'కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీని రద్దుచెయ్' | Sakshi
Sakshi News home page

'కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీని రద్దుచెయ్'

Published Sat, May 30 2015 10:04 PM

'కేసీఆర్.. దమ్ముంటే అసెంబ్లీని రద్దుచెయ్' - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అసెంబ్లీ రద్దు చేస్తానని సొంత పార్టీ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. తన పాలనపై నమ్మకం, గెలవగలననే దమ్ముంటే వెంటనే అసెంబ్లీ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కేసీఆర్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తుండడం వల్లనే సొంతపార్టీ ఎమ్మెల్యేలు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారని, అందుకే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో తెలంగాణ కోసం పోరాడిన వారు ఎవ్వరూ లేరని, అందుకే ఓటమి భయం పట్టుకుందని అన్నారు. టీఆర్‌ఎస్‌లో 30 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ విధానాలను, తెలంగాణ ద్రోహులకు లభిస్తున్న ఆదరణను వ్యతిరేకిస్తున్నారని అన్నారు.

వారంతా జూన్ 1న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ తఢాఖా చూపిస్తారన్నారు. మంత్రులుగా చలామణి అవుతున్న తలసాని, తుమ్మల వంటి నాయకులు ఏనాడైనా అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆత్మ ప్రభోదం మేరకు ఓటేయాలని, కేసీఆర్ బెదిరింపులకు లొంగవద్దని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే టీడీపీ సత్తా చూపిస్తుందన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వివేకానంద, మాగంటి గోపీనాథ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement