌ ఐడీతోపాటు పూర్తి వివరాలను ఫేస్‌ రికగ్నిషన్‌ కౌంటర్ల వద్ద సమర్పించాలి. వివరాలను పరిశీలించిన అనంతరం వారి ముఖాన్ని ఫొటో తీస్తారు. ఆ తర్వాత సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ప్రభుత్వ ఐడీ కార్డును తనిఖీ చేస్తారు. అనంతరం ఫేస్‌ రికగ్నిషన్‌ కోసం నమోదు చేసుకున్న ప్రయాణికుల పేరిట ఒక యూనిక్‌ డిజియాత్ర ఐడీ జనరేట్‌ అవుతుంది. ఫేస్‌ రికగ్నిషన్‌ అనేది ఒకేసారి జరిగే ప్రక్రియ. ఒకసారి ఈ నమోదు ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యాక ట్రయల్‌ పీరియడ్‌లో ప్రయాణికులు తమ డిజియాత్ర ఐడీని వినియోగించుకొని నేరుగా రాకపోకలు సాగించవచ్చు. ఫేస్‌ రికగ్నిషన్‌కు చెందిన గేట్‌ వద్దకు వెళ్లడానికి ముందు ప్రయాణికులు మొదట ఎయిర్‌ పోర్టులోని చెకిన్‌ కియోస్క్‌ల ద్వారా సెల్ఫ్‌ సర్వీస్‌ చెకిన్‌ లేదా వెబ్‌ చెకిన్‌ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

సాఫీ ప్రయాణం..
ఫేస్‌ రికగ్నిషన్‌ వివరాలు నమోదు చేయించుకున్న ప్రయాణికుల కోసం డిపార్చర్‌ గేట్‌ నం.3 వద్ద ప్రత్యేకమైన ఈ–గేట్‌ను ఏర్పాటు చేశారు. అక్కడ ప్రయాణికుల బోర్డింగ్‌ కార్డును స్కాన్‌ చేసిన అనంతరం వారు కెమెరాకు ఎదురుగా నిలబడతారు. గతంలో రిజిస్టర్‌ చేసుకున్న దానితో సరిపోల్చుకున్న అనంతరం ఈ–గేట్‌ తెరుచుకుంటుంది. దీంతో ప్రయాణికులు నేరుగా టెర్మినల్‌లోకి ప్రవేశించవచ్చు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉన్నందున సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది డిపార్చర్‌ గేటు వద్ద ప్రయాణ పత్రాలను, ఐడీని పరిశీలిస్తారు. అనంతరం సెక్యూరిటీ చెక్‌ నిమిత్తం ఒక డెడికేటెడ్‌ ఫేస్‌ రికగ్నిషన్‌ చానల్‌ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. దీనిని గేట్‌ నం.3 వద్ద ఉన్న ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెక్‌ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడి కెమెరా ప్రయాణికుల వివరాలను పరిశీలించిన అనంతరం సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది మరోసారి తనిఖీలు నిర్వహిస్తారు. వారి అనుమతి అనంతరం ప్రయాణికులు బోర్డింగ్‌కు వెళ్లవచ్చు.

ప్రత్యేక కౌంటర్లు..
ఫేస్‌ రికగ్నిషన్‌ వివరాలు నమోదు చేసుకునేందుకు 1, 3 డొమెస్టిక్‌ డిపార్చర్‌ గేట్ల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పద్ధతిలో ఒక్కసారి నమోదు చేసుకున్న ప్రయాణికులు ఆ తర్వాత పెద్దగా తనిఖీలు లేకుండానే తమ ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవచ్చు. దీంతో ఈ ప్రక్రియకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ఎంతోమంది తమంతట తాముగా వచ్చి వివరాలు, ముఖకవళికలను నమోదు చేసుకుంటున్నారని అధికారులు చెప్పారు.

దశల వారీగా విస్తరణ..
ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సదుపాయాన్ని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడలకే పరిమితం చేశారు. దశలవారీగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం హ్యాండ్‌ బ్యాగుతో వెళ్లే ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top