డబుల్‌ బెడ్‌ రూములు మరో లక్ష

Double Bedroom Hosing Scheme in Hyderabad - Sakshi

స్థలసేకరణ చేయాలని మేయర్‌ ఆదేశం

పురోగతిలోని ఇళ్ల నిర్మాణం 9నెలల్లో పూర్తి

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇప్పటికే  చేపట్టిన లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు రెండో దశలో మరో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణను చేపట్టాలని నగర మేయర్‌ బి. రామ్మోహన్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇళ్ల నిర్మాణ పురోగతిపై జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు,  కాంట్రాక్టర్లతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో మందగించిన డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు.  జీహెచ్‌ఎంసీలో  ఇప్పటికే పలు కాలనీలలో ఇళ్ల నిర్మాణం పూర్తయిందని,  మిగిలిన వాటికి  టైం లైన్లను నిర్ధారించి  పూర్తిచేయాలని  ఆదేశించారు.

నగరంలో చేపట్టిన  లక్ష బెడ్‌రూమ్‌  ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతున్నందున రెండో దశలో  మరో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇళ్లను కొత్తగా చేపట్టడానికి అవసరమైన భూసేకరణకు కలెక్టర్లను కోరాలని  సూచించారు. అవసరమైతే రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలకు స్థల సేకరణకు లేఖలు రాయాలని కోరారు.  డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇళ్ల నిర్మాణంపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే దాదాపు 10వేల ఇళ్లు పూర్తయినందున  ఈ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు  అందించేంత వరకు  భద్రతకై తగు సెక్యూరిటీ కల్పించాలని, అవసరమైతే ప్రహరీలను నిర్మించాలని మేయర్‌ ఆదేశించారు. మరో ఆరు నెలల నుండి 9 నెలల్లోపు  మిగిలిన వాటిని పూర్తిచేయాలన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించనున్నట్టు హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఇసుక పంపిణీ సమస్యపై సిరిసిల్ల కలెక్టర్‌తో పాటు మైనింగ్‌ విభాగం డైరెక్టర్‌లతో వెంటనే  ఫోన్‌లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపారు.

బిల్లుల చెల్లింపులోజాప్యం లేదు: కమిషనర్‌ దానకిశోర్‌ 
జీహెచ్‌ఎంసీ ద్వారా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో ఏవిధమైన జాప్యం లేకుండా వెంటనే చెల్లిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రూ. 3,710 కోట్లను చెల్లించామని,  మరో రూ. 190 కోట్లను చెల్లించేందుకు  చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నగరంలో  వివిధ కారణాలతో ఇంకా నిర్మాణం చేపట్టని 2,055 డబుల్‌ బెడ్‌రూమ్‌  ఇళ్ల నిర్మాణాలకు కేటాయించిన స్థలాలకు ప్రత్యామ్నాయంగా   దుండిగల్, డి.పోచంపల్లి, జవహర్‌నగర్‌లలో ఉన్న ఖాళీ స్థలాలను కేటాయించాల్సిందిగా సంబంధిత కలెక్టర్లను కోరామని కమిషనర్‌ తెలిపారు. వెయ్యికన్నా ఎక్కువ ఇళ్లున్న ‘డబుల్‌’ కాలనీల  వద్ద తప్పనిసరిగా పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు విద్యాశాఖను కోరనున్నట్లు తెలిపారు. కొల్లూర్‌ లాంటి మెగా హౌసింగ్‌ కాలనీ వద్ద ఉన్నత పాఠశాలతో పాటు కళాశాలలు కూడా ఏర్పాటు చేసేందుకు సంబంధిత విద్యాశాఖలను కోరనున్నట్టు  పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top