వారం రోజుల నుంచి తిరుగుతున్నా అధికారులు పింఛను ఇవ్వటం లేదంటూ ఆసరా పింఛను లబ్ధిదారులు ఆందోళనకు దిగారు.
ఏటూరునాగారం (వరంగల్) : వారం రోజుల నుంచి తిరుగుతున్నా అధికారులు పింఛను ఇవ్వటం లేదంటూ ఆసరా పింఛను లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని లంబాడితండా, రామన్నగూడెం గ్రామాల్లో ఆసరా లబ్ధిదారులు వందమందికి పైగా ఉన్నారు. వీరందరికీ స్థానిక పోస్టాఫీసులోనే పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. కాగా గత వారం రోజులుగా పోస్టాఫీసు చుట్టూ తిరుగుతున్నా అధికారులు పింఛను ఇవ్వటం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు గురువారం మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.