‘ఆపరేషన్‌ పేరుతో మా అమ్మను చంపేశారు’    | Sakshi
Sakshi News home page

‘ఆపరేషన్‌ పేరుతో మా అమ్మను చంపేశారు’   

Published Wed, Aug 22 2018 9:08 AM

Doctor Negligence In Rangareddy - Sakshi

షాద్‌నగర్‌టౌన్‌ రంగారెడ్డి : కంటి ఆపరేషన్‌ చేస్తామని తీసుకెళ్లి మా అమ్మను చంపేశారని, చావుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేశంపేట మండలం దత్తాయపల్లి గ్రామానికి చెందిన గంట్లవెళ్లి చెన్నమ్మ కుమారుడు సాయిలు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ ఆంజనేయులుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మృతురాలి కొడుకు సాయిలు మాట్లాడుతూ...  కంటివెలుగు పథకంలో భాగంగా దత్తాయపల్లి గ్రామంలో ఈనెల 17న వైద్య శిబిరం నిర్వహించారని, తన తల్లి చెన్నమ్మ పరీక్షల నిమిత్తం శిబిరానికి వెళ్లినట్లు తెలిపారు.  

కంటి పరీక్షల అనంతరం ఆపరేషన్‌ చేయాలంటూ చెప్పి ప్రభుత్వ వాహనంలో కొత్తూరులోని కంటి ఆస్పత్రికి తరలించారని, ఆమెతో పాటు గ్రామంలోని మరికొందరు కూడా వెళ్లినట్లు చెప్పారు. సాయంత్రం అయినా ఆపరేషన్‌ కోసం వెళ్లి నర్సమ్మ ఇంటికి తిరిగి రాలేదన్నారు. మరుసటిరోజు కొత్తూరు ఆసుపత్రి నుంచి మా ఇంటికి ఇద్దరు వ్యక్తులు చెన్నమ్మ పరిస్థితి విషమంగా ఉందని, షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారన్నారు.

విషయం తెలుసుకొని ఆస్పత్రికి వెళితే అప్పటికే చెన్నమ్మ మృతి చెందిందని డాక్టర్లు తెలిపారని కన్నీరుపెట్టుకున్నాడు. చెన్నమ్మ మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చెన్నమ్మ మృతి చెందిందని వాపోయారు. వినతిపత్రం అందించిన వారిలో సంఘమేశ్వర్, భీమయ్య, సురేష్, జంగయ్య, యాదయ్య ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement