జోరందుకున్నఉపాధి పనులు

Employment Scheme Works Start in Nizamabad - Sakshi

పనికి రాకపోతే జాబ్‌కార్డు తొలగింపు

గ్రామాల్లో చాటింపు వేయిస్తున్న కార్యదర్శులు

గణనీయంగా పెరుగుతున్న కూలీల హాజరు

ఉపాధిహామీ పనుల్లో కూలీల హాజరు శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉపాధి పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య పది వేల మందికి పెరిగింది. కూలీలకు సగటున రోజుకు రూ.155 చొప్పున కూలీ గిట్టుబాటు అవుతోంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ఉపాధిహామీ పనుల్లో కూలీల హాజరు శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ పనులకు రాని కూలీల జాబ్‌కార్డులను తొలగిస్తామని ఈజీఎస్‌ పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో చాటింపులు వేయిస్తున్నారు. ఈజీఎస్‌ పనులు ఊపందుకుంటే గ్రామీణ ప్రజలకు స్థానికంగా ఉపాధి లభిస్తుంది. దీనికి తోడు మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు కూడా జనరేట్‌ అవుతాయి. మెటీరియల్‌ కాంపోనెంట్‌ నిధులు పెరిగితే ఆ నిధులతో ఇతర అభివృద్ధి పనులు కూడా చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలో ఉపాధిహామీ పనులపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. 

లాక్‌డౌన్‌ నేపథ్యంలో..
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు జోరందుకున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో వ్యవసాయ పనులు పెద్దగా లేవు. వరి కోతలు పూర్తయ్యాయి. పసుపు తవ్వకాలు, ఉడకబెట్టడం వంటి పనులు కూడా లేవు. దీనికి సమీప పట్టణాలకు వెళ్లి ఏదైనా పనులు చేసుకునే వారు ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఈ పనులకు కూడా వెళ్లలేకపోతున్నారు. దీంతో కూలీలు కూడా ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ పనులకు వెళుతున్న కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వారం రోజుల క్రితంతో ఇప్పుటికి పోల్చితే సుమారు పది వేల మంది ఎక్కువగా కూలీలు ఈ పనులకు హాజరవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత వారంలో అత్యధికంగా రోజుకు 56,393 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరుకాగా, శుక్రవారం ఈ సంఖ్య 65,450కి చేరింది. పైగా ఈ పనులకు వెళుతున్న వారికి రోజువారీ గరిష్ట కూలీ కూడా రూ.234లకు పెరగడంతో కూలీలు ఈ పనులు చేసేందుకు కొంత ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులే ఈ పనులను పర్యవేక్షిస్తున్న విషయం విధితమే. ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లు గతంలో సమ్మెకు దిగిన విషయం విధితమే. వీరు సమ్మె విరమించుకుని విధుల్లో చేరుతామని వచ్చినప్పటికీ.. ప్రభుత్వం వారిని విధుల్లో చేర్చుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదు. వీరి పనులను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించి పనులకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టిన విషయం విధితమే. జిల్లాలో 2.48 లక్షల జాబ్‌కార్డులుండగా, 5.12 లక్షల మంది కూలీలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2020–21లో ఇప్పటి వరకు ఈ పనులకు వెళ్లిన కూలీలకు వచ్చిన వేతనం సుమారు రూ.3.32 కోట్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ పనులకు వెళుతున్న కూలీలకు సగటున రోజుకు రూ.155 చొప్పున కూలీ గిట్టుబాటు అవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top