తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఉదయమే ముఖ్యమంత్రి అధికారిక నివాసంలోనూ, తరువాత మధ్యాహ్నం సచివాలయంలోనూ వీరు సుదీర్ఘంగా చర్చించారు. శాసనసభ సమావేశాల సందర్భంగా మూడు సభాసంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో వాటి ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చించినట్టుగా తెలిసింది. అసైన్డు భూముల అన్యాక్రాంతం, హౌసింగ్ సొసైటీల్లో అవకతవకలు, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై సభాసంఘాలను నియమించాలని గతంలోనే నిర్ణయం జరిగింది. ఈ సభాసంఘాల్లో ఎవరుండాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్టుగా సమాచారం. వీటితో పాటు రాష్ట్ర కేబినెట్ విస్తరణపైనా కసరత్తు జరిగినట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పుడప్పుడే ఉండే అవకాశాలు లేవని వారంటున్నారు.